Fire accident : పాఠశాల వసతి గృహంలో భారీ అగ్నిప్రమాదం.. 13 మంది సజీవ దహనం
పాఠశాల వసతి గృహంలో మంటలు చెలరేగడంతో 13 మంది మరణించారు.

Fire
ఓ పాఠశాల వసతి గృహంలో మంటలు చెలరేగడంతో 13 మంది మరణించారు. ఈ ఘోర ఘటన సెంట్రల్ చైనాలో చోటు చేసుకుంది.
చైనాకు చెందిన జిన్హువా వార్త సంస్థ వెల్లడించిన వివరాల మేరకు హెనాన్ ప్రావిన్స్‌లోని యన్‌షాన్‌పు గ్రామంలోని యింగ్‌కై పాఠశాల వసతి గృహంలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
రాత్రి 11 గంటల సమయంలో అగ్నిమాపక శాఖకు ఈ ఘటనపై సమాచారం అందినట్లు వెల్లడించింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానాకి చేరుకున్నారని, దాదాపు అరగంట పాటు శ్రమించి 11.38 సమయానికి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు చెప్పింది.
ఈ ఘటనలో 13 మంది మరణించారని, మరో వ్యక్తికి తీవ్రగాయాలు కాగా.. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే పాఠశాల హెడ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Cassandra Mae Spittmann : జర్మనీ సింగర్ నోట రామ్ ఆయేంగే పాట.. మోదీ ప్రశంసలు పొందిన ఆ సింగర్‌కి..
కాగా.. ఇది ఓ ప్రైవేటు పాఠశాల అని, ఇందులో నర్సరీ, ప్రాథమిక వయస్సు విద్యార్థులకు విద్యను అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. మరణించిన వారు చిన్నారులా, లేక పెద్ద వారా..? అన్న విషయాలను మాత్రం వెల్లడి కాలేదు. కాగా.. ఈ ఘటనపై శనివారం సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే.. చైనాలో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. గతేడాది నవంబర్‌లో షాంగ్సీ ప్రావిన్స్‌లోని లులియాంగ్ సిటీలో ఓ కంపెనీ కార్యాలయ భవనంలో అగ్నిప్రమాదం సంభవించడంతో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ఆస్పత్రిలో చేరారు. అంతకముందు ఏప్రిల్‌లో బీజింగ్‌లోని ఓ ఆస్పత్రి వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో 29 మంది మరణించారు.