58 కాదు 60 ? : పదవీ విరమణ వయసుపై కేసీఆర్ కసరత్తు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది.

  • Published By: veegamteam ,Published On : January 27, 2019 / 03:23 AM IST
58 కాదు 60 ? : పదవీ విరమణ వయసుపై కేసీఆర్ కసరత్తు

Updated On : January 27, 2019 / 3:23 AM IST

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది.

హైదరాబాద్‌ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచాలని సర్కార్ యోచిస్తోంది. పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచాలని ఆలోచిస్తోంది. వివాదాలకు తావు లేని రీతిలో నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఏర్పాటయ్యే తొలి కేబినెట్‌ సమావేశం నాటికి దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నారు. 2020 ఏప్రిల్‌ నుంచి పదవీ విరమణ వయసు పెంపును అమలు చేయాలని భావిస్తున్నారు. ఎటువంటి షరతులు లేకుండా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 60 ఏళ్ల వయసును పరిగణనలోకి తీసుకోవాలని ఉన్నతాధికారుల బృందం సీఎంకు సూచించినట్లు తెలిసింది.

 

టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ప్రస్తుతం ఉన్న 58 ఏళ్లను 61 సంవత్సరాలకు పెంచడం వల్ల న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నదని ఉన్నతాధికారవర్గాలు అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం 60 ఏళ్లు అమలు చేస్తున్నందున ఇక్కడ కూడా యథాతథంగా అమలు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నది ఆ వర్గాల అభిప్రాయంగా ఉంది. ఒకవేళ 61 సంవత్సరాలకు పెంచితే దానికి ప్రామాణికం ఏమిటని న్యాయస్థానాలు ప్రశ్నించే వీలుందని, అలా కాకుండా కేంద్రం అమలు చేస్తున్న విధానమే మేలన్నది ఉన్నతాధికారవర్గాల అభిప్రాయం.

 

ఒకవేళ పదవి విరమణ 61 ఏళ్లకు పెంచి 33 ఏళ్ల సర్వీసు లేదా 61 ఏళ్లు ఏది ముందయితే దాన్ని అమలు చేయాలన్న ప్రతిపాదన ఆచరణయోగ్యం కాదని ఉన్నతాధికారులు అంటున్నారు. ఎవరైనా 20 ఏళ్లకు ఉద్యోగంలో చేరితే 33 ఏళ్ల సర్వీసు తరువాత అంటే 53 ఏళ్లకు పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో 60 ఏళ్లు ఉద్యోగానికి అర్హులైనప్పుడు అంతకు ఏడేళ్ల ముందు పదవీ విరమణ ప్రతిపాదన బాగుండదన్నదే ఉన్నతాధికారుల వాదన. ఈ నేపథ్యంలో పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పరిమితం చేయాలన్నదానిపైనే ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.