దిక్కుమాలిన కరోనా : లక్షమంది మృతి..ఇంకా ఎంతమంది?

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చనిపోయిన వారి సంఖ్య లక్ష దాటింది. కరోనా వల్ల అత్యధికంగా యూరప్‌లో ప్రాణ నష్టం సంభవిస్తోంది. మార్చి 31 వరకు ప్రపంచవ్యాప్తంగా 40 వేల మంది కోవిడ్‌కు బలి కాగా.. ఏప్రిల్ నెలలో 10 రోజుల్లోనే మరో 60వేల మంది చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం 24 గంటల్లో కరోనా కారణంగా పది వేల మంది చనిపోవడం పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతోంది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 17 లక్షలకు చేరువైంది.
బ్రిటన్‌లో పరిస్థితి రోజురోజుకు జఠిలమవుతోంది. బాధితులతోపాటు.. మృతుల సంఖ్య కూడా ఇంగ్లీష్ దేశంలో పెరుగుతోంది. కరోనా మహమ్మారి దెబ్బకు బ్రిటన్‌లో ఇప్పటి వరకు 8 వేల 958 మంది మృత్యువాత పడ్డారు. నిన్న ఒక్కరోజే 980మంది అంటే.. దాదాపు వెయ్యి మరణాలు సంభవించడం బ్రిటన్‌ను ఆందోళన కలిగిస్తోంది. గత మూడు రోజులుగా తగ్గిన మరణాలు మళ్లీ పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
మరోవైపు బాధితుల సంఖ్య 73వేల 758కి చేరింది. గురువారం కొత్తగా మరో 8వేల 681మంది వైరస్ బారిన పడ్డారు. అమెరికా తరువాత అంతటి తీవ్రతను మరణాల రేటులో ఇప్పుడు బ్రిటనే చవిచూస్తోంది. 24గంటల్లో ఇక్కడ 980 మరణాలు సంభవించాయి. కరోనా సోకిన ప్రధాని బోరిస్ జాన్సన్ ఆస్పత్రిలో కోలుకొంటున్నారు.
కరోనా మరణాల సంఖ్య ఎక్కుగా ఉన్న మరో దేశం స్పెయిన్. గురువారం ఒక్కరోజే 634 మంది మరణించారు. దీంతో స్పెయిన్‌లో మొత్తం మరణాల సంఖ్య 16వేలు దాటింది. నిన్న కొత్తగా 5వేలకు పైగా కొత్త కేసులు నమోదవడంతో బాధితుల సంఖ్య లక్షా 58వేలు దాటింది. అయితే… 17 రోజుల తర్వాత నిన్న అత్యల్ప మరణాల సంఖ్య నమోదైందని స్పెయిన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు స్పెయిన్‌లో కరోనా నుంచి దాదాపు 56 వేల మంది కోలుకున్నారు.
నిన్నటి వరకు కరోనా అంటే గుర్తొచ్చేవి స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్. పదివేల మందికిపైగా చనిపోయిన దేశాలివి. ఇప్పుడు ఈ లెక్కలనూ అమెరికా దాటిపోతోంది. అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. యూర్‌ప్‌లోని ఏ దేశంలోనూ ఒకే రోజు మరణాలు వెయ్యి దాటలేదు. కానీ, అమెరికాలో దాదాపు రెండు వేలమంది చొప్పున వరుసగా చనిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అక్కడ మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది.
ఇప్పటి వరకు అమెరికాలో కరోనా బారినపడి 18 వేలకు పైగా పౌరులు ప్రాణాలు విడిచారు. దీంతో మరికొద్ది గంటల్లో ఇటలీ మరణాలను అమెరికా దాటేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే కరోనా బాధితుల్లో అమెరికా ఏ దేశానికీ అందనంత ఎత్తులో ఉంది. ఇప్పుడు మరణాల్లోనూ అగ్రరాజ్యం మొదటి స్థానంలో నిలువనుంది.
ఇక న్యూయార్క్‌లోనైతే పరిస్థితి మహా దారుణం. ఎక్కడ చూసినా శవాలు గుట్టలే. మృతుల సంఖ్య 8వేలకు చేరువలో ఉంది. గురువారం ఒక్కరోజే ఏకంగా 777 మంది చనిపోయారు. బాధితుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. లక్షా 70 వేలకు పైగా బాధితులు ఉన్నారు.
కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్న పాజిటివ్ కేసులను చూడటానికి ఆస్పత్రులు చాలడం లేదు.24 గంటలూ పోరాడుతున్న వైద్యులకు వ్యక్తిగత రక్షణ పరికరాలను ప్రభుత్వం సరిపడా అందించలేకపోతోంది. వందల్లో చనిపోతున్నవారిని పూడ్చడానికి న్యూయార్క్, న్యూజెర్సీ లాంటి హాట్‌స్పాట్లలో సమాధి స్థలాలు సరిపోవడం లేదు. ప్రభుత్వం కొంత ఆలస్యంగానైనా లాక్‌డౌన్ అమలుచేస్తూ, భౌతిక దూరాన్ని తప్పనిసరి చేయడం ఒక్కటే కొంత ఊరట.