రాష్ట్రపతి వెళ్లారు : రాష్ట్రపతి భవన్ కు మనం కూడా వెళ్లొచ్చు..

శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటన పూర్తయి తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రామ్ నాథ్ కోవింద్ బస పూర్తయి ఢిల్లీ వెళ్లిపోయిన క్రమంలో రేపటి నుండి అంటే డిసెంబర్ 26 నుండి జనవరి 6వ తేదీ వరకూ సందర్శనకు అనుమతినిచ్చారు.
ఈ మేరకు రాష్ట్రపతి నిలయం అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు సందర్శించవచ్చు. తమ వాహనాలపై ఇక్కడికి వచ్చే ప్రజలు రాష్ట్రపతి నిలయం లోపలికి అనుమతి వుడని కారణంగా ఎదుట ఉన్న పార్కింగ్ స్థలంలో పార్క్ చేయాల్సి వుంటుంది.
వృద్ధులు, దివ్యాంగులు ప్రత్యేక వాహన సదుపాయం
వృద్ధులు, దివ్యాంగులు మాత్రం తమ వాహనాల ద్వారా రాష్ట్రపతి నిలయంలోకి ప్రవేశించవచ్చు. కాగా.. రాష్ట్రపతి నిలయంలో సుమారు 20 గదులకు పైగా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని అతిథుల కోసం కాగా మరికొన్ని.. కార్యాలయ నిర్వహణకు..సమావేశాల నిర్వహణకు కేటాయించారు. దట్టమైన చెట్లు, వనమూలికా తోట, ఆయుర్వేద మొక్కలు ఈ ప్రాంగణంలో ఉన్నవిషయం తెలిసిందే. కాగా 2011 నుంచి రాష్ట్రపతి పర్యటనకు వచ్చి తిరిగి వెళ్లిన అనంతరం ఈ నిలయం సందర్శనకు వారం రోజుల పాటు ప్రజలకు అవకాశం కల్పిస్తున్నారు. మరి క్రిస్టమస్ సెలవులు వచ్చాయి కాబట్టి ఒకసారి రాష్ట్రపతి నిలయాన్ని చుట్టేసి రండి..