కరోనా వైరస్ క్లినికల్ ట్రయల్స్ ఎలా చేస్తారు

కరోనా వైరస్ ని ఎదుర్కునేందుకు వ్యాక్సిన్ ఆగస్ట్ లో వచ్చేస్తుంది సెప్టెంబర్ లో వచ్చేస్తుందనే వార్తలు రోజూ పేపర్లు, టీవీలు, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. వ్యాక్సిన్ తయారీకి ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా కంపెనీలు పోటీ పడి ప్రయోగాలు చేస్తున్నాయి. మార్కెట్ లోకి తమ ప్రోడక్టు ముందుగా బయటకు తెచ్చేందుకు అవి కృషి చేస్తున్నాయి. అందులో భాగంగానే మన దేశంలోని చాలా కంపెనీలు క్లినికల్ ట్రయల్స్ మొదలెట్టాయి.
ఆగస్టు 3 నాటికే వ్యాక్సిన్ రిలీజ్ చేస్తామని రష్యా హెల్త్ మినిస్టర్ ప్రకటించారు. చైనా బ్రిటన్ కు చెందిన కంపెనీలు సెప్టెంబర్ నాటకి వ్యాక్సిన్ మార్కెట్ లోకి తేనున్నట్లు చెప్పాయి. మన దేశంలో దేశీయ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్స్ మాత్రం అక్టోబర్ నాటికి వ్యాక్సిన్ తీసుకొస్తామని ప్రకటించింది. భారత వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్), పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) సహకారంతో భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేస్తోంది. మరో వైపు ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం తయారు చేసిన వ్యాక్సిన విజయవంతంగా పని చేస్తోందని ఇది ఎలాంటి హాని కలిగించలేదని లాన్సెట్ సైన్స్ జర్నల్ ఎడిటర్ రిచర్చ్ హోర్టన్ వెల్లడించారు.
అసలు క్లినికల్ ట్రయల్స్ ఎట్లా జరుగుతాయి ఏఏ దశలు ఉంటాయో ఒకసారి చూద్దాం. వ్యాధులపై పోరాడే వజ్రాయుధం వ్యాక్సిన్. ప్రజలను సంపూర్ణ ఆరోగ్య వంతులుగా చేసే సంజీవని ఇది. ఒక వ్యాక్సిన్ తయారు చేయాలంటే సైంటిస్టుల తో సహా వందల మంది కఠోర శ్రమ అందులో దాగి ఉంటుంది. అన్నీ రకాల పరీక్షలు విజయవంతంగా పూర్తి చేశాకే దాన్ని మార్కెట్ లోకి విడుదల చేస్తారు. ఏ ఒక్క దశలోనూ దానిలో ఫలితం రాకపోతే అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అందుకని ప్రతి ఒక్క దశ అగ్నిపరీక్ష లాంటిదే. తయారు చేసిన వ్యాక్సిన్ మొదట ఎలుకలు, కుందేళ్ల మీద ప్రయోగిస్తారు. వాటిపై సత్ఫలితాలు వచ్చాక మనుషులపై ట్రయల్స్ మొదలెడతారు. ఈ ట్రయల్స్ నాలుగు దశల్లో జరుగుతుంది. 1) వలంటీర్ల ఎంపిక; 2) వ్యాక్సిన్ ప్రయోగం; 3) పనితీరుపై పరిశీలన; 4) ఫలితాల విశ్లేషణ.
వ్యాక్సిన్ అంటే ఏమిటి
వ్యాక్సిన్ అంటే బలహీనపడ్డ, చనిపోయిన వ్యాధికారక సూక్ష్మజీవి. లాటిన్ భాషలోని వాకా అనే మాట నుంచి వ్యాక్సిన్ వచ్చింది. లాటిన్ భాషలో వాకా అంటే ఆవు. వ్యాక్సిన్ అనే పదాన్ని బ్రిటన్ వైద్యుడు ఎడ్వర్డ్ జెన్నర్ తొలిసారి ఉపయోగించారు. 1798లో మశూచిపై పరిశోధనలు చేస్తున్నపుడు ఈ పేరు వాడుకలోకి వచ్చింది. శాస్త్రవేత్తలు ముందుగా వైరస్/బ్యాక్టీరియా కణాలను సేకరించి రసాయన చర్య ద్వారా వాటిని న్యూట్రలైజ్ (జీవం లేకుండా) చేస్తారు.
ఆ తర్వాత రసాయనాలతో ‘స్టెరిలైజ్’ చేస్తారు. దీంతో శాంపిల్‌లో ఇంకా అది బతికి ఉన్నా, వాటి మృతకణాల్లో ఏవైనా విషపదార్థాలు ఉన్నా అవన్నీ నూట్రలైజ్ అవుతాయి. దీనినే మనం వ్యాక్సిన్ అని పిలుస్తాం. ఇలాతయారు చేసిన దాన్ని మానవులపై ప్రయోగించే క్రమాన్ని క్లినికల్ ట్రయల్స్ అంటారు. క్లినికల్ ట్రయల్స్ కోసం వలంటీర్లను ఎంపిక చేస్తారు.
