Coronavirus France : ఫ్రాన్స్‌లో కరోనా కల్లోలం.. రికార్డు స్థాయిలో 2 లక్షలకు చేరిన కొత్త రోజువారీ కేసులు

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వదిలేలా లేదు. రోజురోజుకీ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఐరోపా దేశాల్లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఫ్రాన్స్‌లో కరోనా కల్లోలం రేపుతోంది.

Coronavirus France : ఫ్రాన్స్‌లో కరోనా కల్లోలం.. రికార్డు స్థాయిలో 2 లక్షలకు చేరిన కొత్త రోజువారీ కేసులు

France Hit By 'dizzying' Daily Record Of Over 2 Lakh New Covid Cases

Updated On : December 29, 2021 / 9:06 PM IST

Coronavirus in France : ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వదిలిపెట్టేలా లేదు. రోజురోజుకీ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఐరోపా దేశాల్లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ప్రత్యేకించి ఫ్రాన్స్ లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో ఫ్రాన్స్ దేశంలో 1,79,807 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో 2 లక్షల రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. కరోనా ఆరంభం నుంచి ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో రోజువారీ కేసులు నమోదైన దేశంగా ప్రాన్స్ నిలిచింది.

ఐరోపా ఖండంలోనూ రికార్డు స్థాయిలో కొత్త రోజువారీ కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల వ్యవధిలో ఫ్రాన్స్‌లో రోజుకు 90వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇదివరకే ఫ్రాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ కరోనా మహమ్మారి మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిస్తోంది. గత శనివారం రికార్డు స్థాయిలో 1,04,611 రోజువారీ కేసులు నమోదయ్యాయి. నవంబర్ 11, 2020 తర్వాత అత్యధిక స్థాయిలో రోజువారీ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.

కరోనా వైరస్ కట్టడికి ప్రాన్స్ ప్రభుత్వం కొత్త ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలను నిషేధించింది. పరిమితంగానే సమావేశాలకు అనుమతినిచ్చింది. రవాణా వ్యవస్థతో పాటు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం లాంటి ఆంక్షలను విధించింది. ఒకవైపు కొత్త కేసులు పెరుగుతున్నప్పటికీ కూడా ఆస్పత్రిలో కరోనా బాధితుల సంఖ్య పరిమితంగానే ఉన్నట్టు చెబుతున్నారు ఫ్రాన్స్ అధికారులు. ఫ్రాన్స్‌లో ప్రతిఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్లనే వైరస్ వ్యాధి తీవ్రత తగ్గిందని వైద్యాధికారులు అంటున్నారు.

ఆస్పత్రిలో చేరే కేసుల సంఖ్య కూడా చాలావరకు తగ్గిందని అంచనా వేస్తున్నారు. గత 24గంటల్లో కరోనా కారణంగా 290 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. దాంతో ఇప్పటివరకూ నమోదైన కరోనా మరణాల సంఖ్య 1,23,000కు చేరింది. మే తర్వాత ఒక్కరోజులో అత్యధిక సంఖ్యలో నమోదైన మరణాల సంఖ్య ఇదే.. ఫ్రాన్స్ జనాభాలో 77 శాతం మందికి పూర్తిగా టీకాలు అందాయి. ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య, మరణాల సంఖ్య భారీగా తగ్గినట్టు అంచనా వేస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో పలు దేశాలలో కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి.

Read Also : Central Government : ఈ-కామర్స్ పోర్టళ్లకు 15 నోటీసులు పంపిన కేంద్రం