హాట్ కేకుల్లా HMDA ప్లాట్లు : గజం రూ. 73 వేల 900

HMDA ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. వేలానికి అనూహ్య స్పందన వచ్చింది. ఆన్ లైన్ వేలంలో గజానికి అత్యధికంగా రూ. 73 వేల 900 ధర పలికింది. తక్కువగా రూ. 57 వేలు పలికింది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ఉప్పల్ భయాయత్‌లో డెవలప్‌మెంట్ చేసిన ప్లాట్లను ఆన్ లైన్‌లో ఏప్రిల్ 07వ తేదీ ఆదివారం వేలం నిర్వహించారు. ఉదయం, మధ్యాహ్నం ప్లాట్లను వేలం వేశారు. గజానికి రూ. 28వేలు ధర నిర్ణయించింది. వేలం స్టార్ట్ కాగానే అనూహ్యంగా ధర పెరుగుతూ పోయింది. ఉదయం వేలం వేసిన 18 ప్లాట్లకు రూ. 64.54 కోట్లు, మధ్యాహ్నం నిర్వహించిన మరో 18 ప్లాట్లకు రూ. 138 కోట్లు వచ్చాయి. మొత్తంగా హెచ్ఎండీకు రూ. 202 కోట్లు ఆదాయంగా వచ్చింది.
492.77 నుండి 853.34 గజాల లోపు ఉన్న 18 ప్లాట్లకు ఆన్ లైన్‌లో వేలం సాయంత్రం 4గంటల వరకు కొనసాగింది. బిడ్డర్ల పోటాపోటీగా ధరలు కోట్ చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. నార్త్ వెస్ట్ ప్లాట్‌ను రూ. 73 వేల 900 ధరకు బిడ్డర్లు దక్కించుకున్నారు. 18 ప్లాట్‌లలో తొమ్మిదింటికి గజానికి రూ. 60 వేల 900 నుండి రూ. 68 వేల 400 వరకు ధర కోట్ చేశారు. మిగిలిన 9 ప్లాట్‌లకు గజానికి రూ. 70 వేల 100 నుండి రూ. 73 వేల 900 వరకు ధర పలికింది.
మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు రెండో సెషన్ కొనసాగింది. తొలి సెషన్ ఆలస్యం కావడంతో రెండో సెషన్ రాత్రి 8గంటల వరకు వేలం కొనసాగింది. 900 గజాల నుండి 1200 గజాలున్న 18 ప్లాట్‌లను వేలం వేశారు. అత్యధికంగా గజానికి రూ. 67 వేల 500, అత్యల్పంగా రూ. 57 వేలు ధర పలికింది. మొత్తంగా ఈ 18 ప్లాట్‌లకు రూ. 138 కోట్ల ఆదాయం వచ్చింది.
ఆన్ లైన్‌లో వేలం కావడంతో సాంకేతిక సమస్యలు ఎదురు కాకుండా హెచ్ఎండీఏ అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎంఎస్‌టీసీకి ఆన్ లైన్ వేలం బాధ్యతలు అప్పగించారు. తొలి రోజు వేలం సాఫీగా జరిగింది..రెండో రోజు కూడా ఇదే విధంగా కొనసాగుతుందని హెచ్ఎండీఏ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.