AI Cure Diseases : వచ్చే 10 ఏళ్లలో AI అన్ని వ్యాధులను అంతం చేయగలదు : గూగుల్ డీప్‌మైండ్ సీఈఓ సంచలన వ్యాఖ్యలు..!
AI Cure Diseases : భవిష్యత్తులో AI అన్ని వ్యాధులను నిర్మూలిస్తుందా? 48 ఏళ్ల బ్రిటిష్ సైంటిస్ట్, గూగుల్ డీప్‌మైండ్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ డెమిస్ హస్సాబిస్ ఏమని సమాధానమిచ్చాడో ఇప్పుడు తెలుసుకుందాం.

AI Cure Diseases
AI Cure Diseases : ఏఐతో వ్యాధులను నయం చేయడం సాధ్యమేనా? అసలు ఏఐ వ్యాధులను ఎలా అంతం చేయగలదు? వాస్తవానికి, చాలా వ్యాధులు నయం అవ్వాలంటే చాలా ఏళ్ల సమయం పడుతుంది. కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా ఆ వ్యాధిని నియంత్రించడం సాధ్యపడదు.
ఏదైనా కొత్త వ్యాధి పుట్టుకొచ్చినప్పుడు దాని మూలం తెలిసి మందు కనుక్కోవడానికే ఏళ్లు పడతాయి. ఎంతగా వైద్యరంగంలో టెక్నాలజీ డెవలప్ అయినా ఇప్పటికీ మందులకు లొంగని ఎన్నో ప్రాణాంతక వ్యాధులు ఉన్నాయి. అంతుచిక్కని వ్యాధులను నిర్మూలించేందుకు అనే పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి.
అయితే, ఇలాంటి వ్యాధులన్నింటిని అంత చేయగల సామర్థ్యం ఒక ఏఐ టెక్నాలజీకి మాత్రమే ఉందని అంటున్నారు గూగుల్ డీప్‌మైండ్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ డెమిస్ హస్సాబిస్. ఇప్పుడు ఈ డీప్‌మైండ్ బాస్ చేసిన వ్యాఖ్యలు వైద్య రంగంలో సంచలనం రేకిత్తిస్తున్నాయి.
రాబోయే దశాబ్దంలో ఏఐ మోడల్స్ అన్ని వ్యాధులను నయం చేయగలవని ఆయన గట్టిగా విశ్వసిస్తు్న్నారు. ఏఐ అన్ని వ్యాధులను నయం చేయగలదని డెమిస్ వాదన సైన్స్ ఫిక్షన్ లాగా అనిపిస్తుంది. కానీ, ఒక ఏడాదిలో 200 మిలియన్ ప్రోటీన్లను మ్యాప్ చేయడంలో ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే అది సాధ్యమేనని అనిపించక మానదు. ఇదే జరిగితే.. ఏఐ ప్రపంచంలో కొత్త విప్లవాన్ని తీసుకురానుంది.
ఏఐ 10 ఏళ్లలో ప్రతి వ్యాధిని నయం చేస్తుందని గూగుల్ డీప్ మైండ్ సీఈఓ వాదన సంచలనం సృష్టించింది. దాదాపు ప్రతి పరిశ్రమలోనూ ఏఐ వాడకం ప్రారంభమైంది. కానీ, ఏఐ సామర్థ్యాన్ని ఇప్పుడే అంచనా వేయడం కష్టం.
Demis is a genius and he should be given all resources in the world to make this happen. pic.twitter.com/S97PSjz4jI
— Aravind Srinivas (@AravSrinivas) April 21, 2025
రాబోయే దశాబ్దంలో ఏఐ అన్ని వ్యాధులను నిర్మూలించగలదా? అంటే.. గూగుల్ డీప్‌మైండ్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ డెమిస్ హస్సాబిస్ ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆశ్చర్యకరంగా, ఆయన ప్రత్యర్థి పెర్ప్లెక్సిటీ ఏఐ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ కూడా డెమిస్ వాదనను సమర్థించారు.
ఏఐతో వ్యాధుల అంతం సాధ్యమే :
ఏప్రిల్ 20న సీబీఎస్ 60 మినిట్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. హస్సాబిస్ మాట్లాడుతూ.. “ఒక ఔషధాన్ని తయారుచేయడానికి సగటున 10 ఏళ్లు, బిలియన్ల డాలర్లు ఖర్చు అవుతుంది. మనం ఈ సమయాన్ని సంవత్సరాల నుంచి నెలలు లేదా వారాలకు తగ్గించవచ్చు.
ప్రస్తుత రోజుల్లో ఇది నమ్మశక్యం కానిదిగా అనిపించవచ్చు. కానీ, ప్రోటీన్ నిర్మాణాల గురించి తప్పక అవగాహన కలిగి ఉండాలి. మానవ ఆరోగ్యాన్ని విప్లవాత్మకంగా మారుస్తుంది. ఏదో ఒకరోజున ఏఐ సాయంతో మనం అన్ని వ్యాధులను నయం చేయవచ్చు.” అని పేర్కొన్నారు.
ఏఐ అన్ని వ్యాధులను అంతం చేయగలదా అని అడిగితే.. 48 ఏళ్ల బ్రిటిష్ సైంటిస్టు ఇలా సమాధానమిస్తూ.. “ఇది సాధ్యమేనని నేను భావిస్తున్నాను. బహుశా వచ్చే దశాబ్దంలో అది ఎందుకు జరగకూడదో నాకు ఎలాంటి కారణం కనిపించడం లేదు.” అన్నారు. డీప్‌మైండ్ బాస్‌కు మద్దతుగా పెర్ప్లెక్సిటీ ఏఐ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ సైతం మద్దతుగా నిలిచాడు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. “డెమిస్ ఒక మేధావి. ఈ అద్భుతం జరగాలంటే ఆయనకు ప్రపంచంలోని అన్ని వనరులు ఇవ్వాలి” అని తెలిపారు.
ఏఐ ఏడాదిలోనే బిలియన్ ఏళ్ల పీహెచ్డీ చేసింది :
200 మిలియన్ ప్రోటీన్ నిర్మాణాలను మ్యాప్ చేయడం ద్వారా ప్రస్తుత ఏఐ ఒక ఏడాదిలోనే బిలియన్ ఏళ్ల PhD సమయాన్ని పూర్తి చేసిందని హస్సాబిస్ అన్నారు. లింక్డిన్ సీఈఓ రీడ్ హాఫ్మన్తో ఇటీవల జరిగిన చర్చలో ఆయన ఇలా అన్నారు.. “గతంలో, ఒక పీహెచ్డీ విద్యార్థికి ప్రోటీన్ నిర్మాణాన్ని కనుగొనడానికి 4 నుంచి 5 సంవత్సరాలు పట్టేది.
ఏఐ కేవలం ఒక ఏడాదిలోనే 200 మిలియన్ ప్రోటీన్లను మ్యాపింగ్ చేయగలదు. ప్రోటీన్ పనితీరు మనకు తెలిస్తే.. ఒక వ్యాధి ఎలా వస్తుంది? అది ఎలా నయం చేయొచ్చో అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ప్రోటీన్ ఉపరితలంపై పనిచేసే మందులు, అణువులను మనం రూపొందించవచ్చు’’ అని పేర్కొన్నారు.