ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. కొత్త పార్టీ పెట్టేందుకు ఏర్పాట్లు..? మస్క్ పెట్టిన పోల్‌కు భారీ రెస్పాన్స్.. ఏకంగా 81శాతం మద్దతు
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడా..? డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడా..

Elon Musk
Elon Musk: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడా..? డొనాల్డ్ ట్రంప్ కు గట్టి ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే, మస్క్ ఇప్పటికే కొత్త పార్టీ పెట్టేందుకు ఏర్పాట్లుసైతం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. తాజాగా.. తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ‘కొత్త రాజకీయ పార్టీని పెట్టే సమయం ఆసన్నమైందా..?’ అంటూ మస్క్ పోల్ పెట్టాడు. మస్క్ పోల్‌కు నెటిజన్ల నుంచి భారీ మద్దతు లభించింది. పోల్‌లో పాల్గొన్న వారిలో 81శాతం మంది మస్క్ కొత్త పార్టీ పెట్టాలంటూ మద్దతు పలికారు.
Also Read: ఎలాన్ మస్క్‌కు బిగ్‌షాక్.. ట్రంప్‌తో విభేదాల ఎఫెక్ట్.. టెస్లా షేర్లు ఢమాల్.. 13లక్షల కోట్లు నష్టం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ ల మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఇరువురు పరస్పరం సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా.. మస్క్ డొనాల్డ్ ట్రంప్ పై సంచలన ఆరోపణలు చేశారు. పెద్ద బాంబు లాంటి విషయాన్ని చెప్పాల్సిన సమయం వచ్చింది. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ పేరు ఉంది. అందుకే ఆ ఫైల్స్ వివరాలను బయటపెట్డడం లేదంటూ ఓ పోస్టు చేశాడు. బిగ్ బ్యూటీఫుల్ బిల్ వ్యవహారంలో మస్క్ తీరుతో తాను విసిగిపోయానంటూ ట్రంప్ మీడియా ముఖంగా చెప్పిన గంటలోపే మస్క్ ఈ ట్వీట్ చేయడం గమనార్హం. ఇటీవల డోజ్ శాఖ నుంచి ఎలాన్ మస్క్ వైదొలిగిన విషయం తెలిసిందే. డోజ్ శాఖ నుంచి వైదొలిగిన తరువాత నా వల్లే ట్రంప్ గెలిచారంటూ ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. ఆయన లేకున్నా గెలిచేవాడిని అంటూ ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. ఇలా ట్రంప్, మస్క్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. దీంతో ట్రంప్‌కు వ్యతిరేకంగా కొత్త రాజకీయ పార్టీ ద్వారా తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించాలని మస్క్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Is it time to create a new political party in America that actually represents the 80% in the middle?
— Elon Musk (@elonmusk) June 5, 2025
ఎలాన్ మస్క్ పెట్టిన పోస్టుకు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తుంది. కొత్తపార్టీ పెట్టాలంటూ మస్క్ కు పెద్ద సంఖ్యలో నెటిజన్లు సూచనలు చేస్తున్నారు. పోల్ కి 41లక్షలకుపైగా ఓట్లు రాగా.. ఐదు కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. పోల్ లో పాల్గొన్న వారిలో 81శాతం మంది కొత్త పార్టీ పెట్టాలంటూ మస్క్ కు మద్దతు పలికారు. 19శాతం మంది మాత్రమే కొత్త పార్టీ వద్దంటూ సూచనలు చేశారు.
నెటిజన్లు కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. కొందరు లిబర్టేరియన్ పార్టీకి మద్దతు ఇవ్వాలని మస్క్ కు సూచనలు చేయగా.. అలా చేస్తే ఓట్లు చీలతాయి.. ఎప్పుడూ డెమోక్రాట్లే గెలుస్తారంటూ మరికొందరు వాదన చేస్తున్నారు. మొత్తానికి ఎలాన్ మస్క్ ఎక్స్‌లో పెట్టిన పోల్ అమెరికాలోనేకాక ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే, మస్క్ ఈ పోల్ ఆధారంగా కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు దూకుడుగా ముందుకెళ్తాడా.. లేదంటే లిబర్టేరియన్ పార్టీకి మద్దతు ఇస్తాడా..? మళ్లీ ట్రంప్ తో కలిసిముందుకెళ్తాడా..? అనేది వేచి చూడాల్సిందే.