డాక్టర్ ట్రంప్ కొత్త థియరీ : కరోనాకు మందు సూర్యకిరణాలే…పేషెంట్ల శరీరాల్లోకి క్రిమిసంహార మందులను ఎక్కిస్తే

అగ్రరాజ్యంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న సమయంలో ఆకతాయి పిల్లోడి మాదిరిగా అమెరికా అధ్యక్షుడు చేస్తున్న వింత వాదనలు ఆ దేశ ప్రజల్లో భయాలను మరింత పెంచుతున్నాయి. వైట్ హౌస్ నుంచి ట్రంప్ చేస్తున్న ప్రకటనలపై ఆ దేశ సైంటిస్టులు, డాక్టర్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎండలో కరోనా వైరస్ బతకలేదని, అతినీలలోహిత(ఆల్ట్రా వయెలెట్) కిరణాలతో దాన్ని సంహరించొచ్చని, అదీకాకుంటే, కొవిడ్-19 రోగుల శరీరాల్లోకి క్రిమిసంహారక మందుల్ని ఇంజెక్ట్ చేసైనా సరే వైరస్ ను అంతం చేయొచ్చని, ఈ మేరకు ప్రయోగాలు చేస్తున్నట్లు గురువారం వైట్ హౌస్ వేదికగా ట్రంప్ అన్నారు.
అయితే ట్రంప్ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే దేశవ్యాప్తంగా సైంటిస్టులు, డాక్టర్లు గొల్లుమన్నారు. ప్రజలు బెంబేలెత్తిపోతున్నవేళ ఇలాంటి ప్రమాదకర ప్రకటనలు చేయడం సరికాదని, ప్రెసిడెంట్ గా ఉంటూ పిచ్చిపట్టినట్లు వ్యవహరించడం సరికాదని తిట్టిపోశారు. వాస్తవానికి ట్రంప్ కంటే ముందు వైట్ హౌస్ లో విలేకరులతో మాట్లాడిన అమెరికా ప్రభుత్వ విభాగమైన ‘హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ అధికారి బిల్ బ్రయాన్…అతినీలలోహిత కిరణాలు కరోనాపై గణనీయ ప్రభావాన్ని చూపుతున్నట్టు తమ అధ్యయనంలో తేలిందన్నారు
.ఎండ వేడి పెరిగిన కొద్దీ ఏదేని ఉపరితలం లేదా గాలిలో ఉన్న వైరస్ వేగంగా చనిపోతున్నదని చెప్పారు. ఉష్ణోగ్రతలు 21-24 డిగ్రీ సెల్సియస్ మధ్య, గాలిలోని తేమ 20 శాతం ఉన్నప్పుడు స్టెయిన్‌లెస్ స్టీల్ వస్తువులపై ఉండే కరోనా వైరస్ జీవిత కాలం 36 గంటలు ఉంటే.. సూర్యకాంతిలో కొన్ని నిమిషాల్లోనే వైరస్ చనిపోయిందని చెప్పారు. ఇదే ఉష్ణోగ్రతల వద్ద గాలిలో వైరస్ జీవితకాలం దాదాపు రెండు గంటలు ఉండగా.. సూర్యకాంతిలో కేవలం ఒకటిన్న నిమిషంలోనే నశించిందన్నారు. అయితే దీనికి సబంధించిన పత్రాలను మాత్రం విడుదల చేయలేదు.
అయితే తన వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తుండటంతో ట్రంప్ శుక్రవారం స్పందిచారు. తాము వ్యంగ్యంగా ఆ వ్యాఖ్యలు చేసినట్లు సృష్టం చేశారు. కాగా, కరోనా నేపథ్యంలో మూతపడ్డ వ్యాపార, వాణిజ్యాలను రీఓపెనింగ్ చేసే విషయంలో ఫెడరల్ ప్రభుత్వానికి, రాష్ట్రాల గవర్నర్లకు మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయి. తాను చెప్పేదాకా రీఓపెనింగ్ చేయొద్దని ప్రెసిడెంట్ ట్రంప్ పదేపదే హెచ్చరించినా, జార్జియా గవర్నర్ బ్రియాన్ కెంప్.. తన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో సడలింపులు ప్రకటించేశారు. జార్జియాలో 22వేలకు పైగా కరోనా కేసులు ఉండగా,900 మంది ప్రాణాలు కోల్పోయారు. మిషిగన్ రాష్ట్రంలోనైతే లాక్ డౌన్ ఎత్తేయాలంటూ ప్రజలు రోడ్లపై ఆందోళనలు చేస్తున్నారు. చాలా రాష్ట్రాలు రీ ఓపెనింగ్ కు మొగ్గుచూపుతుండటం గమనార్హం.
అయితే ఇప్పటివరకు అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 925,758కి చేరగామరణాల సంఖ్య 52,217కి చేరుకుంది. 110,432మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా 277,455 కరోనా కేసులు నమోదవగా,21,291మంది మరణించారు.