365 Buttons Trend: 2026లో తొలి వైరల్ మూమెంట్ ఇదే.. ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.. 365 బటన్‌లు అంటే ఏంటి?

సంవత్సరంలోని ప్రతి రోజుకు ఒకటి చొప్పున మొత్తం 365 బటన్‌లను ఒక వ్యక్తిగత గుర్తుగా ఉపయోగించుకోవాలన్న భావనపై ఆధారపడిన సోషల్ మీడియా ట్రెండ్ ఇది. ప్రతి రోజు గడిచిన సమయం, తీసుకున్న నిర్ణయాలు, వ్యక్తిగత హద్దులను గుర్తుచేసే చిన్న సంకేతంగా ఆ బటన్‌ను భావిస్తారు.

365 Buttons Trend: 2026లో తొలి వైరల్ మూమెంట్ ఇదే.. ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.. 365 బటన్‌లు అంటే ఏంటి?

365 Buttons (Image Credit To Original Source)

Updated On : January 11, 2026 / 5:50 PM IST
  • సరికొత్తగా అనిపిస్తున్న 365 బటన్‌ల ట్రెండ్ సారాంశం
  • నిశ్శబ్దంగా మన దారిలో మనం వెళ్లడంపైనే దృష్టి పెట్టాలి
  • ఇతరులకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు

365 Buttons Trend: సామాజిక మాధ్యమాల్లో 2025లో వైరల్‌ అయిన ఎన్నో అంశాలను చూశాం. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అవుతున్న తొలి ట్రెండ్‌గా 365 బటన్స్‌ నిలిచింది.

చిన్న వస్తువులైన బటన్‌లే కేంద్ర బిందువుగా ఈ ట్రెండ్‌ కొనసాగుతుండడం గమనార్హం. “365 బటన్‌లు” ట్రెండ్‌ను మొదట చూసినప్పుడు డీఐవై (DIY) సవాల్‌లా అనిపిస్తుంది.

డీఐవై అంటే “డూ ఇట్ యువర్‌సెల్ఫ్” (Do It Yourself) అని అర్థం. అంటే ఇతరుల సాయం లేకుండా ఒక పనిని చేసుకోవడం లేదా వస్తువును మనమే సొంతంగా తయారు చేసుకోవడం. క్రాఫ్ట్స్, రిపేర్లు, టెక్నాలజీ ప్రాజెక్ట్‌లు వంటివి ఇందులో ఉంటాయి. ఇది ముఖ్యంగా యువతలో చాలా ప్రాచుర్యం పొందింది.

“365 బటన్‌లు” ట్రెండ్‌ను మరింత పరిశీలించి చూస్తే వ్యక్తిగత హద్దులు, స్వీయ బాధ్యతను సూచిస్తుంది. నిజానికి ఈ ట్రెండ్ 2025 డిసెంబర్ చివర్‌ టిక్‌టాక్‌లో కనపడింది. అబ్బీ కీల్లర్ అనే వ్యక్తి పోస్ట్ చేసిన వీడియో కింద తమారా అనే యూజర్ పెట్టిన కామెంట్‌ నుంచి ఇది ప్రారంభమైంది.

ఆ వీడియోలో కీల్లర్ ముఖానికి మాస్క్ పెట్టుకుని మంచంపై విశ్రాంతి తీసుకుంటూ కనిపిస్తుంది. 2026లో తన లక్ష్యాలను సాధించడంతో ఎంత పట్టుదలతో ఉంటుందో 365 బటన్‌లు ద్వారా వివరిస్తుంది.

Also Read: హైదరాబాద్ శివారులో అరకును పోలిన అనుభవం.. అబ్బురపరుస్తున్న వాతావరణం.. వెళ్లి చూస్తారా?

365 బటన్‌లు అంటే ఏంటి?
సంవత్సరంలోని ప్రతి రోజుకు ఒకటి చొప్పున 365 బటన్‌లు కొనాలని తమారా వ్యాఖ్యానించింది. సమయాన్ని ఎలా వినియోగిస్తున్నామన్న విషయంపై స్పష్టత పెంచుకోవాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

ఆమె కామెంట్స్‌ ఆసక్తిని రేపాయి. ఆ బటన్‌లతో ఏం చేయాలి? అనే ప్రశ్నలు వెంటనే మొదలయ్యాయి. వాటిని ధరించాలా? దాచాలా? దుస్తులకు అతికించాలా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

ఆమె సమాధానం చాలా సాదాసీదాగా ఉంది. తనకు తెలియదని చెప్పింది. అంతకన్నా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేసింది. ఆమె ప్రతిరోజూ తనతో ఒక బటన్ తీసుకెళ్లాలని మాత్రమే అనుకుంది. వాటితో ఏం చేయాలనే విషయాన్ని మాత్రం ఇతరులకు చెప్పడానికి ఇష్టపడలేదు.

ఈ ట్రెండ్‌ను నెటిజన్లు ఎందుకు ఇష్టపడుతున్నారు? 
తమారా చెప్పిన సమాధానం చాలా మందిని ఆకట్టుకుంది. ఇది కొత్త ఆలోచన అని, సరదాగా ఉందని అందరికీ అనిపించింది. ఇతరులకు వివరణ ఇవ్వకుండానే వ్యక్తిగత ఆలోచనను కొనసాగించవచ్చన్న భావన ఈ ట్రెండ్ సారాంశంగా మారింది.

కొందరు జేబులో బటన్ పెట్టుకోవడం, రోజూ టేబుల్‌పై ఒక బటన్ ఉంచడం, జార్‌ల్లో దాచుకోవడం వంటి విధానాలను పాటిస్తామని అన్నారు. ఇవన్నీ కాలం గడిచే విధానాన్ని గుర్తు చేస్తాయని కొందరు కామెంట్లు చేస్తున్నాయి.

సాధారణ ట్రెండ్‌లకు భిన్నంగా 365 బటన్‌ల ట్రెండ్ ఉంది. హడావుడి చేయడం, కఠిన లక్ష్యాలు పెట్టడం వంటివాటి జోలికి ఈ ట్రెండ్‌ పోలేదు. ఇతరుల ఆమోదం లేకుండానే తమ కోసం తామే పని చేయాలన్న స్వాతంత్ర్య భావనను ఇది ముందుకు తీసుకొస్తుంది. భావోద్వేగ హద్దులు, స్వీయ నమ్మకం, కొన్ని ఉద్దేశాలను వ్యక్తిగతంగానే ఉంచుకునే స్వేచ్ఛను ఇది సూచిస్తుందని అనేక మంది చెబుతున్నారు.

2026లో ఇది ఎందుకు వైరల్ అవుతోంది?
బర్నౌట్, మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై ఆన్‌లైన్ చర్చలు పెరుగుతున్న వేళ 365 బటన్‌ల ట్రెండ్ సమయోచితంగా కనిపిస్తోంది. చిన్న వస్తువును వాడుకుని జాగ్రత్తగా జీవించాలని, అవసరం లేని వివరణలను ఇవ్వకూడదని చెప్పే విధంగా ఈ ట్రెండ్ ఉంది.