Donald Trump: ట్రంప్ ఆ దేశాల మధ్య శాంతిని నెలకొల్పగలడా.. 2020 తరహా ఘటనను పునరావృతం చేస్తాడా..!
రెండోసారి అగ్రరాజ్యం అధ్యక్ష పీఠాన్ని డోనాల్డ్ ట్రంప్ అధిరోహించనున్న నేపథ్యంలో.. ఆయన ప్రయత్నిస్తే సానుకూల ఫలితాలు రావొచ్చనే ..

Donald Trump
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించాడు. వచ్చే ఏడాది జనవరిలో రెండో సారి అగ్రరాజ్యం అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేందుకు సిద్ధమవుతున్నాడు. ట్రంప్ విజయంతో ఆసక్తికర చర్చకు తెరలేచింది. అమెరికా విదేశాంగ విధానంలో పెను మార్పులు అవసరమని ట్రంప్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నాడు. ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తాను అధ్యక్షుడిని అయితే కేవలం 24 గంటల్లోనే రష్యా – యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపనున్నట్లు చెప్పాడు. ఎన్నికల్లో విజయం తరువాత ఆయన మాట్లాడుతూ.. కొత్తగా యుద్ధాలు స్టార్ చేయను.. ప్రస్తుతం పలు దేశాల మధ్య నెలకొన్న యుద్ధాలను ఆపుతానని ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ట్రంప్ ఆ మేరకు సఫలం అవుతాడా అనే చర్చ జరుగుతుంది. అయితే, ట్రంప్ గురించి తెలిసిన వారు 2020లో జరిగిన ఘటనను గుర్తు చేసుకుంటున్నారు.
Also Read: Donald Trump: అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ అమెరికన్లు వీరే..
తాను అధికారంలోకి వస్తే రష్యా – యుక్రెయిన్ యుద్ధాన్ని 24గంటల్లో ఆపుతానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పదేపదే ప్రస్తావించాడు. మరోవైపు తాను శ్వేత సౌధంలో అడుగుపెట్టేలోగా గాజాలో యుద్ధానికి ముగింపు పలకాలని ఇజ్రాయెల్ కు ఇటీవల ట్రంప్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ట్రంప్ గతంలో అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. ట్రంప్ స్వభావాన్ని, ఆయన దూకుడైన పాలనను బట్టి చూస్తే యుద్ధాలను ఆపడంలోనూ అయనకు అనుభవం ఉందని అర్ధమవుతుంది. గతంలో అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో ఓ చారిత్రాత్మక సంఘటనకు ఆయన తెర తీశారు. పశ్చిమాసియా దేశాలైన బహ్రెయిన్ – ఇజ్రాయెల్ – యూఏఈ మధ్య దశాబ్దాలుగా భగ్గుమన్న శత్రుత్వానికి 2020లో ట్రంప్ చరమగీతం పాడారు. తద్వారా శాంతియుత వాతావరణం, స్నేహ సంబంధాలు ఏర్పడటంలో కీలక పాత్ర పోషించారు.
రెండోసారి అగ్రరాజ్యం అధ్యక్ష పీఠాన్ని ట్రంప్ అధిరోహించనున్న నేపథ్యంలో.. ఆయన ప్రయత్నిస్తే సానుకూల ఫలితాలు రావొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఆ మేరకు ట్రంప్ ఏ మేరకు విజయం సాధిస్తాడనే విషయంపై స్పష్టత రావాలంటే మరికొద్దిరోజులు వేచి చూడాల్సిందే.