Bangladesh Plane Crash: బంగ్లాదేశ్ లో ఘోర విమాన ప్రమాదం.. కాలేజీపై కూలిన ఎయిర్ ఫోర్స్ జెట్, 19 మంది మృతి, 100మందికి తీవ్రగాయాలు..

ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల్లో విద్యార్థులు, టీచర్లు ఉన్నారు.

Bangladesh Plane Crash: బంగ్లాదేశ్ లో ఘోర విమాన ప్రమాదం.. కాలేజీపై కూలిన ఎయిర్ ఫోర్స్ జెట్, 19 మంది మృతి, 100మందికి తీవ్రగాయాలు..

Updated On : July 21, 2025 / 6:12 PM IST

Bangladesh Plane Crash: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఓ కాలేజీ భవనంపై బంగ్లా వైమానిక శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 19 మంది మరణించారు. ఈ ఘటనలో 100 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల్లో విద్యార్థులు, టీచర్లు ఉన్నారు.

బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ F-7BGI ఫైటర్ జెట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఢాకాలోని ఒక కాలేజీ భవనంపై కూలిపోయింది. క్యాంటీన్ పైకప్పును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.

ఢాకాలోని మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ భవనంపై ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ జెట్ క్రాష్ అయ్యింది. ఈ ఘటనలో పైలట్ దుర్మరణం చెందాడు. మృతుడిని మహమ్మద్ తౌరిక్ ఇస్లామ్ గా గుర్తించారు. మృతుల్లో 16 మంది విద్యార్థులు, ఒక టీచర్ ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. దాదాపు 100మందికి పైగా గాయపడ్డారు. వారిలో ఎక్కువగా విద్యార్థులు ఉన్నారు. భారీగా మంటలు చెలరేగడంతో విద్యార్థులకు తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో 8మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: బోస్టన్ బ్రాహ్మిన్లు ఎవరు? ఈ జంట ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాక ఈ క్యాబట్స్‌ గురించి తెలుసుకోకపోతే ఎలా?

ఈ దుర్ఘటనపై బంగ్లాదేశ్ తాత్కాలిక నాయకుడు మహ్మద్ యూనస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. “వైమానిక దళం, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మైల్‌స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ సిబ్బందితో పాటు ఈ ప్రమాదంలో ప్రభావితమైన ఇతరులకు జరిగిన నష్టం పూడ్చలేనిది” అని ఆయన అన్నారు.

కూలిపోయిన విమానం F-7BGI. ఇది చైనీస్ J-7 ఫైటర్ అధునాతన వెర్షన్. సోమవారం మధ్యాహ్నం 1.06 గంటలకు శిక్షణ విమానం బయలుదేరింది. ఆ కాసేపటికే అది కాలేజీ భవనంపై కూలిపోయిందని అగ్నిమాపక అధికారి తెలిపారు. ఆ సమయంలో కొందరు విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, మరికొందరు తరగతులకు హాజరవుతున్నారని చెప్పారు. ఈ విద్యా సంస్థలో 2వేల మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎలిమెంటరీ నుంచి 12వ క్లాస్ వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ప్లేన్ క్రాష్ తో అక్కడ భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది.