IPL 2019 Final : విజేత ఎవరు ?

  • Published By: madhu ,Published On : May 12, 2019 / 08:57 AM IST
IPL 2019 Final : విజేత ఎవరు ?

Updated On : May 12, 2019 / 8:57 AM IST

IPL 12 విజేత ఎవరన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. తిరుగులేని ఆధిపత్యంతో ఫైనల్‌ పోరుకు చేరిన ముంబయి ఇండియన్స్‌…. మధ్యలో తడబడి మళ్లీ తేరుకున్న చైన్నై సూపర్‌కింగ్స్‌లు టైటిల్‌ పోరులో ఢీ అంటే ఢీ అనబోతున్నాయి. దూకుడుగా వెళ్లే రోహిత్‌, వ్యూహారచనలో దిట్టైన ధోనీల్లో గెలుపెవరిదన్న ఆసక్తి అందరిలో నెలకొంది. 

ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగే ఫైనల్‌ మ్యాచ్‌కు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 2 వేల 8వందల మంది పోలీసులతో పాటు స్టేడియం పరిసరాల్లో 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉప్పల్‌లో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా రూట్‌మ్యాప్ సిద్ధం చేశారు. వాహనాల రద్దీని తగ్గించడానికి మెట్రో, ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మ్యాచ్‌ రాత్రి పదకొండున్నర వరకూ జరిగే అవకాశం ఉంది. 

మరోవైపు ఫైనల్‌ మ్యాచ్‌ను చూడాలనుకున్న ఫ్యాన్స్‌కు చుక్కలు కనిపించాయి. టికెట్ల గోల్‌మాల్‌ జరగడంతో రెట్టింపు ధర చెల్లిస్తామన్నా దొరకని పరిస్థితి నెలకొంది. ఐపీఎల్ టికెట్లను ఆన్‌లైన్‌లో పెట్టిన నిముషాల్లోనే అమ్ముడైపోయినట్లు సోల్డ్‌ఔట్ అని పెట్టేశారు. కొన్ని టికెట్లు మాత్రమే అమ్మి మిగిలిన వాటిని బ్లాక్ చేసినట్లు అభిమానులు ఆరోపిస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్స్‌, ఉప్పల్‌ స్టేడియం చుట్టూ చక్కర్లు కొట్టారు. టికెట్లు అమ్ముడైపోయాయని నిర్వాహకులు చెబుతున్నా బ్లాక్‌లో మాత్రం దందా జోరుగా సాగుతోంది.