ప్రపంచాన్ని చైనా మాత్రమే రక్షించగలదా? కరోనాతో ఎర్రబారిన ప్రపంచ దేశాలన్నీ.. డ్రాగన్ శరణు వేడుతున్నాయి

  • Published By: sreehari ,Published On : April 12, 2020 / 02:11 PM IST
ప్రపంచాన్ని చైనా మాత్రమే రక్షించగలదా? కరోనాతో ఎర్రబారిన ప్రపంచ దేశాలన్నీ.. డ్రాగన్ శరణు వేడుతున్నాయి

Updated On : April 12, 2020 / 2:11 PM IST

కరోనా వైరస్ ప్రపంచ భౌగోళిక రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. కరోనా మబ్బులు తొలగిపోయాక ప్రపంచ ముఖ చిత్రమే మారిపోతుందని అనేక అంచనాలు సాగుతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యం అమెరికా తన సూపర్ పవర్ స్థానం కోల్పోతుంది. ప్రపంచ అధికార కేంద్రం పశ్చిమం నుంచి తూర్పునకు బదిలీ అవుతుంది అంటే చైనాకు బదిలీ అవుతుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలాగే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కరోనా మహమ్మారి నుంచి గట్టెక్కేందుకు అనేక దేశాలు చైనాను శరణు వేడుతున్నాయి.

ఎర్ర రంగు పులుముకున్న ప్రపంచ దేశాలు :
ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలను వదిలి మిగిలిన ప్రపంచమంతా ఎర్ర రంగు పులుముకుంది. అంటే , అవన్నీ కరోనా వ్యాపించిన దేశాలు. ఈ ఎరుపు రంగుకు చాలా అర్ధాలున్నాయి. ఎరుపంటే కమ్యూనిస్టుల రంగు. చైనా ఒక కమ్యూనిస్టు దేశం. ఎరుపు రంగు పులుముకున్న ప్రతీ దేశం మీదా ఇప్పుడు చైనా తన ప్రభావం చూపుతోంది. ఇప్పుడీ కరోనా ఉపద్రవం నుంచి చైనా మాత్రమే ప్రపంచాన్ని రక్షించగలదు. ఇవాళ అమెరికా సహా కరోనా బారిన పడిన దేశాలన్నీ చైనా వైపే చూస్తున్నాయి. ఈ దేశాలన్నీ కరోనా మీద పోరాటం చేయాలంటే చైనా అనుభవం, అది సరఫరా చేసే పరికరాలు అత్యవసరం. ఈ మహమ్మారి నుంచి రక్షించుకోడానికి అమెరికా నుంచి ఐరోపా వరకూ , ఇరాన్ నుంచి ఇంగ్లాండ్ వరకూ అందరూ చైనా సాయం కోరుతున్నారు. 

ఇది ఇటలీ.. ప్రారంభంలో కరోనాను చైనా వైరస్ అని తప్పు పట్టింది. తమ దేశానికి చెడ్డ పేరొస్తుందని చైనా భయపడింది. ఆలా పిలవకండి, ఇది ఒక వైరస్, మా దేశంతో ముడిపెట్టకండి అని ఇటలీని కోరింది. ఇప్పుడేమయ్యింది? చూస్తూ ఉండగానే పరిస్థితి మారిపోయింది. కరోనా నుంచి గట్టెక్కడానికి ఇటలీ చైనా ముందు మోకరిల్లింది. అంతే కాదు, అమెరికా తరవాత కరోనా బలంగా కాటేసిన దేశం స్పెయిన్. అది కూడా చైనాను శరణు వేడింది. (ఢిల్లీలోని రెడ్,ఆరెంజ్ జోన్లలో భారీ శానిటైజేషన్ డ్రైవ్)

ఇప్పటి వరకూ చైనా నుంచి స్పెయిన్ 432 మిలియన్ యూరోలు, ఆంటే 3600 కోట్ల రూపాయల విలువ చేసే మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేసింది. చివరకు అమెరికా కూడా చైనా ముందు తలవంచింది. కరోనా నుంచి గట్టెక్కడానికి అవసరమైన సామాగ్రి చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది. చైనా నుంచి మెడికల్ ఎక్విప్మెంట్ దిగుమతికి వైట్ హౌస్ అనుమతి ఇచ్చిందంటూ అమెరికా పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇరాన్ , కెనడా దేశాలకు కూడా చైనా మెడికల్ ఎక్విప్మెంట్ ఎగుమతి చేస్తోంది. 

ప్రపంచంపై పట్టు పెంచుకుంటున్న డ్రాగన్ :
ఇదంతా ఏంచెబుతోంది ? చైనా సమాజ సేవ మాత్రం చేయడం లేదు. అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రపంచం మీద తన పట్టు పెంచుకుంటోంది. సరుకులు అమ్మి తన ఆర్ధిక వ్యవస్థ బలం పెంచుకుంటున్నది. మొత్తం మీద ప్రపంచంలో దాదాపు 50 దేశాలు చైనా మీద ఆధారపడి కరోనాపై పోరాటం చేస్తున్నాయి. చైనా కూడా చాలా సంతోషంగా వారికి మద్దతిస్తోంది. కరోనా మారణహోమం సాగినంత కాలం చైనా ఆర్ధిక వ్యవస్థ బలం పెరుగుతూనే ఉంటుంది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ బలహీన పడుతూనే ఉంటుంది ఈ విషయం చైనాకు బాగా తెలుసు. అతి కొద్ది కాలంలోనే చైనా బలమైన దేశంగా ఎదుగుతుంది. ఆ తరవాత సూపర్ కావడానికి ఎంతో కాలం పట్టదు. 

ప్రపంచానికి మ్యానుఫాక్చరింగ్ హబ్‌గా చైనా :
చైనా ఏనాటి నుంచో ప్రపంచానికి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఉంది. అంటే ప్రపంచంలో అత్యధికంగా సరుకుల తయారీ ఇక్కడే జరుగుతుంది. ఈ విషయంలో చైనాతో పోటీపడే దేశం మరొకటి లేదు. అందుకే చైనా హెల్త్ కేర్ ఎగుమతుల కోసం సిల్క్ రోడ్ నిర్మిస్తోంది. ప్రపంచం మీద తన పట్టు పెంచుకునే ప్రయత్నంలో ఉంది. ఇదంతా నాణేనికి ఒకవైపు. రెండో వైపు కథ ఇంకా బాకీ ఉంది. పైగా ఇది చాలా ఇంటరెస్టింగ్ కథ. దాని గురించి తెలుసుకోవడం కూడా చాలా అవసరం. ఈ కథ 2017 లోనే మొదలయ్యింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 2017 లో ఒక  కొత్త జాతీయ భద్రతా వ్యూహాన్ని ప్రకటించారు. దాని ప్రకారం ప్రపంచ విదేశీ వర్తకంలో పోటీ పెంచాలి. పోటీ పెరిగితే విదేశీ వర్తకంలో గుత్తాధిపత్యానికి చోటు ఉండదు. అమెరికాకు విదేశీ వర్తకానికి ప్రపంచం లో పెద్దగా పోటీ ఉండదు. ట్రంప్ ప్రకటన రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టింది. ఆ తరవాతే, అమెరికా , చైనా ముఖాముఖీ తలపడే పరిస్థితి ఏర్పడింది.

వందేళ్ల క్రితమే స్పానిష్ ఫ్లూ :
మహమ్మారి ప్రపంచానికి కొత్త కాదు. ఇప్పటికి వందేళ్ల క్రితమే స్పానిష్ ఫ్లూ రూపంలో అది ప్రపంచాన్ని చుట్టుముట్టింది. అప్పుడు కూడా దాదాపు ఇలాంటి పరిస్థితులే  ఏర్పడ్డాయి. కానీ, దాని తర్వాత ప్రపంచ సమీకరణాలు మారలేదు. సూపర్ పవర్ ఏదీ పుట్టుకు రాలేదు. కాబట్టి కరోనా విజృంభణ తగ్గాక చైనా సూపర్ పవర్‌గా  ఎదుగుతుందన్న గ్యారంటీ లేదు. కానీ , అమెరికా , చైనా మధ్య ఈ యుద్ధం నడుస్తూనే ఉంటుంది. కరోనా తగ్గినా ఇది మాత్రం ఆగదు. నిజం చెప్పాలంటే అమెరికా సూపర్ పవర్ గా ఎదిగిన నాటి పరిస్థితులు వేరు. కరోనా వంటి ఉపద్రవం లేకుండానే అమెరికా సూపర్ పవర్‌గా ఎదిగింది. రెండో ప్రపంచ యుద్ధం తరవాత ఆ వైపుగా అమెరికా అడుగులు వేసింది.

అప్పట్లో అమెరికాకు సూపర్ పవర్ కిరీటం :
రెండో ప్రపంచ యుద్ధం నుంచి 1991 వరకూ ప్రపంచం లో రెండు అధికార కేంద్రాలుండేవి. ప్రపంచం మొత్తం రెండు గా చీలి ఉండేది. ఒక వర్గానికి అమెరికా నాయకత్వం  వహించింది. రెండో దానికి సోవియట్ రష్యా నాయకత్వం వహించింది. సూపర్ పవర్‌గా ఎదగడానికి రెండు దేశాల మధ్య పోరు సాగింది. 50 ఏళ్లపాటు ప్రపంచం మీద ప్రచ్ఛన్న యుద్ధం మేఘాలు కమ్ముకున్నాయి. 1991లో సోవియట్ యూనియన్ విచ్చిన్నమయింది. రష్యా కష్టాల పాలయ్యింది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక ప్రపంచంలో అమెరికా ఒకటే పవర్ సెంటర్ గా మిగిలింది. అప్పుడే అమెరికాకు సూపర్ పవర్ కిరీటం దక్కింది.

ఇప్పుడు చైనా వంతు వచ్చింది :
ఇక్కడే మనం మరో సత్యం కూడా తెలుసుకోవాలి. రెండో ప్రపంచ యుద్ధం మొత్తం ప్రపంచాన్ని చుట్టుముట్టింది. అమెరికా యుద్ధానికి దూరంగా ఉండిపోయింది. యుద్ధం  చేస్తున్న దేశాలకు ఆయుధాలు అమ్మింది. ఇవ్వాళ చైనాకు కూడా అలాంటి పరిస్థితే కలిసి వస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా చేసిన పని ఇప్పుడు చైనా చేస్తోంది. కానీ , ఇక్కడే కథ మరో మలుపు తిరుగుతోంది. చైనా సూపర్ పవర్‌గా ఎదగడానికి రష్యా పెద్ద అడ్డంకిగా మారింది. ప్రపంచంలో ఒక పవర్ సెంటర్ ఉండాలా లేక మూడు పవర్ సెంటర్లు ఉండాలా అనేది రష్యా మాత్రమే నిర్ణయించగలదు. రష్యా , అమెరికా, చైనా, రష్యా కూడా కరోనా ఉపద్రవం ముగిసిపోయేంతవరకూ వేచి చూస్తుంది. ఆ తరవాత తన పావులు  కదుపుతుంది. శత్రువుకు శత్రువు మిత్రుడంటారు. అందుకే కొందరు అనుమానిస్తున్నారు. రష్యా పై కరోనా ప్రభావం తక్కువగా ఉండటం ఈ అనుమానాలకు ఊతమిస్తోంది.