చైనా చాలా విషయాలు దాచిపెట్టింది: ట్రంప్

చైనా చాలా విషయాలు దాచిపెట్టింది: ట్రంప్

Updated On : April 2, 2020 / 3:22 PM IST

కరోనా మహమ్మారి పుట్టిన చైనా కంటే అమెరికాలోనే బాధితుల సంఖ్య అధికంగా ఉండటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సందేహం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌లో బీజింగ్ కొద్ది విషయాలు దాచి ఉంచిందని లా మేకర్స్ పేర్కొన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చైనా చెప్పిన లెక్కలు నిజమనెలా నమ్మాలని ప్రశ్నించారు. వారు చెప్పిన లెక్కల కన్నా నిజాలు మరింత ఘోరంగా ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. 

దాంతో పాటు చైనా దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌తోనూ మంచి సంబంధాలే ఉన్నాయని చెప్పడం గమనార్హం. అమెరికా ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్ ఆధారంగా ప్రచురితమైన బ్లూమ్‌బర్గ్‌ ఆర్టికల్  ప్రస్తావిస్తూ చైనాపై అసహనం వ్యక్తం చేశారు రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు. అంతర్జాతీయ సమాజాన్ని తప్పుడు లెక్కలతో మోసం చేస్తుందని మండిపడ్డారు. వైట్‌హౌస్‌కు పంపిన రిపోర్ట్ ప్రకారం.. ఉద్దేశపూర్వకంగానే తప్పుడు లెక్కలు చూపించినట్లు ఆరోపణలు గుప్పించారు. 

రిపబ్లికన్‌ పార్టీ విదేశీ వ్యవహారాల కమిటీ ఉన్నతాధికారి మైఖేల్‌ మెక్‌కాల్‌ స్పందిస్తూ.. కరోనాపై చేస్తున్న పోరాటంలో చైనాను నమ్మకూడదు. చైనా ముందు కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదనే విషయాన్ని దాచింది. ఆ నిజాన్ని బయటపెట్టేందుకు ప్రయత్నించిన జర్నలిస్టులు, వైద్యుల నోళ్లు మూయించింది. బాధితుల సంఖ్యలోనూ అబద్దాలాడి కప్పిపుచ్చుతోందంటూ చైనాపై విమర్శలు గుప్పించారు. 

ఇదే విషయంపై రిపబ్లికన్ పార్టీ సెనెటర్‌ బెన్‌ సస్సే స్పందిస్తూ బీజింగ్‌ చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలని కొట్టిపారేశారు. చైనా కంటే అమెరికాలో బాధితుల సంఖ్య ఎక్కువనే విషయాన్ని తోసిపుచ్చారు. బుధవారం నాటికి చైనా అధికారిక లెక్కల ప్రకారం 82వేల 361 కేసులు నమోదు కాగా అందులో 3వేల 316 మంది మరణించారు. మరోవైపు అమెరికాలో 2లక్షా 6వేల 207 కేసులు నమోదవ్వగా 4వేల 542 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Also Read | ‘లాక్‌డౌన్’ పద్మ వ్యూహంలో మోడీ…బైటపడే మార్గమేది? సిఎంల దగ్గర ప్లాన్ ఉందా?