చేయికి చుక్కలే ! : TRS ఆపరేషన్ ఆకర్ష్

గులాబీ పార్టీ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతోంది. కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చేలా వ్యూహ రచన చేస్తోంది. అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభా పక్షం అడ్రస్ గల్లంతు చేసేలా అడుగులు వేస్తోంది. ఇందుకోసం పక్కాప్లాన్ గీశారు కేసీఆర్. టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనానికి ముహూర్తం కూడా పెట్టేశారు. ఇంతకీ ఆ ముహూర్తం ఎప్పుడు? హస్తానికి హ్యాండిచ్చేదెవరు? టీఆర్ఎస్ పక్షాన నిలిచేదెవరు?
Also Read : 240 క్రిమినల్ కేసులు : 4 పేజీల యాడ్ : బీజేపీ టికెట్ పై పోటీ
TRS అపరేషన్ ఆకర్ష్ క్లైమాక్స్ చేరనుంది. ఇప్పటికే 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరిపోయారు. కేసీఆర్ సారధ్యంలో పని చేసేందుకు రెడీ అని ప్రకటించారు. అయినా వీరి చేరికను అధికార పార్టీ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసేందుకే దానిని పెండింగ్‌లో పెట్టారని తెలుస్తోంది. అయితే.. దీనికి త్వరగా శుభం కార్డ్ వేయాలని గులాబీ బాస్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ ను మొదలెట్టబోతోంది. కాంగ్రెస్ ఎల్పీ విలీనం కావాలంటే ఆ పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవాలి.
మొత్తం 19మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 13 మంది హస్తానికి హ్యాండిచ్చి కారెక్కేస్తే ఇబ్బందులు తలెత్తవని భావిస్తోంది. ఇప్పటికే 10మంది ఆల్రెడీ ఆ పని చేసేశారు. ఇక మరో ముగ్గురు వారి బాటలో నడిస్తేచాలు. అందుకే కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేలా గులాబీ పార్టీ పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా.. భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వీరుకూడా త్వరలోనే కారెక్కడం ఖాయమన్న చర్చ సాగుతోంది. స్థానిక ఎన్నికలలోపే ఈ విలీనం ప్రక్రియను దిగ్విజయంగా ముగించాలని కేసీఆర్ భావిస్తున్నారట. దీనిద్వారా కాంగ్రెస్‌ను మరింత డిఫెన్స్‌లోకి నెట్టాలని గులాబీ దళపతి వ్యూహాలు పన్నుతున్నారు.