భారత్ ఏ శాట్ ప్రయోగం ముందే తెలుసు – అమెరికా రక్షణ శాఖ

భారత్‌పై నిఘా పెట్టలేదని అమెరికా రక్షణ శాఖ స్పష్టం చేసింది. ఏ – శాట్ ప్రయోగం ముందే తెలుసని వెల్లడించింది. ఇండియా ఇటీవలే ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ఏ – శాట్ పరీక్ష చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నిఘా పెట్టినట్లు వస్తున్న వార్తలను అమెరికా రక్షణ శాఖ ఖండించింది. భారత్ ఈ ప్రయోగం చేస్తుందని తమకు ముందే తెలుసని అక్కడి రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ డేవిడ్ డబ్ల్యూ ఈస్ట్ బర్న్ తెలిపారు.
ప్రయోగం జరపడానికంటే ముందు నిర్ణీత ప్రాంతంలో విమానాల రాకపోకలను ఇండియా నిషేధించిందని, ఈ విషయాన్ని ముందురోజే చెప్పిందన్నారు. ఈ ప్రయోగం జరిగిన కొన్ని క్షణాలకే అమెరికా దేశానికి చెందిన ‘RC-135S COBRA BALL’ నిఘా విమానం బంగాళాఖాతంపై ప్రయాణిస్తూ వివరాలను సేకరించింది. 300 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న ఓ ఉపగ్రహాన్ని ఏ శాట్ క్షిపణి కూల్చివేసిన సంగతి తెలిసిందే. అమెరికా, రష్యా, చైనాల తర్వాత ఈ సామర్థ్యం ఉన్న నాలుగో దేశంగా భారత్ అవతరించింది.