Yasin Arafat: బంగ్లాదేశ్‌లో హిందువు దారుణ హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్.. అతడు ఓ మాజీ టీచర్
2025 డిసెంబర్ 18న మైమెన్‌సింగ్ జిల్లాలో దీపూ దాస్ హత్య జరిగింది. అతడిని కొట్టి చంపి, మృతదేహాన్ని ఒక చెట్టుకు వేలాడదీసి నిప్పంటించారు.
Yasin Arafat Representative Image (Image Credit To Original Source)
- దీపూ దాస్ హంతకుడు దొరికాడు
- యాసిన్ అరాఫత్ అరెస్ట్
- దీపూ దాస్ పై దాడికి ప్లానింగ్ చేసింది ఇతడే
Yasin Arafat: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడు దీపూ చంద్ర దాస్ దారుణ హత్య సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీపూ దాస్ హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి పేరు యాసిన్ అరాఫత్. మాజీ టీచర్. అరాఫత్ ను పోలీసులు ఇవాళ పట్టుకున్నారు. అరాఫత్ అరెస్ట్ కు సంబంధించి పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. దీపూ దాస్‌పై దాడికి ప్లానింగ్, అమలులో అరాఫత్ కీలకపాత్ర పోషించాడని తెలిపారు. గుంపును ఎగదోయడం మాత్రమే కాకుండా దీపూను స్వయంగా కూడలిలోకి లాక్కెళ్లాడని వివరించారు. ఇన్ని రోజులు పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. ఇక, ఈ కేసులో ఇప్పటివరకు 21 మందిని అరెస్ట్ చేశారు.
మత దూషణ ఆరోపణలతో దీపూ దాస్ ను దారుణంగా హత్య చేశారు. అతడు వస్త్ర కార్మికుడిగా పని చేస్తున్నాడు. దీపూ దాస్ దారుణ హత్య కాండ యావత్ ప్రపంచాన్ని కదిలించింది. ఈ దారుణాన్ని ముక్త కంఠంతో అన్ని దేశాలు ఖండించాయి. బంగ్లాదేశ్ లో మైనారిటీలపై దాడులు ఆందోళనలు నింపాయి.
2025 డిసెంబర్ 18న మైమెన్‌సింగ్ జిల్లాలో దీపూ దాస్ హత్య జరిగింది. 27 ఏళ్ల దాస్‌ను అతని ఫ్యాక్టరీ సూపర్‌వైజర్లు బలవంతంగా రాజీనామా చేయించారు. ఆ తర్వాత కార్యాలయం నుండి బయటకు ఈడ్చుకెళ్లి ఆగ్రహంతో ఉన్న స్థానిక గుంపునకు అప్పగించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ గుంపు అతడిని కొట్టి చంపి, మృతదేహాన్ని ఒక చెట్టుకు వేలాడదీసి, నిప్పంటించింది. అతని సహోద్యోగులలో కొందరు ఈ దాడిలో పాల్గొన్నారని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.

Dipu Chandra Das Representative Image (Image Credit To Original Source)
హత్య జరిగిన వెంటనే అరాఫత్ పారిపోయాడు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అరాఫత్ సమాజంలో తన పలుకుబడిని ఉపయోగించి గుంపును త్వరగా సమీకరించి, రెచ్చగొట్టి, మత దూషణ ఆరోపణను ప్రాణాంతక మూకదాడిగా మార్చాడు. అరాఫత్ హింసను రెచ్చగొట్టడమే కాకుండా, దాస్‌ను సమీపంలోని కూడలికి వ్యక్తిగతంగా ఈడ్చుకెళ్లాడని దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు. అక్కడే అతడిని ఉరితీసి నిప్పంటించారు.
Also Read: ట్రంప్ 500% సుంకాలు: ఆ బిల్లులో ఏముంది? భారత్‌పై ప్రభావం ఎలా ఉంటుంది? ఆర్థిక విపత్తు ముప్పు?
