పాకిస్తాన్‌లో కొత్త సర్వే: ప్రతి ఐదుగురిలో నలుగురుకి పాలన నచ్చట్లేదు..

పాకిస్తాన్‌లో కొత్త సర్వే: ప్రతి ఐదుగురిలో నలుగురుకి పాలన నచ్చట్లేదు..

పాకిస్తాన్‌లోని ప్రతి ఐదుగురిలో నలుగురు దేశం తప్పు దిశలో వెళుతోందని నమ్ముతున్నారట. ఈ మేరకు ఆ దేశంలో ఓ కొత్త సర్వే సంచలనం అవుతుంది. ఈ సర్వేను పరిశోధనా సంస్థ ఐపిఎస్ఓఎస్ వెల్లడించింది. దేశం సరైన దిశలో పయనిస్తోందని కేవలం 23 శాతం మంది మాత్రమే నమ్ముతున్నట్లుగా న్యూస్ ఇంటర్నేషనల్ నివేదించింది. 77 శాతం మంది ప్రజలు ప్రభుత్వ విధానాలు, అనుసరించే మార్గాలపై అసంతృప్తాగా ఉన్నట్లు నివేదిక చెబుతుంది. 1 డిసెంబర్ మరియు 2020 డిసెంబర్ 6 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 1,000 మందికి పైగా పాల్గొన్నారు.

గతేడాది నాల్గవ త్రైమాసికంలో, 21 శాతం మంది దేశం సరైన మార్గంలో ఉన్నదని నమ్మినట్లు ఇదే సర్వే వెల్లడించింది. 79 శాతం మంది వ్యతిరేక అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఈ సంవత్సరం 36 శాతం మంది తమ ప్రస్తుత ఆర్థిక స్థితి బలహీనంగా ఉందని, 13 శాతం మంది ఈ విషయాన్ని బలంగా చెప్పారని, 51 శాతం మంది దేశీయ విధానాలు బలంగా లేవని చెప్పారు. న్యూస్ ఇంటర్నేషనల్ ఈ మేరకు సమాచారం ఇచ్చింది.

గతేడాది గణాంకాలు ప్రకారం 38శాతం మంది తమ ఆర్థిక స్థితి బలహీనంగా ఉందని, 5 శాతం మంది బలంగా భావించారు. 57 శాతం మంది బలంగా ఉందో లేదా బలహీనంగా ఉందో చెప్పలేకపోయారు. ప్రావిన్స్ వారీగా వేసిన అంచనా నివేదికలో దాదాపు అన్ని ప్రావిన్సుల ఆర్థిక పరిస్థితి పేలవంగా ఉన్నట్లు గుర్తించారు. పేలవమైన ఆర్థిక స్థితికి దోహదపడే కారకాల జాబితాలో ద్రవ్యోల్బణం మొదటి స్థానంలో ఉంది. సింధ్‌లో, ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడానికి 20 శాతం మంది నిరుద్యోగులు, 17 శాతం కరోనా, 16 శాతం మంది పేదరికంలో ఉన్నట్లు చెప్పుకొచ్చింది సర్వే.

ఆర్థిక పరిస్థితుల కారణంగా పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో 23 శాతం మంది నిరుద్యోగంతో, ఎనిమిది శాతం మంది కరోనా కారణంగా, పేదరికంతో 14 శాతం మంది ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నట్లు సర్వే వెల్లడించింది. ఖైబర్ పఖ్తున్ఖ్వాలో 18 శాతం మంది నిరుద్యోగం, 12 శాతం కరోనా వైరస్ మరియు 8 శాతం పేదరికం ఆర్థిక పరిస్థితికి కారణమని భావిస్తున్నారు. బలూచిస్తాన్ ప్రజలలో 25 శాతం మంది నిరుద్యోగం, రెండు శాతం కరోనా మరియు 25 శాతం పేదరికం ఆర్థిక పరిస్థితులకు కారణమని సర్వేలో వెల్లడించారు.