ఏపీలో డేటా దొంగతనం జరిగింది.. బాబే కారణం : జగన్

ముఖ్యమంత్రి చంద్రబాబుపై పోరును వైసీపీ మరింత ముమ్మరం చేసింది. ఐటీ గ్రిడ్ అంశం ఏపీలో రచ్చ చేస్తోంది. రాష్ట్రంలో రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్ రాజ్ భవన్‌కు చేరుకుని బాబుపై కంప్లయింట్ చేశారు. దీనిపై జోక్యం చేసుకోవాలని కోరారు. సీఎం స్థాయిలో ఉన్న బాబు సైబర్ క్రైంకి పాల్పడ్డారని, బాబు..లోకేష్‌లు జైలుకు వెళ్లాల్సిన అంశమన్నారు. ఐటీ గ్రిడ్ కంపెనీ తెలంగాణలో ఉంటే ఇక్కడే కేసు నమోదు చేస్తారు కానీ..ఆంధ్రలో ఎందుకు కేసు బుక్ చేస్తారని ప్రశ్నించారు. 59 లక్షల ఓట్లను అక్రమంగా చేర్చారని..ఫాం 7 నింపి ఓట్లను తొలగించాలని దరఖాస్తు చేయడం తప్పు కాదన్నారు జగన్. రాబోయే రోజుల్లో చీఫ్ ఎలక్షన్ కమిషన్ కలుస్తామన్నారు.
మార్చి 06వ తేదీ బుధవారం గవర్నర్ నరసింహన్‌తో కలిసిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సైబర్ క్రైంకు పాల్పడితే..దొంగతనం కాదా ? అని గవర్నర్‌కు చెప్పినట్లు తెలిపారు. సీఎం బాబు చేసిన పనిని సవివరంగా చెప్పినట్లు..దేశ, రాష్ట్ర చరిత్రలో ఇలాంటి సైబర్ క్రైం జరగలేదోమో అనే అనుమానం వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాల నుండి ఒక పద్ధతిలో దుర్బుద్దితో సైబర్ క్రైంకు పాల్పడ్డారని ఆరోపించిన జగన్..ఐటీ గ్రిడ్ కంపెనీలో రైడ్ జరిగిన అనంతరం ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని ఆయన అన్నారు.
టీడీపీ పార్టీకి చెందిన సేవా మిత్ర యాప్ తయారు చేసింది ఐటీ గ్రిడ్ అని గుర్తు చేశారు జగన్. ఇందులో ఉండకూడని డేటా, ఆధార్ డిటైల్స్, ఏ రకంగా సేవా మిత్ర యాప్‌లో ఎందుకు కనబడుతున్నాయని సూటిగా ప్రశ్నించారు. ఓటర్ల ఐడీ డేటా..కలర్ ఫొటోలతో కనిపిస్తున్నాయని అంతేకాదు…బ్యాంకు అకౌంట్స్ డిటైల్స్ కూడా ఉన్నాయన్నారు. ఐటి గ్రిడ్ కంపెనీలో ఉన్న కంప్యూటర్స్ కనబడడం సబబేనా ? అని ప్రశ్నించారు. ఇన్ని ఉంటే ప్రజలు మోసపోరా ? అన్నారు. ప్రభుత్వం నిర్వహించిన సర్వేల్లో వెల్లడైన డేటాను అనుసంధానం చేశారని, ఓటర్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు ? ఎవరికి ఓటు వేసే ఛాన్స్ ఉందో తెలుసుకోవడానికి టీడీపీ నేతలు ప్రతింటికి వెళుతున్నారని తెలిపారు. ఓటు వేస్తారన్న వారి ఓట్లను రెండు సార్లు ఎంట్రీ చేస్తున్నారని..ప్రతిపక్షాలకు ఓటు వేస్తారని అనుకుంటే వారి ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు.
కేవలం 1 % తాము ఓడిపోయామని మరోసారి గుర్తు చేశారు జగన్. 56 లక్షల ఓట్లు డూప్లికేట్‌లుగా ఉన్నాయని తాము గుర్తించి కోర్టు మెట్లు ఎక్కినట్లు గుర్తు చేశారు. సీఈసీ రిపోర్టు ఇచ్చిన తరువాత వెరిఫై, యాక్షన్ తీసుకోలేదని..ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఇప్పడు డూప్లికేట్ ఓట్ల సంఖ్య 3 లక్షలకు చేరిందన్నారు. మళ్లా ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసి 59 లక్షల ఓట్ల డిటైల్స్ ఇచ్చామన్నారు. ఈ ఓట్లను తొలగించాలని, లేని ఓట్లను చేర్చాలంటూ ఫాం 7, ఫాం 6 నింపి ఇస్తున్నామని..ఎన్నికల సంఘానికి తాము సహకరిస్తుంటే టీడీపీ ప్రభుత్వం పోలీసులను పంపించి వేధిస్తున్నారని ఆరోపించారు జగన్. గవర్నర్‌ను కలవడం..ఆపై ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను టీడీపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి మరి.