Dad Kill Kids : పిశాచాలవుతారని, పాము డీఎన్ఏ ఉందని.. పిల్లలను చంపిన తండ్రి
మూఢ నమ్మకాలతో ఇద్దరు పసిపిల్లల ప్రాణాలను బలి తీసుకున్నాడో కసాయి తండ్రి. వారి శరీరంలో పాము డీఎన్ఏ ఉందని, వారు పిశాచాలై ప్రపంచాన్ని నాశనం చేస్తారన్న అపో

Dad Kill Kids
Dad Kill Kids : ఇది టెక్నాలజీ యుగం. సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది. స్పేస్ టూరిజం పేరుతో మనిషి ఆకాశానికి నిచ్చెన వేస్తున్న రోజులివి. అలాంటి ఈ రోజుల్లోనూ కొందరు మనుషుల్లో మార్పు రావడం లేదు. మూఢనమ్మకాల్లో మునిగి తేలుతున్నారు. అంధ విశ్వాసాలతో మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. ప్రాణాలు తీసుకునేందుకే కాదు తియ్యాడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా జరిగిన ఓ ఘటన అందరిని ఉలిక్కిపడేలా చేసింది.
మూఢ నమ్మకాలతో ఇద్దరు పసిపిల్లల ప్రాణాలను బలి తీసుకున్నాడో కసాయి తండ్రి. వారి శరీరంలో పాము డీఎన్ఏ ఉందని, వారు పిశాచాలై ప్రపంచాన్ని నాశనం చేస్తారన్న అపోహలతో అత్యంత పాశవికంగా హత్య చేశాడు. చేపలను వేటాడే గాలం బాణంతో పొడిచి చంపేశాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన అమెరికాలో జరిగింది. ఈ ఘటన వివరాలను ఎఫ్‌బీఐ అధికారులు వెల్లడించారు.
కాలిఫోర్నియాలోని మాథ్యూ టేలర్ కోల్ మన్ (40) అనే వ్యక్తి ఆగస్టు 7న రెండేళ్లు, పది నెలల వయసున్న తన ఇద్దరు పిల్లలను ఇంటి నుంచి తీసుకెళ్లాడు. భార్య అడిగితే పిక్నిక్ కు తీసుకెళ్తున్నానని చెప్పాడు. కానీ ఎక్కడికో చెప్పలేదు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్పందించకపోవడంతో అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్ లొకేషన్ ఆధారంగా అతడు మెక్సికో వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.
తిరిగి దేశంలోకి ప్రవేశించగానే అతడిని అరెస్ట్ చేశారు. పిల్లలను ఏం చేశావ్? అని ప్రశ్నిస్తే చంపేశానన్నాడు. ‘‘నా పిల్లల్లో పాము డీఎన్ఏ ఉంది. క్యువానన్ (అమెరికాలో ఓ మూఢాచారం. పిల్లలను ఎత్తుకెళ్లి చంపి తినేస్తారన్న కల్పిత సిద్ధాంతం), ఏవో తెలియని అతీత శక్తులు నాకు ఆ విషయాన్ని చెప్పాయి. వారు పెరిగి పెద్దయి రాక్షసుల్లా మారుతారు. అందుకే వారి బారి నుంచి ప్రపంచాన్ని కాపాడాను. చేపలను వేటాడే గాలం బాణంతో చంపేశాను. అయితే, పిల్లలకు నా భార్య నుంచే ఆ పాము డీఎన్ఏ వచ్చింది’’ అని అతడు చెప్పాడు.
కసాయి తండ్రి చేసిన పని పోలీసులను షాక్ కి గురి చేసింది. ఎందుకిలా చేశావ్ అంటే.. ‘ప్రపంచాన్ని కాపాడాను’ అంటూ అతడిచ్చిన సమాధానం మరింత ఆశ్యర్యానికి గురి చేసింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. మూఢ నమ్మకాలతో ఆ తండ్రి చేసిన పని అందరిని నిర్ధాంతపోయేలా చేసింది. ఈ రోజుల్లోనూ ఇలాంటి నమ్మకాలు ఏంటని మండిపడుతున్నారు. తండ్రి మూఢ విశ్వాసాలకు అభంశుభం తెలియని చిన్నారులు బలైపోవడం అందరిని ఆవేదనకు గురి చేసింది.