భూకంపం ఎంత పనిచేసింది..! జైలు నుంచి 200 మందికిపైగా ఖైదీలు పరార్.. తుపాకులు లాక్కొని కాల్పులు.. పాకిస్తాన్ కరాచీలో హై అలర్ట్..

కరాచీలోని అత్యంత భద్రత కలిగిన మాలిర్ జైలు నుంచి ఖైదీలు తప్పించుకున్నారు. సోమవారం రాత్రి మాలిర్ జిల్లా జైలు ప్రాంతంలో భూకంపం సంభవించింది.

భూకంపం ఎంత పనిచేసింది..! జైలు నుంచి 200 మందికిపైగా ఖైదీలు పరార్.. తుపాకులు లాక్కొని కాల్పులు.. పాకిస్తాన్ కరాచీలో హై అలర్ట్..

Malir Jail in Karachi

Updated On : June 3, 2025 / 1:58 PM IST

Pakistan: పాకిస్థాన్ లోని కరాచీలో హై అలర్ట్ ప్రకటించారు. కరాచీలోని మలిర్ జిల్లాలోని జైలు నుంచి 200మందికిపైగా ఖైదీలు పరారయ్యారు. జైలు అధికారుల నుంచి తుపాకులు లాక్కొని కాల్పులు జరుపుతూ పరారయ్యారు. ఈ ఘటనలో ఒక ఖైదీ మరణించగా.. నలుగురు అధికారులు గాయపడ్డారు.

 

కరాచీలోని అత్యంత భద్రత కలిగిన మాలిర్ జైలు నుంచి ఖైదీలు తప్పించుకున్నారు. సోమవారం రాత్రి మాలిర్ జిల్లా జైలు ప్రాంతంలో భూకంపం సంభవించింది. మూడు సార్లు స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో జైలులోని కొన్ని గోడలకు పగుళ్లు రాగా.. మరికొన్ని కుప్పకూలాయి. దీంతో 700 నుంచి వెయ్యి మందికిపైగా ఖైదీలను వారి బ్యారక్ ల నుంచి వేరే చోటుకి అధికారులు తరలించారు. ఈ క్రమంలోనే అధికారుల కళ్లుగప్పి ఖైదీలు పారిపోయారు.

 

భూకంప భయాందోళనల కారణంగా ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పలువురు ఖైదీలు పారిపోయే సమయంలో జైలు అధికారుల నుంచి తుపాకులు లాక్కొని కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక ఖైదీ మరణించగా.. నలుగురు అధికారులు గాయపడ్డారు. పారిపోతున్న 80మందికిపైగా ఖైదీలను స్థానికుల సహాయంతో అధికారులు పట్టుకొని జైలుకు తరలించారు.


సింధ్ హోంమంత్రి జియా ఉల్ హసన్ లంజార్ మాట్లాడుతూ.. ఖైదీలు గోడను కాకుండా ప్రధాన ద్వారం గుండా ప్రవేశించారని అన్నారు. గందరగోళం సమయంలో దాదాపు 100 మంది ఖైదీలు ప్రాంగణం నుంచి పారిపోగలిగారు. భూ ప్రకంపనల కారణంగా ఒక గోడకు పగుళ్లు వచ్చాయి. కానీ, దానిని తప్పించుకోవడానికి ఉపయోగించలేదని ఆయన చెప్పారు. జైలు నుంచి పారిపోయిన ఖైదీల కోసం పోలీసులు, భద్రతా దళాలు వెతుకులాట ప్రారంభించాయి. ఈ క్రమంలో కరాచీ అంతటా చెక్ పోస్టులును ఏర్పాటు చేశారు. నగరం అంతటా హై అలర్ట్ ప్రకటించారు.

జాతీయ రహదారులపై నిఘా ఏర్పాటు చేశారు. పలు రహదారులను మూసివేశారు. ఇదిలాఉంటే.. ఈ జైలులో మాదకద్రవ్యాల సంబంధిత కేసుల్లోని నేరస్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారని ఓ అధికారి వెల్లడించారు. మరోవైపు జైలు సిబ్బంది నిర్లక్ష్యంపై దర్యాప్తు చేయాలని సింధ్ ప్రభుత్వం ఆదేశించింది.