Kamala Harris: డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ కుటుంబ నేపథ్యం.. రాజకీయ ప్రస్థానం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమోక్రాటిక్ పార్టీ తరపున కమలా హారిస్ పోటీ చేస్తున్నారు. 59ఏళ్ల కమల హారిస్.. భారత, ఆఫ్రికా సంతతికి చెందిన అమెరికా పౌరురాలు.

Kamala Harris
Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమోక్రాటిక్ పార్టీ తరపున కమలా హారిస్ పోటీ చేస్తున్నారు. 59ఏళ్ల కమల హారిస్.. భారత, ఆఫ్రికా సంతతికి చెందిన అమెరికా పౌరురాలు. ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ నుంచైనా, డెమోక్రాటిక్ పార్టీ తరపునైనా ఓ భారతీయ అమెరికన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతుండటం ఇదే తొలిసారి. అయితే, ఎన్నికల ప్రచారపర్వంలో.. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై మాటల తూటాలు పేల్చుతూ అధ్యక్ష పీఠం నాదేనని కమలా హారిస్ బలంగా చెబుతున్నారు. రేపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కమలా హారిస్ జీవిత విశేషాలు తెలుసుకుందాం..
కమలా హారిస్ కుటుంబ నేపథ్యం..
కమలా హారిస్ 1964 అక్టోబర్ 20న కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు డోనాల్డ్ J. హారిస్, శ్యామలా గోపాలన్. కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్ భారతీయురాలే. శ్యామల తండ్రే పీవీ గోపాలన్. తమిళనాడుకు చెందిన ఆయన.. భారత ప్రభుత్వ అధికారిగా వివిధ హోదాల్లో పనిచేశారు. శ్యామల 1958లో ఉన్నత చదువులకోసం కాలిఫోర్నియా వెళ్లారు. 25ఏళ్ల వయస్సులో డాక్టరేట్ పూర్తిచేసి రొమ్ము క్యాన్సర్ పై పరిశోధనలు జరిపారు. జమైకాకు చెందిన డొనాల్డ్ హారిస్ ను వివాహం చేసుకున్నారు. వీరికి పుట్టిన తొలి సంతానం కమలాహారిస్. రెండో సంతానం మాయ. అయితే, కమలాహారిస్ తల్లిదండ్రులు 1972లో విడిపోయారు. వీరు ఎక్కువగా తల్లి శ్యామలగోపాల్ వద్దనే పెరిగారు. పెరుగుతున్న సమయంలో కమలా హారిస్ భారతీయ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. పలుసార్లు తల్లితో కలిసి కమలాహారిస్ చెన్నై వచ్చింది.
తల్లితో అనుబంధం ..
కమలా హారిస్ తల్లి 2009లో రొమ్ము క్యాన్సర్ తో మరణించింది. 2022 మదర్స్ డే సందర్భంగా తన ఫేస్ బుక్ పోస్ట్ లో కమలా హారిస్ తన తల్లి చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. కమలా, మీరు చాలా పనులు చేయడంలో మొదటి వ్యక్తి కావచ్చు. మీరు చివరి వారు కాదని నిర్దారించుకోండి అని చెప్పినట్లు హారిస్ పేర్కొన్నారు. అదేవిధంగాన ఓసారి తమిళనాడులోని తన పుట్టింటికి తీసుకెళ్లి నాకు మామయ్య, అత్తయ్య, పిన్ని.. బంధువులందరిని ఆ అమ్మ పరిచయం చేసిందని కమలా హారిస్ పేర్కొంది. ఆ తరువాత తల్లి కోరిక మేరకు, ఆమె చితాభస్మాన్ని బంగాళాఖాతంలో కలపడానికి ఇండియాకు వచ్చినట్లు కమల తెలిపారు.
విద్యాభ్యాసం..
కమలా హారిస్ విద్యావంతురాలు. ఆమె చిన్నతరంలో ఫ్రెంచ్ మాట్లాడే మిడిల్ స్కూల్ లో విద్యనభ్యసించారు. క్యూబెక్‌లోని వెస్ట్‌మౌంట్‌లోని వెస్ట్‌మౌంట్ హైస్కూల్‌లో 1981లో పట్టభద్రురాలయ్యింది. ఉన్నత పాఠశాల తరువాత ఆమె వాషింగ్టన్ డీసీలోని హోవార్డ్ యూనివర్శిటీలో చేరింది. 1986లో ఆ యూనివర్శిటీ నుండి పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్‌లో బీఏ పూర్తి చేశారు. ఆ తరువాత ఆమె లా విద్యకోసం కాలిఫోర్నియాకు వచ్చింది. 1989లో హేస్టింగ్స్ కాలేజీ నుండి లా డిగ్రీని పొందారు. ఆ సమయంలో నల్లాజాతీయుల లా స్టూడెంట్స్ అసోసియేషన్ కు అధ్యక్షురాలిగా పనిచేశారు. 1990 జూన్ నెలలో కాలిఫోర్నియా బార్ అసోసియేషేన్ లో కమలాహారిస్ చేరింది. 1990 – 98 మధ్యలో కాలిఫోర్నియాలోని ఓక్ లాండ్ లో డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీగా ఆమె పనిచేశారు. 2004లో జిల్లా అటార్నీగా పదోన్నతి పొందారు. 2010లో కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా ఎన్నికయ్యారు. ఆ పదవి చేపట్టిన మొదటి నల్లజాతి అమెరికన్ గా రికార్డు నమోదు చేశారు.
2014లో వివాహం..
కమలా హారిస్ డోగ్లాస్ ఎంహాఫ్ ను 2014లో వివాహం చేసుకున్నారు. స్నేహితులు ఏర్పాటు చేసిన బ్లైండ్ డేట్ లో మొదటిసారిగా కలుసుకున్న వారిద్దరూ ఏడాదికాలం ప్రేమించుకొని ఆ తరువాత 2014లో పెళ్లి చేసుకున్నారు.
రాజకీయ జీవితం..
2012లో డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ లో హారిస్ చిరస్మరణీయమైన ప్రసంగం చేశారు. 2017 జనవరి లో యూఎస్ సెనేట్ గా బాధ్యతలు స్వీకరించారు. 2021లో అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ తన సెనేట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కమలా హారిస్ 2021 జనవరి 20న యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా మొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు బలమైన అభ్యర్థిగా మారారు.