పోలీస్ అలర్ట్ : జూబ్లీహిల్స్ టూ మాదాపూర్ ట్రాఫిక్ జాం

  • Published By: madhu ,Published On : September 30, 2019 / 01:27 PM IST
పోలీస్ అలర్ట్ : జూబ్లీహిల్స్ టూ మాదాపూర్ ట్రాఫిక్ జాం

Updated On : September 30, 2019 / 1:27 PM IST

నగరం మరోసారి తడిసి మద్దవుతోంది. సెప్టెంబర్ 30వ తేదీ సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ వర్షపు నీటితో నిలిచిపోయాయి. మోకాలికి పైగా నీరు ఉండడంతో వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడ్డారు. ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉండడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలు బారులు తీరి నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు.

దీనిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ట్వీట్ చేసింది. జూబ్లి హిల్స్ చెక్ పోస్టు – మాదాపూర్ ప్రాంతంలో కురిసిన వర్షానికి రోడ్లపై నీరు నిలిచిపోయిందని వెల్లడించింది. దీంతో రోడ్ నెంబర్ 45 గుండా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు తెలిపింది. ఈ రహదారుల గుండా ప్రయాణించే వాళ్లు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. 

కొన్ని రోజుల క్రితమే వరుణుడు సృష్టించిన బీభత్సానికి నగర ప్రజలు ఇంకా తేరుకొనకమునుపే మరోసారి విజృంభించాడు. సోమవారం మధ్యాహ్నం మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. దీంతో వర్షం పడుతుందని అనుకొనేలోగా..బేగంపేట, సికింద్రాబాద్, ప్యాట్నీ, అల్వాల్, తిరుమలగిరి ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. తర్వాత మరికొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. పంజాగుట్ట, అమీర్ పేట, కూకట్ పల్లి, కేపీహెచ్ బీ కాలనీ, జూబ్లి హిల్స్ చెక్ పోస్టు, బంజారా హిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం పడడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్లపై నీరు నిలవడం వల్ల కిలో మీటర్ల మేర వాహనాలు నిలబడడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.