ట్రయల్స్ సక్సెస్ సరే.. 7 నెలలు దాటినా కరోనా వ్యాక్సిన్ ఎందుకు రెడీకాలేదంటే?

కరోనా వైరస్ బారినపడి ప్రపంచంలో ఇప్పటిదాకా ఆరు లక్షల మందికిపైగా చనిపోయారు. కోటిన్నర మందికిపైగా మహమ్మారి బారిన పడ్డారు. 2019 డిసెంబర్‌లో చైనాలోని వుహాన్‌లో పుట్టిన కోవిడ్ 19 ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాపించింది.
ఏడు నెలలు దాటుతున్నా ఇప్పటిదాకా ఈ వైరస్‌కి ప్రామాణికమైన మెడిసిన్ లేదంటే వ్యాక్సిన్ గానీ రాలేదు. ప్రస్తుతం వరల్డ్ వైడ్‌గా 23 వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో మనుషులపై నిర్వహిస్తున్న వ్యాక్సిన్ ట్రయల్స్‌లో తొలి దశ, రెండో దశల్లో సత్ఫలితాలు ఇచ్చాయి.
ఆక్స్‌ఫర్డ్ టీకా తొలి దశ విజయవంతం :
ప్రపంచంలోనే మొదటిసారిగా కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో మొదలయ్యాయి. ఏప్రిల్‌లోనే అక్కడ మనుషులపై ట్రయల్స్ మొదలుపెట్టారు.
మొదటి దశలో 800 మందిని ఈ ప్రయోగాలకు ఎంపిక చేశారు.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని ఓ పరిశోధకుల బృందం ఈ వ్యాక్సిన్‌ను తయారుచేసింది. మనుషులపై వ్యాక్సిన్ తొలి దశ సూపర్ సక్సెస్ అయింది. ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో మంచి ఫలితాలనిచ్చింది. రెండు దశల్లో ఇచ్చిన ఫలితాలతో మూడో స్టేజ్‌కి ప్రిపేర్ అవుతోంది ఆక్స్‌ఫర్డ్.
జూలై 27 నుంచి 30వేల మందిపై వ్యాక్సిన్ ప్రయోగం :
అమెరికాలో పరీక్షించిన కోవిడ్-19కి సంబంధించిన మరో వ్యాక్సిన్ కూడా పరిశోధకులు ఆశించినట్లుగా మంచి ఫలితాలు ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ చేయాల్సి ఉంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, మోడెర్నా సంస్థల్లో డాక్టర్ ఫౌచీ బృందం ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది.
జులై 27 నుంచి 30 వేల మందిపై ఈ వ్యాక్సిన్‌ను పరీక్షించనున్నారు. ఇదే దేశానికి చెందిన మోడర్న్ థెరాప్యుటిక్స్ సంస్థ mRNA-1273 వ్యాక్సిన్‌ను తయారుచేస్తోంది. ఇప్పటికి రెండు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయి. అలాగే ఇనోవియో ఫార్మాసూటికల్స్ INO-4800 వ్యాక్సిన్ తయారు చేస్తోంది. ప్రయోగాల తొలి దశలో సత్పలితాలు ఇచ్చినట్టు ఆ సంస్థ పేర్కొంది.
వచ్చే నెలలో వ్యాక్సిన్ వస్తుందని ఆశాభావం :
కరోనా వ్యాక్సిన్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రపంచానికి రష్యా శుభవార్త అందించింది. మహమ్మారికి చెక్ పెట్టడానికి రూపొందించిన టీకా సిద్ధమైనట్లు ప్రకటించింది. క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయని.. వచ్చే నెలలో వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు.
వ్యాక్సిన్‌పై ప్రయోగాలు విజయవంతం కావడంతో ఉత్పత్తికి సంబంధించిన చర్యలు వేగవంతం చేసినట్లు వివరించారు. ఆగస్టు 3 నుంచి రష్యా, సౌదీ ఆరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఈ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఇందు కోసం ఇప్పటికే వేలాది మందిని ఎంపిక చేశారు. దీనికి సమాంతరంగా ఈ టీకాను ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.
విదేశాల్లో తయారుకానున్న 3కోట్ల డోసులు :
రష్యాలో కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి అనేక ప్రయోగాలు జరుగుతున్నా.. సెచినోవ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ మెరుగైన ఫలితాలు ఇస్తుంది. గత కొన్ని రోజులుగా ఈ వ్యాక్సిన్ అభివృద్ధి కోసం రష్యన్ శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే రెండు దశల క్లినికల్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ వ్యాక్సిన్.. ప్రపంచంలో క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న తొలి కరోనా వ్యాక్సిన్‌గా గుర్తింపు పొందింది.
ఇదే క్రమంలో ప్రపంచంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే తొలి కరోనా టీకాగా నిలవనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్టు 3 నాటికి ఈ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా మూడు కోట్ల డోస్‌లను ఉత్పత్తి చేయనున్నట్టు రష్యా ప్రకటించింది. మరో 17 కోట్ల డోస్‌లు విదేశాల్లో తయారవుతాయని తెలిపింది. వ్యాక్సిన్ తయారీకి 5 దేశాలు అంగీకారం తెలిపినట్టు రష్యా చెబుతోంది.
మూడో దశ ట్రయల్స్‌కి బంగ్లాదేశ్ ఆమోదం :
చైనా ఈ ఏడాది చివరి వరకు వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకోస్తుందని ఆ దేశ ఎసెట్స్ సూపర్‌విజన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కమిషన్ నమ్మకంతో ఉంది. వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్, బీజింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ కలిసి తయారుచేసిన వ్యాక్సిన్‌ను రెండు వేల మందిపై ప్రయోగించారు.
అయితే ఇప్పటివరకూ ఓ ప్రామాణికమైన వ్యాక్సిన్ అభివృద్ధి చేసినట్లైతే చైనా ప్రకటించలేదు. డ్రాగన్ కంట్రీకి చెందిన సినోవెక్ బయోటెక్ సంస్థ తమ వ్యాక్సిన్‌తో బంగ్లాదేశ్‌లో ట్రయల్స్ చేస్తోంది. దీని మూడో దశ ట్రయల్స్‌కు బంగ్లాదేశ్ ఆమోదం తెలిపింది. ఇవే కాకుండా మరికొన్ని వ్యాక్సిన్లు తెచ్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఎస్‌జీఎంఐ LV-SMENP-DC వ్యాక్సిన్ :
చైనా సంస్థ కైంసినో AD5-nCoV అనే వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. దీని మూడో దశ ట్రయల్స్ జరగాల్సి ఉంది. ఇదే దేశానికి చెందిన షెంజెన్ జీనోఇమ్యూన్ మెడికల్ ఇనిస్టిట్యూట్‌లో LV-SMENP-DC అనే వ్యాక్సిన్‌ను తయారుచేస్తున్నారు. దీంతో పాటు ఔషధాన్ని తయారుచేసేందుకు కూడా అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇలా చాలా దేశాల్లో కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం విస్తృతంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇంత త్వరగా మెడిసిన్ వస్తుందా అన్నదే అనుమానంగా మారింది. సాధారణంగా ఒక వ్యాక్సిన్ రావాలంటే కనీసం 9 నుంచి 18 నెలల సమయం పడుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితి తీవ్రత దృష్య్టా కంపెనీలు పరిశోధనలను వేగవంతం చేశాయి. అందుకే అదిగో వ్యాక్సిన్ అనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది.