ఏప్రిల్ 11న సార్వత్రిక సెలవు : లోక్‌సభ ఎన్నికలు

హైదరాబాద్ : తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్న ఏప్రిల్ 11వ తేదీని సార్వత్రిక సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె.జోషి మార్చి 29 శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సాధారణ సెలవు అమలవుతుందని తెలిపింది. పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల ఏర్పాటుకు వినియోగించే ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థలు, ఇతర భవనాల్లో నిర్వహించే కార్యాలయాలకు పోలింగ్‌కు ముందు రోజు ఏప్రిల్ 10వ తేదీతోపాటు పోలింగ్ రోజు ఏప్రిల్ 11వ తేదీన స్థానిక సెలవు దినంగా ప్రకటించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ఇచ్చింది.
ఓట్ల లెక్కింపు జరుగనున్న మే 23న అవసరమైతే స్థానిక సెలవును ప్రకటించాలని కలెక్టర్లను కోరింది. ఏప్రిల్ 11న పోలింగ్ రోజు పరిశ్రమలు, కర్మాగారాలు, దుకాణాల్లో పనిచేసే కార్మికులకు వేతనంతో కూడిన సెలవును ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికలు జరిగే నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండి ఎన్నికలు జరుగని బయటి ప్రాంతంలో పనిచేసే ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులకు సైతం వేతనంతో కూడిన సెలవు వర్తిస్తుందని తెలిపింది.