గబ్బిలమా? ల్యాబా? కరోనా వైరస్ పుట్టుక మిస్టరీ వీడనుందా

గబ్బిలమా? ల్యాబా? కరోనా వైరస్ పుట్టుక మిస్టరీ వీడనుందా

Updated On : January 29, 2021 / 1:03 PM IST

where did Covid 19 pandemic originate: కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించింది. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. కోట్లాది మందిపై ప్రభావం చూపింది. లక్షలాది మంది ప్రాణాలు తీసుకుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 10కోట్లను దాటింది. 21లక్షల మంది మరణించారు. 7కోట్ల మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. కాగా, పలు దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం ఇంకా తగ్గడం లేదు. పలు చోట్ల సెకండ్ వేవ్ కొనసాగుతుండగా.. రోజూ రోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య తారస్థాయికి చేరుతోంది. అమెరికా, బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్ దేశాల్లో కొవిడ్ తీవ్రత ఎక్కువగానే ఉంది.

యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కంటికి కనిపించని కరోనా వైరస్ వెలుగుచూసి ఏడాది దాటింది. ఇంకా అనేక విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై సైంటిస్టులు విస్తృతంగా పరిశోధనలు జరుపుతున్నారు. అసలు కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది? అనేది ఇప్పటికీ మిస్టరీనే. ఇదో మిలియన్ డాలర్ల ప్రశ్న. కరోనా వైరస్ గబ్బిలం ద్వారా వచ్చిందా? ల్యాబ్ లో పుట్టిందా? వుహాన్ లో అసలేం జరిగింది? కరోనా వైరస్ పుట్టుకతో పాటు వుహాన్ మిస్టరీని చేధించేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) రంగంలోకి దిగింది.

డబ్ల్యూహెచ్ఓకి చెందిన నిపుణుల బృందం శుక్రవారం(జనవరి 29,2021) చైనా సైంటిస్టులతో సమావేశం అయ్యింది. గురువారంతో(జనవరి 28,2021) డబ్ల్యూహెచ్ఓ నిపుణుల బృందం రెండు వారాల క్వారంటైన్ పూర్తి చేసుకుంది. ఆ వెంటనే తమ పని ప్రారంభించింది. 2019 డిసెంబర్ లో కరోనా వైరస్ వెలుగుచూసిన సెంట్రల్ చైనీస్ సిటీలోని హోటల్ కి నిపుణుల బృందం పయనైంది.

Wuhan, Wuhan news, Wuhan live, Wuhan latest, China news, China latest, coronavirus, covid 19 pandemic, coronavirus pandemic, who, world health organisationడబ్ల్యూహెచ్ఓ నిపుణుల బృందం మరో రెండు వారాల పాటు చైనాలో ఉండనుంది. కరోనా వైరస్ వెలుగుచూసిన అన్ని సీఫుడ్ మార్కెట్లను ఈ బృందం సందర్శించనుంది. అలాగే వివాదానికి కేంద్ర బిందువుగా మారిన వుహాన్ లోని వైరాలజీ ఇన్ స్టిట్యూట్ ను సైతం నిపుణుల బృందం సందర్శించనుంది. ఆ ల్యాబ్ లో ఏం జరిగింది? కొవిడ్ వైరస్ ఆ ల్యాబ్ లోనే పుట్టిందా? అనే అంశాలపై ఆరా తీయనుంది.

ప్రమాదకర కరోనా వైరస్ వుహాన్ లోనే పుట్టిందని యావత్ ప్రపంచం గట్టిగా నమ్ముతోంది. దీనికి కారణం కొవిడ్ వైరస్ తొలుత వెలుగుచూసింది వుహాన్ లో కావడమే. చైనాలోని వుహాన్ సిటీలోని వైరాలజీ ల్యాబ్ లోనే కరోనా వైరస్ పుట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు ఇదే నిజం అంటున్నాయి. కాగా చైనా ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించింది. అందులో వాస్తవం లేదని వాదిస్తోంది.

కాగా, కరోనా వైరస్ ల్యాబ్ లో పుట్టలేదని, గబ్బిలం ద్వారా వచ్చిందని మరికొందరు వాదిస్తున్నారు. మొత్తంగా వుహాన్ మిస్టరీని చేధించే పనిలో డబ్ల్యూహెచ్ఓ నిపుణుల బృందం ఉంది. అంతిమంగా నిపుణుల బృందం ఏం తేలుస్తుందని తెలుసుకోవడానికి యావత్ ప్రపంచం ఆసక్తిగా ఉంది.