అమెరికాపైనే చైనా ఆగ్రహం : మసూద్ గ్లోబల్ టెర్రరిస్ట్

ఐక్య రాజ్య సమితిని అమెరికా బలహీనపరుస్తోందని గురువారం(మార్చి-28,2019) చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే అంశాన్ని అమెరికా మరింత జటిలం చేస్తోందని చైనా తెలిపింది.
మసూద్ అజర్‌ను 1267 అల్‌ఖైదా ఆంక్షల కమిటీ జాబితాలో చేర్చాలనే ప్రతిపాదనను చైనా అడ్డుకున్న విషయం తెలిసిందే,అయితే చైనా ఈ చర్యకు పాల్పడినప్పటి నుంచి రెండు వారాల తర్వాత ఫ్రాన్స్, బ్రిటన్ మద్దతుతో అమెరికా ఓ ముసాయిదా తీర్మానాన్నిఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టింది. మసూద్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్చాలని మరోసారి ప్రతిపాదించింది.
దీనిపై గురువారం చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి జెంగ్ షువాంగ్ స్పందించారు. మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న అంశాన్ని అమెరికా మరింత జటిలం చేస్తోందని ఆరోపించారు.ఈ ముసాయిదా తీర్మానాన్ని నిర్బంధంగా ప్రవేశపెట్టడానికి బదులు జాగ్రత్తగా వ్యవహరించాలని అమెరికాను కోరుతున్నట్లు తెలిపారు.చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలన్న వైఖరికి అనుగుణంగా అమెరికా వ్యవహరించడం లేదన్నారు. అమెరికా చర్య ఐరాస భద్రతా మండలి యాంటీ టెర్రరిజం కమిటీ అధికారాలను తగ్గిస్తోందన్నారు.సమస్యను అమెరికా మరింత జటిలం చేస్తుందని అన్నారు.