ఎమర్జెన్సీ ఎత్తేసిన ట్రంప్: భయపడే దిగొచ్చాడా?

అగ్రదేశం అమెరికా అతి పెద్ద షట్ డౌన్‌కు విరామం లభించింది. ఇది తాత్కాలికమే నిధుల మంజూరు చేయకపోతే మళ్లీ ఎమర్జెన్సీ ప్రకటిస్తానంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్ల కారణంగా దిగొచ్చిన ట్రంప్ ‘ఇది ఫిబ్రవరి 15వరకూ మాత్రమే. అప్పటి లోగా మెక్సికో గోడ నిర్మాణానికి సంబంధించిన నిధుల మంజూరుపై కాంగ్రెస్ ఒప్పుకుని తీరాలి. లేదంటే మరోసారి ప్రభుత్వాన్ని మూసేసి ఎమర్జెన్సీ విధిస్తా. వేల మంది అమెరికన్లు ఇక్కట్లు పడుతున్నందున ఈ నిర్ణయానికి వచ్చాం. నా నిర్ణయంలో మార్పులేదు. కాంగ్రెస్ నిధులు మంజూరు చేయకపోతే వారి అనుమతి లేకుండానే నిధులు మంజూరు చేస్తా ‘ అంటూ షట్ డౌన్‌కు ట్రంప్ కాస్త ఉపశమనాన్ని ప్రకటించారు.
షట్‌డౌన్‌ను తాత్కాలికంగా ముగించడానికి సంబంధించిన ఒప్పందం శుక్రవారం మధ్యాహ్నం సెనెట్ ఆమోదాన్ని ప్రకటించింది. శనివారం తెల్లవారుజామున దీన్ని ఎలాంటి చర్చా లేకుండా కాంగ్రెస్ సమ్మతించింది. బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు. గతంలో 30 రోజుల పాటు షట్ డౌన్ ప్రకటించిన దాఖలాలేవు. అమెరికా చరిత్రలో ఇదే అత్యధికం. బిల్ క్లింటన్ హయాంలో 21 రోజులు జరిగింది.
ట్రంప్ ఎన్నికల ప్రచారంలో అధికారంలోకొస్తే మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. 5.7 బిలియన్ డాలర్లు ఖర్చవుతాయని అంచనా వేసిన గోడ నిర్మాణానానికి నిధులు మంజూరు చేయాలని ట్రంప్ పట్టుబట్టారు. అయితే డెమొక్రాట్ల ప్రాబల్యం ఉన్న కాంగ్రెస్ దాన్ని తిరస్కరించింది. రిపబ్లికన్లు కూడా మనస్ఫూర్తిగా దీన్ని సమర్థించలేదు. ఈ వ్యవహారం ముదిరి-ప్రతిష్టంభన నెలకొంది. పరిస్థితి తీవ్రతరం కావడంతో ప్రభుత్వ మూసివేతకు దారితీసింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం, హిల్లరీ క్లింటన్ ఈమెయిల్స్ హ్యాకింగ్‌కు సంబంధించి విచారణ జరుపుతున్న రాబర్ట్ మ్యూలర్ కమిషన్ ట్రంప్‌ను దిగొచ్చేట్లు చేసింది. ఎన్నికల ప్రచార బృందంలో కీలక సభ్యుడైన రోజర్ జేసన్ స్టోన్ జూనియర్‌ను ఎఫ్‌బీఐ ఆకస్మికంగా అరెస్టు చేసింది. రాజకీయ కన్సల్టెంటు, రచయిత, లాబీయిస్టుగా ముద్రపడ్డ రోజర్ స్టోన్ ట్రంప్‌కు నాలుగు దశాబ్దాలుగా ఆప్తుడు.