Nepal Floods : నేపాల్‌లో వరద బీభత్సం.. 60 మంది మృతి, 44 మంది గల్లంతు..!
Nepal Floods : నేపాల్‌లో వరదలు ముంచెత్తాయి. ఈ వరదల వల్ల పలు జిల్లాల్లో దాదాపు 60మంది మృతిచెందారు. మరో 44 మంది గల్లంతైనట్లు నేపాల్ స్థానిక మీడియా వెల్లడించింది.

60 dead, several missing after heavy rainfall triggers floods in Nepal ( Image Source : Google Images )
Nepal Floods : నేపాల్‌లో వరదలు సంభవించాయి. గత కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి. ఆకస్మిక వరదల వల్ల అనేక లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. జనజీవనం పూర్తిగా స్తంభించింది. వరదలు ఇంకా తీవ్ర రూపం దాల్చే ఛాన్స్ ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఈ వరదల వల్ల పలు జిల్లాల్లో దాదాపు 60మంది మృతిచెందారు. మరో 36 మంది గల్లంతైనట్లు నేపాల్ స్థానిక మీడియా వెల్లడించింది.
59 మరణాలలో 34 ఖాట్మండు లోయలోనే సంభవించాయని నేపాల్ పోలీసు డిప్యూటీ అధికార ప్రతినిధి బిశ్వో అధికారి తెలిపారు. అదనంగా, ఖాట్మండు వ్యాలీలో 16 మందితో సహా దేశవ్యాప్తంగా 44 మంది గల్లంతయ్యారు. లలిత్‌పూర్‌లో 16 మంది, భక్తపూర్‌లో ఐదుగురు మరణించారు. కవ్రేపాలన్‌చౌక్‌లో ముగ్గురు, పంచ్‌తార్, ధన్‌కూటాలో ఇద్దరు, ఝాపా, ధాడింగ్‌లలో ఒక్కొక్కరు మరణించినట్టు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఖాట్మండులో 226 ఇళ్లు మునిగిపోయాయని, దాదాపు 3వేల మంది భద్రతా సిబ్బందితో కూడిన రెస్క్యూ టీమ్‌ను ప్రభావిత ప్రాంతాలకు మోహరించినట్లు నేపాల్ పోలీసులు నివేదించారు. నేపాల్ సాయుధ దళం నుంచి 1,947 మంది భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
వరద బాధితులను రక్షించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రాఫ్టింగ్ బోట్లను కూడా రంగంలోకి దించారు. వరదల్లో చిక్కుకున్న 760 మందిని రక్షించినట్లుగా తెలిపారు. “పోలీసులు ఇతర ఏజెన్సీలు, స్థానికులతో కలిసి గల్లంతైన వారిని వెతికేందుకు ప్రయత్నిస్తున్నారు” అని స్థానిక అధికారి ఒకరు చెప్పారు. దేశవ్యాప్తంగా 44 చోట్ల ప్రధాన రహదారులు జలదిగ్భందంలో చిక్కుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా రక్షించినట్టు తెలిపారు.
గత రెండు రోజులుగా నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మిక వరదల గురించి ముందుగానే హెచ్చరికలు జారీచేయాలని విపత్తు నిర్వహణ అధికారులను ఆదేశించింది. అదే సమయంలో తాత్కాలిక ప్రధాన మంత్రి ప్రకాష్ మాన్ సింగ్ హోం మంత్రి, హోం కార్యదర్శి, భద్రతా సంస్థల అధిపతులతో సహా వివిధ మంత్రులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రెస్క్యూ కార్యకలాపాలను ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. వరదల కారణంగా ప్రధాన ట్రాన్స్‌మిషన్ లైన్‌కు అంతరాయం ఏర్పడటంతో ఖాట్మండులో ఒక రోజు విద్యుత్ అంతరాయం ఏర్పడింది.
Read Also : BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ యూజర్లకు పండుగే.. రూ. 345 రీఛార్జ్ ప్లాన్‌తో 60 రోజులు ఎంజాయ్ చేయొచ్చు..!