Donald Trump: ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ భద్రతా ఏర్పాట్లు.. హాజరయ్యే ప్రముఖులు వీరే..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షునిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Donald Trump
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షునిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వాషింగ్టన్ డీసీలో జరగబోయే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు. అయితే, ట్రంప్ ప్రమాణ స్వీకారం జరిగే వాషింగ్టన్ లో ఉష్ణోగ్రత మైనస్ 11 డిగ్రీల సెల్సియస్ ఉంటుందట. ఇదిలాఉంటే.. గతంలో 2017 నుంచి 2021 వరకు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ సేవలందించిన విషయం తెలిసిందే. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంకు వేలాది మంది హాజరయ్యారు. అయితే, ఈసారి గతంలోలా వేల మంది ప్రత్యక్షంగా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అవకాశం లేదు.. అత్యంత ప్రముఖులు మాత్రమే ప్రమాణ స్వీకారం ప్రాంగణంకు హాజరుకానున్నారు.
ప్రమాణ స్వీకారంకు ముందు ఇలా..
డొనాల్డ్ ట్రంప్ సోమవారం అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా తొలుత ఆయన సెయింట్ జాన్స్ ఎపిస్కోపల్ చర్చిలో ప్రార్థనలు చేస్తారు. ఆ తరువాత శ్వేతసౌధానికి వెళ్లి ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్, ఆయన సతీమణి ఇచ్చే తేనీటి విందులో పాల్గొంటారు. అక్కడి నుంచి ప్రమాణ స్వీకారం చేసే క్యాపిటల్ హిల్ కు చేరుకొని అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తారు. అనంతరం అమెరికా ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఆ తరువాత బైడెన్, కమలాహారిస్ లకు వీడ్కోలు కార్యక్రమం ఉంటుంది.
ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే ప్రముఖులు వీరే..
డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలు దేశాలకు చెందిన అధినేతలు, వ్యాపార ప్రముఖులు, ఇతర రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ, వాంగేరియన్ ప్రధాన మంత్రి విక్టర్ ఓర్బన్, చైనా అధ్యక్షుడి తరపున ఆయన బృందం పాల్గొంటుంది. భారతదేశం నుంచి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయా, పలు దేశాలకు చెందిన మాజీ అధ్యక్షులు కూడా పాల్గోనున్నారు. వ్యాపార ప్రముఖుల్లో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, యాపిల్ సీఈవో టిమ్ కుక్, మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్, టిక్ టాక్ సీఈవో షో జిచెవ్ పాల్గొంటారు. అదేవిధంగా భారతదేశం నుంచి ముఖేష్ అంబానీ, నీతా అంబానీలు కూడా హాజరవుతున్నట్లు తెలుస్తుంది.
డుమ్మాకొట్టనున్న మిచెల్ ఒబామా..
అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనైనా మాజీ అధ్యక్షులు, వాళ్ల సతీమణులు హాజరుకావడం ఆనవాయితీగా వస్తుంది. అయితే, ఈసారి ఆ ఆనవాయితీకి ఒబామా సతీమణి, మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా గైర్హాజరవుతున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి తాను హాజరుకావడం లేదని ఆమె ముందస్తుగా సమాచారం ఇచ్చారు. ఇదిలాఉంటే.. ట్రంప్ ప్రమాణ స్వీకారంకు క్యాపిటల్ భవనంపై దాడి నిందితులకు కూడా ఆహ్వానం అందింది. 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన మద్దతు దారులు వాషింగ్టన్ లోని క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్లారు. దీంతో వారిపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వారిని కూడా తన ప్రమాణ స్వీకారోత్సవానికి ట్రంప్ ఆహ్వానించారు.
భారీ భద్రత ఏర్పాటు..
ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం నేపథ్యంలో వాష్టింగన్ లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. వాష్టింగన్ నగరానికి దాదాపు 30మైళ్ల పరిధిలో తాత్కాలిక కంచెను ఏర్పాటు చేశారు. 25 వేల నుంచి 30వేల మంది భద్రతా సిబ్బందిని ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో భద్రత కోసం వినియోగిస్తున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా నిరసనలు వ్యక్తమవుతాయన్న వార్తల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ పై రెండుసార్లు హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీక్రెట్ సర్వీస్ ఏజెట్లు ముందుగానే అనుమానితులను అరెస్టు చేశారు.