6వేల ఆవులతో వెళ్తూ మునిగిపోయిన షిప్

న్యూజిలాండ్ నుంచి చైనాకు పశువులను తీసుకెళుతున్న ఓ నౌక… బుధవారం రాత్రి జపాన్ సమీపంలో మునిగిపోయింది. న్యూజిలాండ్ లోని నేపియర్ నౌకాశ్రయం నుంచి ఆగస్టు-14న ఈ నౌక బయలుదేరింది. చైనా తూర్పు తీరంలోని తాంగ్ షాన్ ఓడరేవును చేరుకోవాల్సి ఉంది. 42 మంది సిబ్బంది, దాదాపు 6 వేల ఆవులతో చైనా వస్తోన్న ఈ నౌక.. తుపాను కారణంగా మునిగిపోయినట్లు భావిస్తున్నారు.
ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయడపడ్డ ఓడ సిబ్బందిలో ఒకరిని జపాన్ కోస్ట్ గార్డ్(నావికాదళం) కాపాడింది. జపాన్ దక్షిణ ద్వీపం సమీపంలో నీటిలో లైఫ్ జాకెట్ సాయంతో తేలియాడుతున్న సిబ్బందిని నౌకాదళం నిఘా విమానం పీ-3సీ గుర్తించింది. అనంతరం అతనని తీరప్రాంత గస్తీ సిబ్బంది కాపాడారు. ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి ఫిలిప్పీన్స్కు చెందినవాడని జపాన్ అధికారులు తెలిపారు. అతను ఆరోగ్యంగానే ఉన్నాడని, నౌక ప్రమాదం గురించి అతడే సమాచారం ఇచ్చాడని స్పష్టం చేశారు.
https://10tv.in/ncrb-suicides-report-revealed-suicide-rate-high-in-men-than-women-in-india/
అతనిచ్చిన సమాచారం ప్రకారం తూర్పు చైనా సముద్రంలో మునిగిపోయిన ఓడ కోసం గాలింపు చేపట్టినట్లు చెప్పారు. అయితే, మేసాక్ తుపాను కారణంగా ఆ ప్రాంతంలో వాతావరణం సంక్లిష్టంగా ఉందని జపాన్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉందని, గాలింపు కొనసాగుతోందని తెలిపారు.
మునిగిపోయిన ఓడ.. యూఏఈకి చెందిన గల్ఫ్ నేవిగేషన్ కు చెందినదిగా గుర్తించారు. ఓడలోని 42 మంది సిబ్బందిలో 38 మంది ఫిలిప్పీన్స్కు చెందినవారు కాగా.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశస్థులు ఇద్దరు చొప్పున ఉన్నట్లు సమాచారం.