African Cheetahs Coming To India : చీతాల ఎంట్రీకి కౌంట్ డౌన్ స్టార్ట్ .. అరుదైన ఆఫ్రికా అతిథులకు భారత్ గ్రాండ్ వెల్‌కమ్
70 ఏళ్ల తర్వాత.. ఇండియాలో మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్నాయ్ చీతాలు. వాటిని.. ఆహ్వానించేందుకు యావత్ దేశమంతా ఎదురుచూస్తోంది. ఇదే వారంలో.. 8 చీతాలు దేశంలోకి అడుగు పెట్టనున్నాయి. భారత్‌లో అంతరించిపోయిన ఈ వన్య మృగాలు.. మళ్లీ ఇదే గడ్డపై శాశ్వతంగా నివసించేందుకు రాబోతున్నాయ్. మరి.. వాటినెలా తీసుకొస్తున్నారు? ఇక్కడికి.. తీసుకొచ్చాక ఏం చేస్తారు?

African Cheetahs Coming To India
African Cheetahs Coming To India : 10 కాదు.. 20 కాదు.. 70 ఏళ్ల తర్వాత.. ఇండియాలో మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్నాయ్ చీతాలు. వాటిని.. ఆహ్వానించేందుకు యావత్ దేశమంతా ఎదురుచూస్తోంది. ఇదే వారంలో.. 8 చీతాలు దేశంలోకి అడుగు పెట్టనున్నాయి. భారత్‌లో అంతరించిపోయిన ఈ వన్య మృగాలు.. మళ్లీ ఇదే గడ్డపై శాశ్వతంగా నివసించేందుకు రాబోతున్నాయ్. మరి.. వాటినెలా తీసుకొస్తున్నారు? ఇక్కడికి.. తీసుకొచ్చాక ఏం చేస్తారు?
భారత్‌లో అంతరించిపోయి.. అరుదైన జాతుల్లో ఒకటిగా మారిన చీతాలు.. తిరిగి మన ఇండియాకు వచ్చేస్తున్నాయి. వాటిని.. ఆహ్వానించేందుకు దేశం మొత్తం వెయిట్ చేస్తోంది. మరికొన్ని గంటల్లోనే.. అవి దేశంలోకి అడుగుపెడతాయి. ఇక్కడే.. శాశ్వత నివాసం ఏర్పరచుకుంటాయి. అవి హాయిగా జీవించేందుకు, స్వేచ్ఛగా సంచరించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే జరిగిపోయాయి. వాటికి.. గ్రాండ్ వెల్‌కమ్ చెప్పడం మాత్రమే మిగిలింది. ఈ అతిథులకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేది.. సాధారణ ప్రజలు మాత్రమే కాదు.. ప్రధాని మోదీ కూడా. ఆయన పుట్టిన రోజు నాడే.. ప్రధాని చీతాలను.. అడవిలో వదిలిపెడతారు.
అన్నిరకాల పులులు ఎక్కువగా సంచరించే భారత్‌లో.. 1948వ సంవత్సరంలోనే చీతాలు అంతరించిపోయాయ్. 1952లో.. దేశంలో చీతాలు అంతరించిపోయినట్లు ఆనాటి భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మళ్లీ 74 ఏళ్ల తర్వాత.. ఇప్పుడు భారత గడ్డపై చీతాలు అడుగు పెట్టబోతున్నాయ్. పర్యావరణవేత్తల దశాబ్దాల కృషి ఫలించి.. చీతాలు మళ్లీ దేశంలో మనుగడలో ఉన్న జంతువుల జాబితాలో చేరనున్నాయి. నమీబియా నుంచి ఈ ప్రత్యేక విమానంలోనే చీతాలను భారత్‌కు తీసుకొస్తున్నారు. ఈ గ్లోబ్ మొత్తం మీద.. దాదాపుగా 7 వేల చీతాలు ఉంటే.. అందులో మూడో వంతు నమీబియాలోనే సంచరిస్తున్నాయ్. ఒక్క సౌతాఫ్రికాలోనే 4 వేల 500 చీతాలున్నాయ్. ఇక్కడి చీతాలు.. జన్యుపరంగా చాలా ప్రత్యేకమైనవి. పైగా.. ప్రపంచంలోని అన్ని చీతా జాతులు.. సౌతాఫ్రికా జాతుల నుంచే పుట్టుకొచ్చాయి.
నమీబియా నుంచి తొలి దశలో 8 చీతాలను.. విండ్‌హోక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి భారత్‌కు తరలించనున్నారు. వాటి కోసమే ప్రత్యేకంగా బోయింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను తీర్చిదిద్దారు. 16 గంటల పాటు ప్రయాణించి.. రాజస్థాన్‌లోని జైపూర్ చేరుకుంటాయి. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యప్రదేశ్‌లోని సువిశాలమైన కూనో నేషనల్ పార్క్‌కు తరలిస్తారు. ఇకపై.. ఆ 8 చీతాలు ఇక్కడే నివసిస్తాయి. భారత్‌కు తెస్తున్న 8 చీతాల్లో ఐదు ఆడవి, మూడు మగవి ఉన్నాయి. ఆడ చీతాల వయసు రెండు నుంచి ఐదేళ్ల మధ్య ఉండగా.. మగ చీతాలు నాలుగున్నర నుంచి ఐదున్నరేళ్ల మధ్యవి. 3 మగ చీతాల్లో.. రెండు ఒకే చీతాకు పుట్టినవి ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ.. తన పుట్టినరోజైన ఈ నెల 17న కూనో నేషనల్ పార్క్‌లో వాటిని వదిలిపెడతారు.
మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్.. 740 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులోనే.. చీతాలను దశల వారీగా వదులుతారు. కూనో నేషనల్ పార్క్‌తో కలిపి.. మొత్తం అటవీ ప్రాంతం 5 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది.. వన్య ప్రాణులకు ఆవాసంగా మారనుంది. నమీబియా నుంచి భారత్‌కు తెచ్చిన చీతాలను.. నెల రోజుల పాటు క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లో ఉంచుతారు. ఇందుకోసం.. 50×30 సైజులో.. 6 ఎన్‌క్లోజర్లను ఏర్పాటు చేశారు. 30 రోజుల పాటు వాటిని ఎన్‌క్లోజర్లలో ఉంచి పర్యవేక్షిస్తారు. ఈ నెల పాటు ప్రతి రెండు, మూడు రోజులకొకసారి.. 2 నుంచి 3 కేజీల మాంసాన్ని ఆహారంగా అందిస్తారు. క్వారంటైన్ పీరియడ్ ముగిశాక.. 9 భాగాలుగా విభజించిన ఐదున్నర కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో.. చీతాలను వదిలేస్తారు. నెలరోజుల పాటు వాటిని పర్యవేక్షిస్తారు. భారత వాతావరణానికి అవి తట్టుకోగలవా? లేదా? ఇక్కడి అడవుల్లో ఇబ్బందులేమైనా పడుతున్నాయా? అన్న వాటిని పరిశీలించనున్నారు.
భారత్‌కు తీసుకొచ్చే జీతాలు.. నమీబియా ఒట్జివారోంగోలోని.. 58 వేల హెక్టార్ల ప్రైవేట్ రిజర్వ్ ప్రాంతంలో.. గతేడాది జులై నుంచి నివసిస్తున్నాయ్. మరో మగ చీతా.. 2018 మార్చిలో ఎరిండి ప్రైవేట్ గేమ్ రిజర్వ్‌లో పుట్టింది. మగచీతా సోదరి అయిన ఆడచీతా కూడా భారత్‌కు వస్తోంది. ఈ రెండింటినీ.. ఈశాన్య నమీబియాలోని గొబాసిస్ నగరంలో ఓ చోట గుర్తించారు. సరైన ఆహారం లేక..అప్పటికే అవి పూర్తిగా నీరసించిపోయి ఉన్నాయి. సమీపంలో చెలరేగిన మంటల్లో.. వాటి తల్లి మరణించి ఉంటుందని అధికారులు భావించారు.అప్పటి నుంచి.. వాళ్లే ఆ చీతాలకు పోషకాహారం అందించి.. వాటి ఆరోగ్యం మెరుగయ్యేలా చూసుకున్నారు. నమీబియా అధికారుల సంరక్షణలో ఉన్న ఆడ చీతాలన్నీ చాలా స్వేహపూర్వకంగా ఉంటాయి. భారత్ వస్తున్న చీతాల మధ్య సోదరులు, సోదరి, స్నేహితుల సంబంధం ఉంది. ఇక్కడ కూడా అవి అలాగే కలిసి-మెలిసి జీవించనున్నాయి.
చీతా, చిరుత.. ఒకే జాతికి చెందినప్పటికీ.. రెండింటి మధ్య చాలా తేడా ఉంది. చిరుత కన్నా వేగంగా చీతా పరుగు తీస్తుంది. అసలు.. భూమ్మీద అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు చీతానే. అలాంటి చీతా భారత్‌లో లేకపోవడంపై పర్యావరణ వేత్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటినుంచి భారత్‌లో మళ్లీ చీతాల సంతతి పెంచేందుకు ప్రయత్నాలు సాగాయి. ఆ తర్వాత విదేశాల నుంచి తరలించే ప్రతిపాదనలు వచ్చాయి. దశాబ్దాల తర్వాత ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చాయి. చీతాలను ఒక దేశం నుంచి మరో దేశానికి తరలించడం ఇదే తొలిసారి. ఈ ప్రాజెక్టుకు 2020 జనవరిలో సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఆ తర్వాత కరోనా కారణంగా ఈ ప్రక్రియ కాస్త ఆలస్యమైంది.
ఈ ఏడాది జులైలోనే.. చీతాల సంరక్షణ, దిగుమతిపై.. భారత్, నమీబియా ఒప్పందం కుదుర్చుకున్నాయ్. ఐదేళ్ల చీతా ప్రాజెక్టు కింద.. ఏటా నాలుగు నుంచి ఎనిమిది చీతాలను భారత్‌కు తీసుకురానున్నారు అధికారులు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను తీసుకొచ్చేందుకు త్వరలోనే ఒప్పందం కుదుర్చుకునే అవకాశముంది. రాబోయే ఐదేళ్లలో.. పదుల సంఖ్యలో చీతాలను భారత అడవుల్లో వదిలిపెట్టనున్నారు. ఇందుకోసం.. కేంద్ర ప్రభుత్వం 91 కోట్లు కేటాయించింది.