వలంటీర్ల ఎంపిక
వ్యాక్సిన్ తయారీలో వలంటీర్లను ఎంపిక చేయడం అత్యంత కీలకమైన దశ. క్లినికల్ ట్రయల్స్‌కు 18 ఏండ్లకు పైబడిన సంపూర్ణ ఆరోగ్యవంతులనే ఎంపిక చేస్తారు. బీపీ, షుగర్, ఆస్తమా, గుండెబ్బులు, కిడ్నీ సంబంధ సమస్యలు వంటి దీర్ఘకాలిక రోగాలు లేనివారినే ఎంపిక చేస్తారు. ఆ రోగాల ప్రభావం వ్యాక్సిన్ పనితీరుపై పడకూడదనే ఉద్దేశంతో ఆరోగ్య వంతులను ఎంపిక చేస్తారు.
అనుమతులు
వలంటీర్ల రక్తనమూనాలు సేకరించి ఢిల్లీలోని సెంట్రల్ కమిటీకి పంపిస్తారు. అక్కడ ఆ రక్తంలో హిమోగ్లోబిన్ శాతం, రక్తానికి సంబంధించిన పూర్తి సమాచారం, హెచ్‌ఐవీ వంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయా? అని పరీక్షిస్తారు. ఇందులో హిమోగ్లోబిన్ శాతం ప్రధానమైనది. చివరగా నివేదికలన్నీ పరిశీలించి వలంటీర్ల తుది జాబితాను తయారుచేస్తారు.నిమ్స్‌లో కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్‌కు 200 మందికిపైగా ముందుకురాగా 60 మంది శాంపిళ్లను ఢిల్లీకి పంపినట్టు సమచారం. అందులో ఎంపిక చేసిన ఇద్దరిపై సోమవారం టీకా ప్రయోగం జరిగింది. మంగళవారం ఈరోజు మరో ఆరుగురికి ఇవ్వనున్నారు.
క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా భారత్ బయోటెక్ రూపోందించిన టీకాను సోమవారం నిమ్స్ లో ఇద్దరు వలంటీర్లకు మూడు మైక్రోగ్రాముల చొప్పున ఇచ్చారు. 24 గంటల పాటు వీరిని ఆస్పత్రి ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, ఆ తర్వాత డిశ్చార్జి చేస్తారు. బయట తిరిగితే ఇన్‌ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉండటంతో వీరిని పూర్తిగా ఇంటికే పరిమితం చేయనున్నారు. వైద్యులు వీడియో కాల్‌లో రోజూ వలంటీర్ల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తారు. ఈ సమయంలో వీరికి అవసరమైన పౌష్టికాహారం సహా అన్ని రకాల మందులను అందజేస్తారు.
14 రోజుల తరువాత శరీరంలో యాంటీబాడీస్ ఏ మేరకు వృద్ధి చెందాయి? వ్యాక్సినేషన్ తర్వాత ఏమైనా అనారోగ్య సమస్యలు తలెత్తాయా? వంటివి విశ్లేషించి, వచ్చే ఫలితాలను బట్టి వీరికి అదే బ్యాచ్‌కి చెందిన ఆరు మైక్రో గ్రాముల చొప్పున రెండో డోస్ ఇస్తారు. కాగా, నిమ్స్‌లో ప్రయోగానికి ఎంపిక చేసిన 60 మంది వలంటీర్లకు… కరోనా సహా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న వారి పేర్లను ఐసీఎంఆర్‌కు పంపారు. ఫిట్‌నెస్ అనుమతి వచ్చాకే వారికి వ్యాక్సిన్ డోస్ ఇస్తారు.
డోస్ పరిమాణం
ఎంపికైన వలంటీర్లలో కొందరిపై మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తారు. తక్కువ మోతాదులో డోస్ ఇచ్చి పరీక్షలు చేస్తారు. ఫేజ్-2, ఫేజ్-3లో డోస్ పరిమాణాన్ని, వలంటీర్ల సంఖ్యను పెంచుతారు.
పరీక్షలు ఎలా చేస్తారు.
ప్రయోగించిన నాలుగైదు రోజుల తర్వాత వ్యాక్సిన్ పనిచేయడం మొదలవుతుంది. మొదటిదశలో వలంటీర్లను 14 రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు. డాక్టర్లు తరుచూ వారిని పరీక్షిస్తారు. ఫేజ్-2లో నిర్ణీత సంఖ్యలో స్త్రీలు, పురుషులను ఎంపిక చేస్తారు. ఇందులో 18 ఏండ్ల నుంచి వృద్ధుల వరకు వివిధ వయస్కులవారు ఉంటారు. వారికి వివిధ పరిమాణాల్లో వ్యాక్సిన్ డోస్ ఇస్తారు. ప్రారంభంలోనే ఏవైనా దుష్ప్రభావాలు కనిపిస్తే వెంటనే చికిత్స అందించి నయం చేస్తారు. ఫేజ్-3లో వేలమందిపై ప్రయోగాలు చేస్తారు.