Iran Israel Conflict: భారత్‌లోనే నిలిచిపోయిన లక్ష టన్నుల బాస్మతి బియ్యం.. తీవ్ర ఆందోళనలో వ్యాపారులు.. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్..
భారత్ నుండి ఏటా దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నుల బాస్మతి బియ్యం ఇరాన్‌కు ఎగుమతి అవుతుంది. అందులో హర్యానా వాటా దాదాపు 30-35 శాతం

Iran Israel Conflict: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. ఇరు దేశాలు దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణంతో మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తతల ప్రభావం భారత్ పైనా చూపిస్తోంది. ఇండియా నుంచి ఇరాన్ కు ఎక్స్ పోర్ట్ కావాల్సిన బాస్మతి బియ్యం ఇక్కడే నిలిచిపోయింది. ఏకంగా లక్ష టన్నుల బాస్మతి బియ్యం పోర్టుల్లోనే ఇరుక్కుపోయింది.
ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం సముద్ర రవాణా, బీమా కవరేజీకి అంతరాయం కలిగించింది. ఓడలు లేకపోవడంతో పాటు బీమా వర్తించకపోవడంతో ఎగుమతులకు ఆటంకం కలిగింది. ఇరాన్‌కు వెళ్లాల్సిన దాదాపు లక్ష టన్నుల బాస్మతి బియ్యం భారత ఓడరేవులలో నిలిచిపోయిందని ఆల్ ఇండియా రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ (AIREA) తెలిపింది.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల కారణంగా నౌకలు, బీమా ఎంపికల కొరత ఏర్పడింది. ఈ కారణంగా గుజరాత్‌లోని కాండ్లా, ముంద్రా ఓడరేవులలో దాదాపు లక్ష టన్నుల సరుకు ఎగుమతి కాకుండా నిలిచిపోయిందని AIREA అధ్యక్షుడు సతీష్ గోయల్ తెలిపారు. భారత దేశం మొత్తం బాస్మతి బియ్యం ఎగుమతుల్లో ఇరాన్ వాటా 18-20 శాతంగా ఉందన్నారు.
టెహ్రాన్‌కు దేశంలోని బాస్మతి ఎగుమతుల్లో దాదాపు మూడో వంతు వాటాను అందించే హర్యానా ఈ అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. భారత్ బాస్మతి వాణిజ్యానికి ప్రధాన కేంద్రం కర్నాల్. ఆ తర్వాత కైతాల్, సోనిపట్ ఉన్నాయి. ఎగుమతుల్లో తీవ్ర మందగమనం, షిప్పింగ్ ఆలస్యం, చెల్లింపుల బకాయిలు పెరుగుతున్నాయని వెల్లడించారు. రతదేశం నుండి ఇరాన్‌కు ఏటా దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతి అవుతుంది. అందులో హర్యానా వాటా దాదాపు 30-35 శాతం అని బియ్యం ఎగుమతిదారుల సంఘం హర్యానా విభాగం అధ్యక్షుడు సుశీల్ జైన్ తెలిపారు.
Also Read: మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా? ప్రస్తుతం ఏం జరుగుతోంది?
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న వివాదం వాణిజ్యాన్ని ప్రభావితం చేసిందన్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నులకు చెల్లింపులు( రూ.1500 కోట్ల నుండి 2వేల కోట్ల మధ్య) కూడా స్తంభించాయన్నారు. ఈ అంతరాయం ఇప్పటికే దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపిందన్నారు. బాస్మతి బియ్యం ధరలు కిలోకు 4-5 వరకు తగ్గాయని జైన్ వివరించారు. దీర్ఘకాలిక సంక్షోభం భారత ఎగుమతిదారుల ఆర్థిక పరిస్థితులను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అంతేకాదు.. యుద్ధ సమయంలో నౌకలకు బీమా కవరేజ్ లేకపోవడం ఎగుమతిదారులకు ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారాయన. ఇరాన్, ఇజ్రాయెల్ వివాదం భారత మార్కెట్‌పై ప్రభావం చూపనుంది, ఇది ఇప్పటికే ధరల్లో కొంత తగ్గుదలకు కారణమైందని వివరించారు. బియ్యం ఎగుమతిదారుల అసోసియేషన్ వ్యవసాయ, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA)తో చర్చలు జరుపుతోంది. మరోవైపు తక్షణ ఉపశమన చర్యలను కోరుతూ జూన్ 30న కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్‌ను కలవనుంది.
“భారత్ నుండి ఏటా దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నుల బాస్మతి బియ్యం ఇరాన్‌కు ఎగుమతి అవుతుంది. అందులో హర్యానా వాటా దాదాపు 30-35 శాతం” అని బియ్యం ఎగుమతిదారుల సంఘం హర్యానా చాప్టర్ అధ్యక్షుడు సుశీల్ జైన్ తెలిపారు. ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం వాణిజ్యాన్ని ప్రభావితం చేసిందని ఆయన వాపోయారు.