కరోనా ఎఫెక్ట్ : కేరళ,కర్ణాటక సరిహద్దుల్లో హై అలర్ట్

  • Published By: chvmurthy ,Published On : February 4, 2020 / 05:02 AM IST
కరోనా ఎఫెక్ట్ : కేరళ,కర్ణాటక సరిహద్దుల్లో హై అలర్ట్

Updated On : February 4, 2020 / 5:02 AM IST

చైనాలోని వూహాన్ నగరంలో ప్రబలిన ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. వూహాన్ నగరం నుంచి మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు తిరిగి వచ్చిన విద్యార్థుల్లో వ్యాధి  లక్షణాలుండటంతో వారిని ఆసుపత్రుల్లోని ఐసోలేషన్ వార్డులకు తరలించి పరీక్షిస్తున్నారు. కేరళలో 3 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటక రాష్ట్రంలో 51 మంది చైనా నుంచి రాగా వారిని  ఐసోలేషన్ వార్డులకు తరలించి చికిత్స చేస్తున్నారు.
 

కరోనా వైరస్ దెబ్బతో కేరళ, కర్ణాటక రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దుల్లోని  కాసరగూడులో  ప్రాణాంతకమైన కరోనా వైరస్  బయటపడటంతో రెండు  రాష్ట్రాలు సరిహద్దుల్లో  భద్రత కట్టుదిట్టం చేశాయి. కేరళకు అనుబంధంగా ఉన్న కొడగు, మంగళూరు, చామరాజనగర్‌, మైసూరు జిల్లాలకు వెళ్ళే అన్ని మార్గాలలోనూ నిఘా ఏర్పాటు చేయమని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం  ఆదేశాలు జారీ చేసింది. వైద్య ఆరోగ్యశాఖ నుంచి వెలువడిన ఉత్తర్వుల మేరకు సరిహద్దు జిల్లాల్లో వైరస్‌ లక్షణాలతో కనిపించిన వారి వివరాలు వెంటనే తెలియచేయాలని పేర్కోన్నారు. 
 

పూనెలోని జాతీయ క్లినికల్‌ ల్యాబరేటరీల నుంచి నివేదికలు రావడం ఆలస్యం అవటంతో… బెంగుళురూలోనే స్థానికంగానే రెండు ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. బెంగళూరు మెడికల్‌ కాలేజ్, నిమ్హాన్స్‌  వద్ద ఉండే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవి) ల్యాబరేటరీలలో కరోనా వైరస్‌ అనుమానిత వ్యక్తులకు రక్త పరీక్షలు చేస్తున్నారు. జనవరి 21నుంచి ఇప్పటివరకు 84మంది రక్తనమూనాలు  పరీక్షించగా వీరిలో 28మందికి వైరస్‌ సోకలేదని తేలింది. శని, ఆదివారాలలో మరో 43 మంది నుంచి శాంపిల్స్‌ తీసుకుని పరీక్షిస్తున్నారు. 
 

పూణే నగరంలోని జాతీయ వైరాలజీ ఇన్ స్టిట్యూట్‌కు 44 శాంపిల్స్ రాగా దీనిలో 29శాంపిల్స్ నెగిటివ్ అని తేలింది. ఒడిశా లోని కటక్ లో 8 మంది కరోనా వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరగా వారిలో  ఐదుగురికి వైరస్ లేదని వెల్లడైంది. కరోనా వైరస్ లక్షణాలున్న ఓ మహిళ, మరో వైద్యవిద్యార్థినిని కటక్ వైద్యకళాశాల ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స చేస్తున్నారు.
 

చైనాలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్నందున… అక్కడనుంచి వచ్చినవారు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఈ వైరస్ వలన చైనాలో మొదట రోజు 10 నుంచి 20  మంది మరణించేవారు.  కానీ ఇప్పుడు ఆ సంఖ్య భారీగా పెరిగిపోతుండటంతో షాక్ అవుతున్నారు.  మొన్నటి రోజున 58 మందిని పొట్టిన పెట్టుకున్న కరోనా నిన్నటి రోజున ఏకంగా 64 మందిని బలి  తీసుకుంది. ఈరోజు ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.  
 

ఇప్పటి వరకు కరోనా వైరస్ కాటుకు చైనాలో మృతి చెందిన వారి సంఖ్య 425కు చేరింది. మంగళవారం ఉదయం వరకు ఆ దేశంలో 20,438 కేసులు నమోదయ్యాయి. వైరస్ బాధితులు రోజు రోజుకు  పెరుగుతుండటంతో ప్రపంచదేశాలు అప్రమత్తం అవుతున్నాయి. ఇప్పటికే భారత్ సహా 25 దేశాల్లో కరోనా వైరస్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా వైరస్ కు తగిన మెడిసిన్ ను తయారు చేసే  పనిలో అన్ని దేశాలు నిమగ్నమయ్యాయి.

ఇండియాలో కూడా ఈ వైరస్ ప్రవేశించడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.  వైరస్ లక్షణాలు ఉన్న వారు తమ ఇళ్ళలోనూ 14 రోజులు  వేరుగా నిద్రించాలని, జలుబు, దగ్గు వస్తే తప్పనిసరిగా కర్చీఫ్‌ ఉంచుకోవాలని, కుటుంబ సభ్యులకు సాధ్యమైనంత దూరంగా ఉండాలని సూచించింది.