ఉద్యోగం చేయకున్నా 15ఏళ్లుగా జీతం తీసుకుంటున్నాడు

ఉద్యోగం చేయకున్నా 15ఏళ్లుగా జీతం తీసుకుంటున్నాడు

Employee Accused Of Skipping Work For 15 Years

Updated On : April 22, 2021 / 9:43 PM IST

ఒక ప్రభుత్వ ఉద్యోగి 2005లోనే తాను చేస్తున్న ఉద్యోగం మానివేసినప్పటికీ..ఇప్పటికీ జాతం మాత్రం తీసుకుంటూనే ఉన్నాడు. ఇటలీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటలీలోని కాటాన్జారో నగరంలో ఉన్న పుగ్లీసీ సియాసియో ఆసుపత్రిలో సాల్వేటోర్ సుమాస్(67) పనిచేసేవాడు. అయితే 2005లో కొన్ని కారణాలతో సాల్వేటోర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అయితే, ఈ పదిహేనేళ్ళు ఉద్యోగం చేయకపోయినా ప్రతి నెల కచ్చితంగా జీతం తీసుకుంటున్నాడు. ఇప్పటివరకు అతనికి అందిన జీతం అక్షరాలా 5,38,000 యూరోలు.

సాల్వేటోర్ సుమాస్ బండారం ఎలా బయటపడింది
2016లో ఇటలీ ప్రధాని ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కొన్ని కఠినతర చట్టాలను తీసుకొచ్చారు. అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన వివరాలనూ పరిశీలించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న అన్ని మోసాలను బయటకు తీయాలని పేర్కొన్నారు. దీంతో జరిపిన విచారణలో ఈ విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ విషయం బయటపడటంతో పోలీసులు సాల్వేటోర్ సుమాస్ ని విచారిస్తున్నారు.

సాల్వేటోర్ తో పాటు ఆసుపత్రికి చెందిన ఆరుగురు మేనేజర్లను కూడా ఈ కేసులో బుక్ చేశారు పోలీసులు. సుమాస్ డ్యూటీకి రాకపోయినా హాజరు ఎలా వేశారో అనే విషయంపై వారి నుంచి సమాచారం రాబడుతున్నారు. పోలీసులు హాజరు, జీతం రికార్డులతో పాటు సహోద్యోగుల నుంచి కొంత సమాచారం సేకరించారు. ఆ సమాచారం ప్రకారం.. 2005లో ఆ ఆసుపత్రి డైరెక్టర్ ను తనపై క్రమశిక్షణా చర్యలకు సిఫారసు చేయవద్దని బెదిరించాడు. ఆ గొడవ కారణంగా అతను ఆసుపత్రికి రావడం మానేశాడు. ఆ తర్వాత డైరెక్టర్ కూడా పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత వచ్చిన డైరెక్టర్ లేదా మానవ వనరుల విభాగం(హెచ్ఆర్ డిపార్ట్మెంట్) కూడా ఎప్పుడూ సాల్వేటోర్ సుమాస్ హాజరును పట్టించుకోలేదు అని పోలీసులు చెప్పారు.