మర్కజ్ యాత్రకు వెళ్లిన వాళ్లు పోలీసు స్టేషన్ లో రిపోర్టు చేయండి

కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ వ్యూహంతో పని చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. మర్కజ్ మసీదు గురించి సమాచారాన్ని కేంద్రానికి అందించింది తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన అన్నారు.
దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే తెలంగాణ లాక్ డౌన్ ప్రకటించిందని.. దేశానికే తెలంగాణ దిక్సూచిగా ఉందని ఆయన చెప్పారు. అంతర్జాతీయ విమానాలను రద్దు చేయమని ప్రధాన మంత్రి మోడీని మొదట కోరింది సీఎం కేసీఆరే అని ఆయన తెలిపారు.
రాష్ట్రం నుంచి వెయ్యి మందికి పైగా మర్కజ్‌కు వెళ్లినట్టుగా తెలిసిందని….వారిలో 160 మందిని తప్ప అందరినీ గుర్తించామని ఈటల తెలిపారు. కేవలం రెండు రోజుల్లోనే ఇంత మందిని గుర్తించి పరీక్షలు చేయిస్తున్నామంటే తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధి అర్థం చేసుకోవచ్చన్నారు. తెలంగాణలో కరోనా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగలేదన్నారు.
కరోనా వైరస్ నుంచి కోలుకున్న మరో ఇద్దరు బుధవారం గాంధీ ఆస్పత్రి డిశ్చార్జ్ అవుతున్నారని మంత్రి తెలిపారు. డిశ్చార్జ్ అయిన వారందరూ 14 రోజులపాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని కోరారు. తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు 6 గురు చనిపోయారని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా మర్కజ్ యాత్రకు వెళ్లి వచ్చిన యాత్రికుల వివరాలను పోలీసు డిపార్ట్ మెంట్ సేకరిస్తోందని…మర్కజ్ యాత్రకు వెళ్ళిన వారందరిని క్వారంటైన్ తరలించాలని పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. మర్కజ్ యాత్రకు వెళ్లి వచ్చినవారు స్వచ్ఛందంగా స్థానిక పోలీస్ స్టేషన్‌లలో రిపోర్ట్ చేయాలని ఈటల కోరారు.