Musk Vs Bessent: రగ్బీ ప్లేయర్‌లా తోసేసి..! ఏకంగా వైట్ హౌస్‌లోనే కొట్టేసుకున్న ఎలాన్ మస్క్, బెసెంట్? అసలేం జరిగింది..
విభేదాలు తీవ్రమవడంతో, ఇద్దరూ వైట్ హౌస్ నుండి నిష్క్రమించారు. బయటకు వెళ్లిపోతున్న సమయంలో మాటలతో దూషించుకున్నారు.

Musk Vs Bessent: ఎలోన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య అధికార పోరాటం కొత్త మలుపు తిరిగింది. ఓ వార్త సంచలనంగా మారింది. అదేమిటంటే.. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ తో ఎలాన్ మస్క్ వైట్ హౌస్ లోనే బాహాబాహీకి దిగినట్లు సమాచారం. ఈ సంఘటన ఏప్రిల్ మధ్యలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన మస్క్, ట్రంప్ మధ్య మరింత దూరాన్ని పెంచిందట.
రైట్ వింగ్ స్ట్రాటజిస్ట్, పాడ్‌కాస్టర్ స్టీఫెన్ కె బానన్ ప్రకారం.. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (IRS) కు ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై మస్క్, బెసెంట్ మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. ఇద్దరు వ్యక్తులు తమకు ఇష్టమైన అభ్యర్థులను తాత్కాలిక IRS కమిషనర్‌గా నియమించాలని లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. విభేదాలు తీవ్రమవడంతో, ఇద్దరూ వైట్ హౌస్ నుండి నిష్క్రమించారు. బయటకు వెళ్లిపోతున్న సమయంలో మాటలతో దూషించుకున్నారు. ప్రభుత్వ సమర్థత శాఖ (DOGE) ద్వారా ప్రభుత్వానికి 1 ట్రిలియన్ డాలర్ల డబ్బులు ఆదా చేస్తానన్న హామీ ఏమైంది అంటూ బెసెంట్ ప్రశ్నించారట. అంతేకాదు నువ్వో మోసగాడివి అంటూ అరిచినట్లు సమాచారం. దీంతో కోపంతో ఊగిపోయిన మస్క్.. బెసెంట్‌పై భౌతిక దాడికి దిగారట. రగ్బీ ప్లేయర్‌లా తన భుజంతో బెసెంట్‌ను తోయగా బెసెంట్ కూడా మస్క్‌కు అదే స్థాయిలో బదులిచ్చే ప్రయత్నం చేశారట.
ఇద్దరూ భౌతిక దాడులకు చూసిన ఇతరులు వెంటనే వారిని విడదీసే ప్రయత్నం చేశారట. మస్క్‌ను బయటకు తీసుకెళ్లారు. కాగా, ఈ విషయం ట్రంప్‌కు తెలిసింది. ‘ఇది చాలా టూ మచ్’ అని ఆయన అన్నారట.
ఈ భౌతిక వాగ్వాదం.. మస్క్ ట్రంప్ మధ్య తీవ్రమైన ప్రజా వైరంలో ఒక భాగం మాత్రమే. ఇటీవల మస్క్ ట్రంప్ యొక్క 4 ట్రిలియన్ డాలర్ల పన్ను వ్యయ ప్రతిపాదనను దూకుడుగా విమర్శించారు. దీనిని “బిగ్ బ్యూటిఫుల్ బిల్” అని పిలుస్తారు. దీన్ని ఉద్దేశించి “బిల్లును చంపండి” అని అమెరికన్లను కోరారు మస్క్. ఇది దేశాన్ని రుణ బానిసత్వంలోకి నెట్టివేస్తుందని హెచ్చరించారు.
ఒకప్పుడు మస్క్ కు మద్దతుదారుగా ఉన్న ట్రంప్ దీనిపై తీవ్రంగా స్పందించారు. గత వారం ఓవల్ ఆఫీసులో మాట్లాడుతూ, టెస్లా CEO పట్ల ఆయన నిరాశ వ్యక్తం చేస్తూ, “నేను ఎలోన్‌కు చాలా సాయం చేశాను” అని తెలిపారు. మస్క్ కు మతి తప్పిందని మండిపడ్డారు.
అంతేకాదు “మాదకద్రవ్యాల బానిస” అంటూ మస్క్ పై ట్రంప్ విరుచుకుపడ్డారట. మాదకద్రవ్యాల అలవాటు కారణంగానే అతడికి ఈ పరిస్థితి దాపురించిందన్నారట. ఇంకా ట్రంప్ ఏమన్నారంటే.. స్పేస్‌ఎక్స్, టెస్లాతో సహా మస్క్ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చే బిలియన్ల ఫెడరల్ డాలర్ల కాంట్రాక్టులు, సబ్సిడీలను రద్దు చేస్తామని ట్రంప్ బెదిరించారట.