ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ ఉంటుందా?
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ నిలువడం అనుమానంగా మారింది.

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ నిలువడం అనుమానంగా మారింది.
హైదరాబాద్ : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ నిలువడం అనుమానంగా మారింది. ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నిక కావడానికి 21 మంది ఎమ్మెల్యేల బలం కావాల్సి ఉన్నది. కాంగ్రెస్ తరఫున 19 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను కలుపుకొంటే తమకు సంఖ్యాబలం సరిపోతుందని కాంగ్రెస్ భావించింది. కానీ ఆ పార్టీకి చెందిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు సీఎం కేసీఆర్ పనితీరుకు ఫిదా అయ్యారు. వీరిద్దరూ టీఆర్‌ఎస్‌లో చేరడం దాదాపు ఖాయమైంది. అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తామని వారు ఇప్పటికే ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ బలం 19 నుంచి 17కు పడిపోయింది.
మరోవైపు టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమకే మద్దతు ఇస్తారన్న ఆశలపైనా నీళ్లు చల్లినట్టయింది. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య త్వరలోనే టీడీపీకి రాజీనామా చేస్తానని, టీఆర్‌ఎస్‌లో చేరుతానని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ముగ్గురు ఎమ్మెల్యేల లోటు ఏర్పడింది. 21 మంది ఎమ్మెల్యేల బలం ఉందన్న నమ్మకంతో కాంగ్రెస్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవికి అభ్యర్థిని బరిలో నిలిపింది.
కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీ పదవికి గూడూరు నారాయణరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్‌కు ముగ్గురు తగ్గడంతో ఆయన బరిలో ఉంటారా? తప్పుకుంటారా? అనే అయోమయం నెలకొంది. సంఖ్యాబలం లేకుండా పోటీచేయడం మంచిది కాదని చాలా మంది కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు. ఇలా పోటీచేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని సీఎల్పీ సమావేశంలో నేరుగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో చెప్పినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో గూడూరు నారాయణరెడ్డి ఎమ్మెల్సీ బరిలో నుంచి తప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది. మార్చి 5 మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. అప్పటి లోపే కాంగ్రెస్.. పోటీ నుంచి తప్పుకుంటే టీఆర్‌ఎస్ నుంచి నలుగురు, ఎంఐఎం నుంచి ఒకరు చొప్పున ఎమ్మెల్యే కోటా కింద మొత్తం ఐదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా గెలుస్తారు.