ఉపశమనం: మరో 3 రోజులు వర్షాలు

  • Published By: chvmurthy ,Published On : April 20, 2019 / 03:34 AM IST
ఉపశమనం: మరో 3 రోజులు వర్షాలు

Updated On : April 20, 2019 / 3:34 AM IST

హైదరాబాద్ : ఎండవేడికి అల్లాడుతున్న ప్రజలకు గత రెండు రోజులుగా కురుస్తున్నవర్షాలు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి.  కొన్ని చోట్ల వడగళ్ల వానలు కురిసి పంట నష్టం జరుగుతున్నప్పటికీ ప్రజలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఈ వర్షాలు మరో 3 రోజులు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌తోపాటు సమీపంలో ఉన్న విదర్భ, తెలంగాణ ప్రాంతాల్లో 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ అధికారులు  చెప్పారు. దీంతో ఛత్తీస్‌గఢ్‌ నుంచి కోస్తా కర్ణాటక వరకు తూర్పు విదర్భ, తెలంగాణ, మధ్య కర్ణాటక మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది. తద్వారా హిందూ మహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది.

 దీని ఫ్రభావం వల్ల  రానున్న 3 రోజుల పాటు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఉరుములు, మెరుపులు, వడగండ్లు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో శుక్రవారం సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. భద్రాచలం, ఖమ్మం, మెదక్‌ జిల్లాల్లో శుక్రవారం సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది.