Donald Trump: అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ అమెరికన్లు వీరే..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లూ సత్తాచాటారు. ప్రతినిధుల సభకు ఆరుగురు ఎన్నికయ్యారు.

Donald Trump: అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ అమెరికన్లు వీరే..

Six Indian Americans

Updated On : November 7, 2024 / 7:48 AM IST

US Elections Results 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించాడు. రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠాన్ని ఆయన అదిరోహించనున్నాడు. అయితే, ఈ ఎన్నికల్లో భారతీయ అమెరికన్లూ సత్తాచాటారు. ప్రతినిధుల సభకు ఆరుగురు ఎన్నికయ్యారు. గత కాంగ్రెస్ లో అయిదుగురు భారతీయ అమెరికన్ సభ్యులు ఉండగా.. ఈసారి ఆ సంఖ్య ఆరుగురికి చేరింది. గెలిచిన వారంతా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులే కావటం గమనార్హం.

Also Read: ట్రంప్ విజయం భారత్ మీద ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? అమెరికాలో మనోళ్ల పరిస్థితి ఏంటి?

శ్రీ తానేదార్ : శ్రీతానేదార్ అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రం రాజకీయాల్లో తనను తాను ప్రముఖ వ్యక్తిగా స్థిరపర్చుకున్నారు. తాజా ఎన్నికల్లో రాష్ట్రంలోని 13వ జిల్లా నుంచి యూఎస్ కాంగ్రెస్ కు తిరిగి ఆయన ఎన్నికయ్యారు. రిపబ్లికన్ సభ్యుడు మార్టెల్ బివింగ్స్ పై విజయం సాధించాడు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి శ్రీతానేదార్ కు 68.6శాతం ఓట్లు రాగా.. మార్టెల్ బివింగ్స్ కు 24.5శాతం ఓట్లు వచ్చాయి. శ్రీతానేదార్ కర్ణాటకలో జన్మించాడు. ఉన్నత విద్య కోసం యూఎస్ కి వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు.

రాజా కృష్ణమూర్తి : ఇల్లినోయీ రాష్ట్రం 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివల్స్ లో డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసిన రాజా కృష్ణమూర్తి విజయం సాధించాడు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రత్యర్థి మార్క్ రిక్ ను దాదాపు 30వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడించారు. కష్ణమూర్తి 2016లో తొలిసారి అక్కడి నుంచి ప్రతినిధుల సభకు వెళ్లారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న కృష్ణమూర్తి ఇల్లినోయీలో పలు పదవులు నిర్వహించారు. స్టేట్ ట్రెజరర్ గా కూడా ఆయన సేవలు అందించారు. అయితే, రాజా కృష్ణమూర్తి న్యూఢిల్లీలో జన్మించారు. అమెరికాలోని ఇల్లినోయీస్ లోని పెయోరియాలో పెరిగారు.

రో ఖన్నా: పంజాబ్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన హిందూ కుటుంబంలో రో ఖన్నా జన్మించాడు. తాజా ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ నుంచి కాలిఫోర్నియా 17వ జిల్లా నుంచి యూఎస్ హౌస్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రో ఖన్నా విజయం సాధించాడు. తన సమీప ప్రత్యర్థి అయిన రిపబ్లికన్ నేత భారత సంతతికే చెందిన అనితా చెన్ ను ఆయన సులభంగా ఓడించాడు. రో ఖన్నాకు 66శాతం ఓట్లు రాగా.. అనితా చెన్ కు 34శాతం ఓట్లు పోలయ్యాయి.

డాక్టర్ అమిబెరా: సీనియర్ ఇండో అమెరికన్ సెనేటర్ అయిన అమిబెరా ఈసారి కూడా కాలిఫోర్నియా 6వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి విజయం సాధించారు. వృత్తిపరంగా ఆయన డాక్టర్. 2013 నుంచి వరుసగా ఆరు సార్లు అమిబెరా విజయం సాధించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ ఏడోసారి బరిలోకి దిగిన ఆయన.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిపై విజయం సాధించారు.

ప్రమీలా జయపాల్ : డెమోక్రటిక్ నేత ప్రమీలా జైపాల్ వాషింగ్టన్ 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి విజయం సాధించారు. ఈమె 2017 నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నేత డాన్ అలెగ్జాండర్ ను ఓడించి తిరిగి ఎన్నికయ్యారు. 59ఏళ్ల ప్రమీలా జైపాల్ డెమోక్రటిక్ పార్టీలో కీలక నేతల్లో ఒకరు. తాజా ఎన్నికల్లో ప్రమీలా జైపాల్ కు 84.9శాతం ఓట్లు రాగా.. తన సమీప ప్రత్యర్థి డాన్ అలెగ్జాండర్ కు 15.1శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

సుహాస్ సుబ్రహ్మణ్యం : వర్జీనియా పదో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి సుహాస్ సుబ్రహ్మణ్యం బరిలోకిదిగి విజయం సాధించాడు. తాజా ఫలితాల ప్రకారం.. సుబ్రమణ్యం తన ప్రత్యర్థి రిపబ్లికన్ అభ్యర్ధి మైక్ క్లాన్సీపై విజయం సాధించాడు. సుబ్రహ్మణ్యంకు దాదాపు 53శాతం ఓట్లు పోలయ్యాయి. డెమోక్రాట్లకు వర్జీనియా రాష్ట్రం కంచుకోటగా ఉంది. దీంతో వర్జీనియా నుంచి గెలిచిన తొలి ఇండో అమెరికన్ గా సుబ్రమ్మణ్యం రికార్డు సృష్టించాడు. గతంలో ఒబామా హయాంలో ఆయన సాంకేతిక విధాన సలహాదారుగా సుబ్రమ్మణ్యం పనిచేశారు.

Six Indian Americans