ఇదేం ఆహ్వానంరా బాబూ..! పెళ్లికి రావాలని గెస్టులకు ఇన్విటేషన్.. ఆ ఖర్చులు మీవేనంటూ అదిరిపోయే ట్విస్ట్
ఇటలీలోని ఫ్లోరెన్స్ కు చెందిన ఓ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ కు సిద్ధమైంది. ఇందుకోసం బంధువులు, స్నేహితులకు తమ పెండ్లికి రావాలని ఇన్విటేషన్లు పంపించారు.

Destination Wedding
Italy destination wedding: పెండ్లి సమయంలో కుటుంబ సభ్యులతోపాటు బంధువులు, స్నేహితులు, అతిథులను ఆహ్వానిస్తాం. పెండ్లికి వచ్చిన వారికి వసతి సౌకర్యాలతోపాటు భోజన సదుపాయాలు కల్పిస్తాం. ఇందుకోసం పెండ్లి కుటుంబం స్థాయికి తగిన విధంగా ఖర్చు పెడుతుంది. విదేశాల్లో జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే అక్కడి ఏర్పాట్లపై కాస్త ఎక్కువ అంచనాలే ఉంటాయి. అంత ఖర్చు పెట్టుకుని పెళ్లికి వెళ్లినందుకుగాను అక్కడి ఏర్పాట్లతో ఎంజాయ్ చేయొచ్చునని ఆ పెళ్లికి వెళ్లే గెస్టులు భావిస్తారు. అయితే, ఇటలీలోని ఫ్లోరెన్స్ లో కాబోయే దంపతులు గ్రాండ్ గా జరగబోయే తమ పెండ్లికి రావాలంటూ అతిధులకు ఇన్విటేషన్ ఇచ్చారు. ఆ ఇన్విటేషన్ కార్డులో అందిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు.
ఇటలీలోని ఫ్లోరెన్స్ కు చెందిన ఓ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ కు సిద్ధమైంది. ఇందుకోసం బంధువులు, స్నేహితులకు తమ పెండ్లికి రావాలని ఇన్విటేషన్లు పంపించారు. అయితే, ఆ ఇన్విటేషన్ లో కీలక విషయాన్ని పొందుపర్చారు. మా పెండ్లికి వచ్చేవారు భోజనం ఖర్చు మీరే పెట్టుకోవాల్సి ఉంటుందని, భోజనం డబ్బులు రూ.3800 చెల్లించాలని ఆ ఇన్విటేషన్ లో రాశారు. ఇదిచూసిన ఓ గెస్ట్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తాను ఉంటున్న కెనడాలోని వాన్ కోవర్ నుంచి ఆ పెండ్లికి విమానంలో వెళ్తే అయ్యే ఖర్చే ఎక్కువగా ఉంటుంది.. ఆపై భోజనానికి ఖర్చులుకూడా తానే భరించాలంటే ఎలా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని తన సోషల్ ప్లాట్ ఫాం రెడిట్ ద్వారా పంచుకున్నాడు. ఇదిచూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
రెడిట్ పోస్టుకు నెటిజెన్స్ నుండి భారీ స్పందన కనిపించింది. టిఫిన్ బాక్స్ తీసుకొని పోతే ఖర్చు తప్పుతుంది అంటూ పలువురు నెటిజన్లు సలహా ఇవ్వగా.. పెండ్లికి పోయి డిన్నర్ మాత్రం బయట హోటల్ లో చేయాలంటూ మరికొందరు నెటిజన్లు సలహా ఇచ్చారు. అయితే, ఇన్విటేషన్ అందుకున్న వ్యక్తిమాత్రం పెండ్లి దంపతుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదేం మర్యాద అంటూ అసహనాన్ని బయటపెట్టాడు. చిన్న నగదు బహుమతి ఇద్దామనుకున్నా కానీ, ఇక అది ఇవ్వాల్సిన అవసరం లేదనిపిస్తోంది అని పేర్కొన్నాడు.