నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలను ఎంపిక చేసిన జెన్ జడ్? భారత్, మోదీ గురించి ఆమె ఏమన్నారు? ఇండియాతో ఆమెకున్న అనుబంధం ఇదే..
జెన్ జడ్ అంటే 1997 - 2012 మధ్య జన్మించిన తరం. వీరిని “డిజిటల్ నేటివ్స్” అని కూడా అంటారు. ఎందుకంటే చిన్న వయసు నుంచే ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియాతో పెరిగారు.

Sushila Karki
Sushila Karki: నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, దానికి నాయకత్వం వహించేందుకు ఆ దేశ మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కార్కీ(73)ని జెన్ జడ్ గ్రూప్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. నేపాల్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం జెన్ జడ్ నేతలు నిర్వహించిన వర్చువల్ సమావేశంలో సుశీల కార్కీ పేరు ఖరారు చేశారు.
అలాగే, జెన్ జడ్ నేతలు కాఠ్మాండు మేయర్ బాలేంద్ర షా, మాజీ విద్యుత్ బోర్డు అధికారి కుల్మాన్ ఘిసింగ్ పేర్లను కూడా పరిశీలించారు.
విద్యార్థుల నిరసనల మధ్య మంగళవారం ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలి రాజీనామా చేయడంతో నేపాల్ తీవ్ర రాజకీయ సంక్షోభంలోకి దిగజారింది. నిరసనల కారణంగా చట్టం, శాంతి భద్రతల బాధ్యతలను నేపాల్ ఆర్మీ స్వీకరించి బుధవారం దేశవ్యాప్తంగా ఆంక్షలు, కర్ఫ్యూ విధించింది. జెన్ జడ్ నిరసనకారులు కార్కీని తాత్కాలిక ప్రధానిగా ఉండాలని కోరుతున్నారని సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ కార్యదర్శి తెలిపారు.
సుశీల కార్కీ ఎవరు?
- సుశీల కార్కీ నేపాల్ తొలి మహిళా చీఫ్ జస్టిస్‌గా చరిత్ర సృష్టించారు. 2016 జూలై నుంచి 2017 జూన్ వరకు ఆమె సేవలందించారు. ఆమె పదవీకాలంలో అవినీతిపై జీరో టోలెరన్స్ విధానాన్ని అవలంబించారు.
- ఇంట్లో పెద్ద కూతురు ఆమె. 1952 జూన్ 7న బిరత్నగర్‌లో జన్మించారు కార్కీ. 1979లో న్యాయవృత్తిని ప్రారంభించారు. 2007లో సీనియర్ అడ్వకేట్‌గా గుర్తింపు పొందారు.
- మహేంద్ర మోరంగ్ కళాశాల నుంచి 1972లో బీఏ పూర్తి చేశారు. 1975లో వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ పూర్తి చేశారు. 1978లో త్రిభువన్ విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు.
- నేపాల్ సుప్రీంకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా 2009 జనవరిలో నియమితులై 2010లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు.
- కార్కీని తాత్కాలికంగా చీఫ్ జస్టిస్ పదవి నుంచి 2017 ఏప్రిల్‌లో సస్పెండ్ చేశారు. నేపాలి కాంగ్రెస్, సీపీఎన్ (మావోయిస్టు సెంటర్) శాసనసభ్యులు ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి, ఆమె పక్షపాతపూరితంగా తీర్పు ఇచ్చారని ఆరోపించారు.
భారత్, మోదీపై సుశీల కార్కీ వ్యాఖ్యలు
“మోదీజీకి నా నమస్కారాలు. మోదీజీపై నాకు మంచి అభిప్రాయం ఉంది. ప్రభుత్వాల మధ్య సంబంధాలనేవి వేరే విషయం. కానీ, నేపాల్ ప్రజలు, భారత్ ప్రజల మధ్య ఉన్న సత్సంబంధాలు ఉన్నాయి. మా బంధువులు, మా పరిచయస్తులు అనేకమంది అక్కడ ఉన్నారు. భారత నేతలను చూసి చాలా ప్రభావితం అయ్యాను. వారిని మన సోదరులు, సోదరీమణులుగా పరిగణిస్తాము” అని చెప్పారు.
భారత్‌లో చదువుకున్న రోజులను గుర్తుచేసుకుంటూ ఆమె పలు విషయాలు తెలిపారు. “నా అధ్యాపకులు, స్నేహితులను ఇప్పటికీ గుర్తు చేసుకుంటాను. గంగా నది గుర్తుంది. వేసవిలో రాత్రుళ్లు మేము టెర్రస్‌పై నిద్రపోయేవాళ్లం” అని తెలిపారు.