ఆర్టీసీ సమ్మె 17వ రోజు : తాత్కాలిక డ్రైవర్ల జీతం పెంపు

చర్చల దిశగా ఇంతవరకు ముందడుగు పడకపోవడంతో సమ్మెపై వెనక్కు తగ్గేది లేదంటున్నారు ఆర్టీసీ కార్మికులు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆందోళనలను మరింత ఉధృతం చేస్తున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 21వ తేదీ సోమవారం తమ కుటుంబాలతో కలిసి అన్ని డిపోల వద్ద ధర్నాలు చేయబోతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు సమ్మె విరమించేది లేదని, ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించే వరకు పోరు కొనసాగుతుందని చెబుతున్నారు.
మరోవైపు ప్రభుత్వం కూడా జోరుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు అధిక సంఖ్యలో బస్సులను నడుపాలని నిర్ణయం తీసుకుంది. తాత్కాలికంగా నియమించిన డ్రైవర్ల జీతం రోజుకు మరో రూ. 260 పెంచాలని ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది.
ఇటు.. 24రోజుల సెలవుల తర్వాత విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్ధులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలపై కసరత్తు చేసిన తెలంగాణ ప్రభుత్వం… ఇప్పటి వరకు విధుల్లోకి తీసుకున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో సాధమైనన్ని ఎక్కువ బస్‌లు నడిపేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు.. బస్సుల్లో పాసులన్నీ చెల్లుబాటవుతాయని క్లారిటీ ఇచ్చింది. పాస్‌లున్నా టికెట్ తీసుకోవాలని ఒత్తిడి తెస్తే ఫిర్యాదు చేయాలని సూచించింది.
విద్యాసంస్థల ప్రారంభంతో వాటి బస్సులు సోమవారం నుంచి ప్రైవేట్ బస్సులు, సెవెన్ సీటర్ ఆటోలు, ఇతర వాహనాలను పెంచేందుకు ఆదేశాలిచ్చింది ప్రభుత్వం. ఆర్టీసీ పరిధిలోని గరుడ, రాజధాని ఏసీ బస్సులు మినహా అన్ని బస్సులను నిర్దేశించిన రూట్లలో నడిపేందుకు ప్రయత్నిస్తోంది. ఆర్టీసీ బస్సు, అద్దె బస్సుల్లో టికెట్లు ఇచ్చేలా ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు కండక్టర్లందరికీ టికెట్ జారీ యంత్రాలను అప్పగించింది.
బస్సుల్లో ఛార్జీలు అధికంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. బస్సులు పాడైనా.. వెంటనే మరమ్మతు చేసేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఐటీఐ విద్యార్థులను తాత్కాలిక ప్రాతిపదికన నియమించాలని భావిస్తోంది. మూడు రోజులకొకసారి బస్సుల చెకింగ్, ఓవరాలింగ్ వంటి పనులను వీరితో చేయించాలని అనుకుంటోంది.
Read More : హుజూర్ నగర్ ఉప ఎన్నిక : క్యూ కట్టిన ఓటర్లు