COVID-19 deaths: బ్రెజిల్‌లో 5లక్షల మందికి పైగా చనిపోయారు.. కానీ లాక్‌డౌన్ పెట్టట్లేదు.. కారణం ఏంటీ?

Brazil
Brazil COVID-19 : వ్యాక్సిన్‌లు వేయడంలో ఆలస్యం కావడం.. సామాజిక దూరానికి సంబంధించిన చర్యలకు ప్రభుత్వం నిరాకరించడంతో బ్రెజిల్‌లో మరణాలు విపరీతంగా నమోదవుతున్నాయి. ప్రపంచంలో ఐదు లక్షల మార్క్‌ను దాటిన రెండవ దేశంగా బ్రెజిల్ నిలిచింది. ప్రాణాంతక వ్యాది వ్యాప్తి ఆ దేశంలో తీవ్రం అయ్యింది. COVID-19 కారణంగా మరణించిన వారి సంఖ్య శనివారం 5లక్షలను అధిగమించింది. దేశంలో 17,883,750మందికి కోవిడ్ సోకగా.. 5లక్షల 8వందల మంది కరోనాతో చనిపోయారు.
ఇందుకు కారణంగా బ్రెజిల్‌లో ఎక్కువమందికి వ్యాక్సిన్‌లు వెయ్యకపోవడమే అని నిపుణులు చెబుతున్నారు. బ్రెజిలియన్లలో కేవలం 11శాతం మంది మాత్రమే ఇప్పటివరకు వ్యాక్సిన్‌లు వేయించుకున్నారు. దక్షిణ అర్ధగోళంలో శీతాకాలం రావడంతో కరోనావైరస్ కొత్త వేరియంట్లు ప్రసరించాయని, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల మరణాలు పెరుగుతూనే ఉన్నట్లుగా అక్కడి ఎపిడెమియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత బ్రెజిల్‌లోనే అత్యంత అధికారిక మరణాలు నమోదయ్యాయి. గతవారంలో, బ్రెజిల్‌లో రోజుకు 2వేల మంది చనిపోయారు. ప్రపంచంలో అమెరికాలో ఇప్పటివరకు ఆరు లక్షలకు పైగా మరణాలు నమోదవగా.. తర్వాత 5లక్షలకు పైగా మరణాలు నమోదైన దేశం బ్రెజిలే. మూడో స్థానంలో 3లక్షల 86వేల మరణాలతో భారత్ ఉంది.
బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో లాక్‌డౌన్, సామాజిక దూరం లాంటి నిబంధనల అమలుకు నిరాకరించడంతో దేశంలో వైరస్ వ్యాప్తి కొనసాగుతుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బ్రెజిల్లో పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని, దేశంలో ఇప్పటివరకూ 15 శాతం పెద్దలు మాత్రమే పూర్తిగా వ్యాక్సీన్ వేసుకున్నారని ఆరోగ్య సంస్థ ఫియోగ్రజ్ చెప్పింది. గతవారంలో రోజుకు 70వేలకు పైగా కేసులు దేశంలో నమోదైనప్పటికీ, లాక్‌డౌన్ విధిస్తే ఆకలి చావులే ఎక్కువ అవుతాయని అధ్యక్షుడు అభిప్రాయపడుతున్నారు.
దేశంలోని చాలా రాష్ట్రాల్లో 80 శాతానికి పైగా ఐసీయూలు నిండిపోయాయి. రాజకీయ కారణాలతో వ్యాక్సిన్లు కొనుగోలు చెయ్యడంలో అధ్యక్షుడు అలసత్వం వహిస్తున్నారని విపక్షాలు విమర్శిస్తుండగా.. కొనుగోలు చేయడానికి అవసరమైన చర్యలన్నీ చేపడుతున్నట్లు అధ్యక్షుడు చెబుతున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయితే కానీ, పరిస్థితి అదుపులోకి రాదనేది నిపుణుల అభిప్రాయం.