ఈ దేశానికి ఏమైంది : గన్ తో కాల్చుకుని చనిపోయిన పెరూ మాజీ ప్రెసిడెంట్

  • Published By: venkaiahnaidu ,Published On : April 18, 2019 / 03:37 PM IST
ఈ దేశానికి ఏమైంది : గన్ తో కాల్చుకుని చనిపోయిన పెరూ మాజీ ప్రెసిడెంట్

Updated On : April 18, 2019 / 3:37 PM IST

పెరూ దేశ మాజీ అధ్యక్షుడు అలన్ గార్సియా అలన్ గార్సియా ఆత్మహత్య చేసుకున్నాడు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గార్సియాను అరెస్ట్ చేసేందుకు బుధవారం(ఏప్రిల్-17,2019) పోలీసులు మిరాఫ్లోర్స్ సిటీలోని గార్సియా ఇంటికి వెళ్లారు. పోలీసులు వచ్చినప్పుడు గార్సియా ఒక ఫోన్ చేసి వస్తానని చెప్పి గదిలోకి వెళ్లి, తలుపు వేసుకుని,గన్ తో కాల్చుకున్నాడని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి కార్లోస్ మొరాన్ తెలిపారు.వెంటనే గార్సియాను ట్రీట్మెంట్ కోసం రాజధాని లీమాలోని కాసిమిరో ఉల్లోవా హాస్పిటల్ కి తరలించారు. చికిత్స సమయంలో ఆయనకు కొన్నిసార్లు గుండెపోటు కూడా వచ్చిందని ఆరోగ్యశాఖ మంత్రి జులేమా తోమస్ తెలిపారు. హాస్పిటల్ లో ట్రీట్మెంట్  పొందుతూ గార్సియా చనిపోయారని తెలిపారు.1985 నుంచి 1990 వరకు, 2006 నుంచి 2011 వరకు గార్సియా పెరూ అధ్యక్షుడిగా పనిచేశారు.అంతేకాకుండా 36 ఏళ్ల వయస్సులోనే పెరూ  అధ్యక్షుడిగా 1985లో బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు.ఆయన మృతిపై పెరూ అధ్యక్షుడు మార్టిన్ విజ్‌కారా దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్‌.‌కెన్నడీతో గార్సియాను పోలుస్తూ కొందరు ఆయన్ను ‘లాటిన్ అమెరికా కెన్నడీ’ అని ప్రశంసిస్తారు.

గార్సియా రెండోసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో లీమాలో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి బ్రెజిల్ కంపెనీ ఓడె బ్రెచ్ట్ నుంచి ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి.2004 నుంచి సుమారు మూడు కోట్ల డాలర్లు గార్సియాకు లంచాలు ఇచ్చినట్లు ఓడె బ్రెచ్ట్ సంస్థ ఆరోపిస్తోంది. అయితే రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనను బాధితుడిగా మార్చేశారని, తాను అవినీతికి పాల్పడ్డాననేందుకు ఎలాంటి ఆధారాలూ లేవని గార్సియా మంగళవారం ట్వీట్ చేశారు. పెరూ రాజధాని లీమాలోని ఉరుగ్వే రాయబార కార్యాలయంలో తనకు రాజకీయ ఆశ్రయం కల్పించాలని కోరుతూ గార్సియా గతేడాది నవంబరులో దరఖాస్తు చేసుకోగా, ఆ దేశం దీనిని తిరస్కరించిన విషయం తెలిసిందే.

పెరూకు ఇటీవలి కాలంలో అధ్యక్షులుగా చేసినవారిలో నలుగురు అవినీతి కేసుల్లో ఉన్నారు.2001-06 మధ్య అధ్యక్షుడిగా చేసిన అలెజాండ్రో టోలెడో ఓడెబ్రెచ్ట్ సంస్థ నుంచి లక్షల డాలర్ల ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. పరారీలో ఉన్న ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు.2011-16 మధ్య అధ్యక్షుడిగా చేసిన ఒల్లంటా హుమాలా…ఎలక్షన్ క్యాంపెయిన్ ఖర్చు కోసం ఓడె బ్రెచ్ట్ నుంచి లంచాలు తీసుకున్నారనే ఆరోపణలపై ప్రి-ట్రయల్ డిటెన్షన్‌లో ఉన్నారు.2016-18 మధ్య అధ్యక్షుడిగా చేసిన పెడ్రో పాబ్లో కుక్‌జిన్‌ స్కీ ఓటు కొనుగోలు కుంభకోణంలో గత వారం అరెస్ట్ అయ్యారు.బుధవారం కుక్ జిన్ స్కీ కి బ్లెడ్ ప్రెజర్ పెరిగిపోవడంతో అధికారులు ఆయనను హాస్పిటల్ కు తరలించారు.ప్రస్థుతం ఆయన ఐసీయూలో ఉన్నట్లు రిపోర్ట్ ల ద్వారా తెలుస్తోంది