శ్రీలంకలో పేలుళ్లు : 40 మంది అరెస్ట్

  • Published By: veegamteam ,Published On : April 23, 2019 / 10:04 AM IST
శ్రీలంకలో పేలుళ్లు : 40 మంది అరెస్ట్

Updated On : April 23, 2019 / 10:04 AM IST

ఈస్టర్ పండుగ రోజున శ్రీలంక వరుస పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. 8 ప్రాంతాలలో జరిగిన బాంబు దాడులతో దేశం యావత్తు అల్లాడిపోయింది. ఈ దాడులకు వందలాదిమంది మృతి చెందగా 500 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ పేలుళ్ల కేసులో ప్రభుత్వం 40మంది అనుమానితులను అరెస్ట్ చేసింది. వారిని విచారిస్తున్నారు. 

వరుసగా జరిగిన ఈ పేలుళ్లతో ఏప్రిల్ 22 రాత్రి నుంచి శ్రీలంకలో ఎమర్జెన్సీని ప్రకటించింది ప్రభుత్వం. మంగళవారం జాతీయ సంతాపదినంగా పాటిస్తున్నారు. ఈ పేలుళ్లకు సంబంధించి ఏ ఉగ్రసంస్థ అధికారికంగా ఎటువంటి ప్రకటనా విడుదల చేయలేదు. స్థానిక ఉగ్రవాద సంస్థలే ఈ దాడులకు పాల్పడి ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పేలుళ్ల ఘటనను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నట్లు సమాచారం.శ్రీలంక ఇంటిలిజెన్స్ మాత్రం తౌహిత్ జమాతేను అనుమానిస్తోంది. షంగ్రిల్లా హోటల్ లో  ఆత్మహుతికి పాల్పడిన వ్యక్తిని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో అతనికి ఓ ఫ్యాక్టరీ ఉందని..దాంట్లో పనిచేస్తున్న 9 మంది ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుని  విచారిస్తున్నారు.

 
పేలుళ్ల తీవ్రత, ఘననలు జరిగిన తీరు పరిశీలించగా ఐసీస్ ఉగ్రవాదులే చేసినట్లు అనిపిస్తోందని శ్రీలంక భద్రతాదికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మాహుతి దాడిలో వాడిన పేలుడు పదార్థాలు, డిటోనేటర్లను క్షుణ్ణంగా విశ్లేషించిన తరువాత ఓ నిర్ధారణకు వస్తామని తెలిపారు.మరోవైపు లష్కరేతోయిబా ఉగ్రసంస్థ శ్రీలంకలో అడుగుపెట్టేందుకు గత కొంతకాలంగా ప్రయత్నిస్తోందని నిఘా వర్గాల సమాచారం.ఇటీవల న్యూజిలాండ్‌లో రెండు మసీదుల్లో ప్రార్థనలు చేస్తున్న 50 మంది ముస్లింలను బ్లెంటన్ అనే క్రైస్తవ శ్వేత జాతీయుడు కాల్చి చంపినందుకు ప్రతీకారంగా శ్రీలంక ఐసీస్ మాడ్యూల్ ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చునని కూడా అధికారులు భావిస్తున్నారు.