కొలంబోలో వరుస పేలుళ్లు : 99కు పెరిగిన మృతులు

  • Published By: veegamteam ,Published On : April 21, 2019 / 06:07 AM IST
కొలంబోలో వరుస పేలుళ్లు :  99కు పెరిగిన మృతులు

Updated On : April 21, 2019 / 6:07 AM IST

క్రైస్తవుల ఆరాధ్య దైవం ఏసుక్రీస్తును శిలువ వేసిన తరువాత పునరుద్ధానుడైన రోజును క్రైస్తవులు పర్వదినంగా  జరుపుకుంటారు. ఈ వేడుకనే ఈస్టర్ పండుగ అంటారు. ఈ వేడుకల్లో భాగంగా శ్రీలంక రాజధాని కొలంబో చర్చిల్లో దాడులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. ఆనందోత్సాహాలు కాస్తా విషాదాలుగా మారిపోయాయి. హాహాకారాలు మిన్నంటాయి. 

ఆదివారం (ఏప్రిల్ 21)ఉదయం మూడు చర్చిలు, మూడు హోటళ్లను వరుస పేలుళ్లు కుదిపేశాయి. ఈ ఘోరం ఘటనల్లో లో మృతుల సంఖ్య 99కి చేరింది. మరో 300 మందికి పైగా గాయపడినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘోరకలితో ఒక్కసారిగా చర్చిలన్నీ రోదనలతో నిండిపోయాయి. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది గాయపడినవారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఆరుచోట్ల జరిగిన ఈ పేలుళ్లను ఉగ్రదాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.
 
కోచికడే, సెయింట్ సెబాస్టియన్, బట్టికలోయ చర్చిల్లో ఈస్టర్ ప్రార్థనలు చేస్తున్న భక్తులను టార్గెట్ చేసుకుని ఈ దాడులు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు హోటల్ షాంగ్రి లా, సిన్నమాన్ గ్రాండ్ హోటల్స్‌లోనూ పేలుళ్ల చోటుచేసుకున్నాయి. ఈస్టర్ సండే ప్రార్థనలు జరుగుతుండగా ఉదయం 8.45 గంటల ప్రాంతంలో వరుస పేలుళ్లు చోటుచేసుకున్నట్టు పోలీసు ప్రతినిధి రువాన్ గుణశేఖర తెలిపారు. మృతులు, క్షతగాత్రుల్లో భారతీయులు ఎవరైనా ఉన్నారా అనేది ఇంకా తెలియలేదు. కొలంబోలోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.