Bilawal Bhutto Zardari: భారత్‌తో యుద్ధానికి దిగుతాం.. మరోసారి రెచ్చిపోయిన పాకిస్తాన్ మాజీ మంత్రి

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ పై కఠిన ఆంక్షలు విధించింది. IWTని నిలిపివేసింది.

Bilawal Bhutto Zardari: భారత్‌తో యుద్ధానికి దిగుతాం.. మరోసారి రెచ్చిపోయిన పాకిస్తాన్ మాజీ మంత్రి

Updated On : June 23, 2025 / 10:49 PM IST

Bilawal Bhutto Zardari: పాకిస్తాన్ కు ఇంకా బుద్ధి రాలేదు. భారత్ ఆపరేషన్ సిందూర్ తో కోలుకోలేని దెబ్బతీసినా.. పాక్ నేతల తీరులో మార్పు లేదు. భారత్ తో యుద్ధానికి కాలు దువ్వుతున్నారు. తాజాగా ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ రెచ్చిపోయాడు. సింధు జలాల ఒప్పందం (IWT-ఇండస్ వాటర్స్ ట్రీటీ) ప్రకారం ఇస్లామాబాద్‌కు న్యాయమైన నీటి వాటాను ఇచ్చేందుకు భారత్ నిరాకరిస్తే.. పాకిస్తాన్ యుద్ధానికి దిగుతుందని హెచ్చరించాడు. సింధు నదీజలాల ఒప్పందం ప్రకారం మా దేశానికి నీళ్లు ఇవ్వకపోతే భారత్ తో యుద్ధానికి వెళ్తాం అంటూ వార్నింగ్ ఇచ్చాడు బిలావల్ భుట్టో.

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. దీనికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ పై కఠిన ఆంక్షలు విధించింది. 1960 ఒప్పందాన్ని నిలిపివేసింది. ఆ చారిత్రాత్మక ఒప్పందాన్ని పునరుద్ధరించబోమని ఇటీవలే హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. అంతర్జాతీయ ఒప్పందాల పట్ల అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విమర్శలు చేసిన రెండు రోజుల తర్వాత బిలావల్ భుట్టో తాజాగా ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.

పార్లమెంటులో మాట్లాడిన బిలావల్.. ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారత నిర్ణయాన్ని తిరస్కరించారు. పాకిస్తాన్ నీటి వాటాను పొందుతామని చెప్పాడు. “భారత దేశానికి రెండు ఆప్షన్లు ఉన్నాయి: ఒకటి నీటిని న్యాయంగా పంచుకోవడం, రెండోది సింధు బేసిన్ లోని 6 నదుల నుండి నీటిని మమ్మల్నే తీసుకోనివ్వడం” అని బిలావల్ భుట్టో అన్నాడు. ఒప్పందాన్ని నిలుపుదల చేయలేము కాబట్టి IWT ఇప్పటికీ వాడుకలో ఉందని బిలావల్ చెప్పాడు.

”సింధు నదిపై దాడి, IWT ముగిసిందని భారతదేశం చేసిన వాదన చట్టవిరుద్ధం. ఎందుకంటే IWT నిలిపివేయబడలేదు. రెండు దేశాలు కట్టుబడి ఉండాల్సిందే. ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం నదీజలాలను ఆపడం చట్టవిరుద్ధం” అని బిలావల్ భుట్టో అన్నాడు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) అధినేత అయిన బిలావల్.. భారత్ తమను బెదిరించాలని చూస్తే.. “మనం మళ్ళీ యుద్ధం చేయాల్సి ఉంటుంది” అని హెచ్చరించాడు. ఏ సమస్యనైనా పరస్పర చర్చలు, సహకారం ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించాడు.

Also Read: భారత్‌లోనే నిలిచిపోయిన లక్ష టన్నుల బాస్మతి బియ్యం.. తీవ్ర ఆందోళనలో వ్యాపారులు.. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్..

భారత్, పాకిస్తాన్ మాట్లాడుకోవటానికి నిరాకరిస్తే, ఉగ్రవాదంపై సమన్వయం లేకపోతే, రెండు దేశాలలో హింస మరింత తీవ్రమవుతుందన్నాడు. అంతేకాదు.. భారత్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని ఆయుధంగా మార్చుకుంటోందని ఆరోపించారు. విదేశాంగ మంత్రిగా తాను UK, యూరోపియన్ దేశాలకు దౌత్య పర్యటనలకు వెళ్లిన సమయంలో, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) రంగంలో పాకిస్తాన్ పురోగతిని తిప్పికొట్టడానికి భారత్ తీవ్రంగా లాబీయింగ్ చేసిందన్నాడు.

ప్రపంచ వేదికపై కాశ్మీర్ సమస్యను లేవనెత్తడంలో పాకిస్తాన్ విజయం సాధించిందని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి అనుకూలంగా మాట్లాడారని బిలావల్ భుట్టో గుర్తు చేశాడు.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్ పై కఠిన ఆంక్షలు విధించింది. IWTని నిలిపివేసింది. పాకిస్తాన్‌తో అన్ని రకాల వాణిజ్య సంబంధాలను తెంచుకుంది. అంతేకాదు మే 7న ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న ప్రాంతాలలో ఉగ్రవాద మౌలిక సదుపాయాలు లక్ష్యంగా మెరుపు దాడులు చేసింది. ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. భారత్ మెరుపు దాడుల కారణంగా ఇరు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు తీవ్ర ఘర్షణలు జరిగాయి.